PM Modi: మన్మోహన్‌జీ చక్రాల కుర్చీలోనూ పనిచేశారు.. మాజీ ప్రధానిపై మోదీ ప్రశంసలు

PM Modi: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చక్రాల కుర్చీలో ఉన్నా దేశం కోసం పనిచేశారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఆయన ఎంపీలందరికీ ఆదర్శమన్నారు.

Updated : 08 Feb 2024 15:19 IST

దిల్లీ: రాజ్యసభ (Rajya Sabha)లో 56 మంది ఎంపీలు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం వారికి సభలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) మాట్లాడుతూ మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ (Congress) నేత మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh)పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన ఎంపీలందరికీ ఆదర్శమని కొనియాడారు. 

‘‘ఈ దేశానికి మన్మోహన్‌జీ చేసిన సేవ అపారం. సుదీర్ఘకాలం పాటు రాజ్యసభకు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుంది. రాజ్యసభలో ఇటీవల ఓ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ట్రెజరీ బెంచ్‌ గెలుస్తుందని తెలిసినప్పటికీ ఆయన వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటు వేశారు. ఓ సభ్యుడిగా తన విధుల విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నారనడానికి ఇదొక ఉదాహరణ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో ఉన్నా పనిచేశారు. ఎంపీలందరికీ ఆయన ఆదర్శం’’ అని మోదీ ప్రశంసించారు.

కాంగ్రెస్‌కు కాలం చెల్లింది.. రాజ్యసభలో ప్రధాని మోదీ

వారి బ్లాక్‌ పేపర్‌.. మాకు దిష్టిచుక్క..

ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ విడుదల చేసిన ‘బ్లాక్‌ పేపర్’ గురించి మోదీ ప్రస్తావించారు. ‘‘ఆ పత్రం మా ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిదే. మాపై చెడు చూపు పడకుండా చేస్తుంది. ప్రతిపక్షాల చర్యను మేం స్వాగతిస్తున్నాం’’ అని అన్నారు. తన పదేళ్ల పాలనపై కేంద్రంలోని అధికార భాజపా గురువారం ‘వైట్‌పేపర్‌’ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ‘బ్లాక్‌ పేపర్‌’ను విడుదల చేశారు. నిరుద్యోగం, ధరల కట్టడి, రైతుల సమస్యలను తీర్చడంలో కేంద్రం విఫలమైందని హస్తం పార్టీ ఈ పత్రంలో ఆరోపించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని