MK Stalin: పక్షుల వలసలా.. మోదీ ఎన్నికల ప్రచారంపై స్టాలిన్ విసుర్లు

‘మోదీ గ్యారెంటీ’ పేరుతో ప్రధాని తమిళనాడులో ప్రచారం చేయడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విమర్శలు చేశారు.

Published : 11 Apr 2024 00:09 IST

చెన్నై: కేంద్రంలోని భాజపా (BJP) సర్కారుపై తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ (PM Modi)కి.. ఆయన ఇస్తున్న గ్యారెంటీలపై సవాల్‌ విసిరారు. ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఓ జాబితాను పోస్టు చేసిన స్టాలిన్‌.. అధికారంలో ఉన్న భాజపా అందులో ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించగలదా అని ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రంలో చేస్తున్న పర్యటనను పక్షుల వలసతో పోల్చారు.

ఒకవేళ వచ్చే ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తే దేశంలో నెలకొన్న పలు క్లిష్ట సమస్యలను మోదీ సర్కార్‌ పరిష్కరించగలదా అని సవాల్‌ విసిరారు. సీజన్‌లో పక్షులు వలస వచ్చినట్లుగా.. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ తమిళనాడులో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. హామీ కార్డుతో వచ్చిన ఆయన ఈ హామీలను ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల వ్యవహరం, చైనా ఆక్రమించిన భూభాగం, కులగణన వంటి అంశాలను జాబితాలో ప్రస్తావించారు. పౌరసత్వ చట్టానికి నోటిఫై చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలన్నారు.

భారత్‌లో ఎన్నికల ప్రచారం.. 25 దేశాల పార్టీలకు భాజపా ఆహ్వానం

షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లతో పాటు ఏటా రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించాలన్నారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి పరీక్ష (నీట్‌)ను మినహాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ పరీక్ష చట్టబద్ధతను సవాలు చేస్తూ గతేడాది తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని నీట్‌ దూరం చేస్తోందని, సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమని తన పిటిషన్‌లో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని