Maldives: మోదీపై విమర్శలు.. జైశంకర్‌కు శుభాకాంక్షలు!

PM Modi| ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల (Maldives) ఎంపీ జహీద్‌ రమీజ్‌ భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 11 Jan 2024 13:38 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల (Maldives) ఎంపీ జహీద్‌ రమీజ్‌ భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు (Jaishankar) శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ‘ఎక్స్‌’ వేదికగా విష్‌ చేశారు. ఈ ఏడాదంతా దౌత్య ప్రయత్నాలు సానుకూలంగా ఉండాలని ఆకాంక్షించారు. రమీజ్‌తో సహా ముగ్గురు మాల్దీవుల ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై దేశ విదేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ.. జైశంకర్‌కు ఆయన శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారత్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. దాంతో అక్కడి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. వారిని మంత్రి పదవుల నుంచి తొలగించింది. ఇక్కడితో శాంతించని నెటిజన్లు.. బాయ్‌కాట్ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్‌తో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారం తమ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అక్కడి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాన్ని త్వరితగతిన ముగించేలా చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. 

మరోవైపు, లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటన అనంతరం ప్రపంచ పర్యాటకుల చూపు.. భారత దీవులపై పడింది. వీటికోసం ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున శోధిస్తున్నారు. ఈ దీవుల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషిస్తున్న వారి సంఖ్య ఇరవై ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం వెల్లడించింది. అటు కేంద్రం కూడా లక్షద్వీప్‌లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు సిద్ధమవుతోంది. అక్కడ కొత్తగా మరో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు సమాచారం. మిలిటరీ, వాణిజ్య అవసరాల కోసం మినికోయ్‌లో నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని