Farm Fires: పంట వ్యర్థాలు దగ్ధం చేయొద్దన్న అధికారితోనే..

పంజాబ్‌లో పంట వ్యర్థాలను దగ్ధం చేయకుండా అడ్డుకునేందుకు వెళ్లిన ప్రభుత్వాధికారితోనే రైతులు నిప్పు పెట్టించడం సంచలనంగా మారింది. 

Published : 05 Nov 2023 16:43 IST

చండీగఢ్‌: దేశ రాజధాని దిల్లీ (Delhi) సహా పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా పెరిగింది. పంజాబ్‌ (Punjab), హరియాణా (Haryna) ప్రాంతాల్లోని రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం ఈ పరిస్థితికి కారణమైంది. దీంతో పంజాబ్‌లో పంట వ్యర్థాలను తగులబెట్టకుండా ఆప్‌ సర్కారు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బఠిండాలో కొందరు రైతులు పంట వ్యర్థాలకు దగ్ధం చేయకుండా అడ్డుకున్న ప్రభుత్వ అధికారితోనే బలవంతంగా నిప్పు పెట్టించడం సంచలనంగా మారింది.

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) ఎక్స్‌లో షేర్‌ చేస్తూ.. రైతుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పంట వ్యర్థాలను దగ్ధం చేయొద్దని చెప్పేందుకు వచ్చిన ప్రభుత్వాధికారితోనే మీరు ఈ పని చేయించారు. మీరంతా ఆక్సిజన్‌ను ఆపేయాలనుకుంటున్నారా?’’ అని భగవంత్‌ మాన్‌ ప్రశ్నించారు. దీనికి బాధ్యులైన రైతులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. 

దిల్లీలో తగ్గని వాయు కాలుష్యం.. పాఠశాలలకు సెలవుల పొడిగింపు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పంజాబ్‌ ప్రభుత్వ అధికారి హర్‌ప్రీత్‌ సింగ్, బఠిండా సమీపంలోని మెహమా సర్జా గ్రామంలో పంట వ్యర్థాలను తగలపెట్టకుండా ఉండేలా రైతులను ఒప్పించేందుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న రైతు సంఘాల నాయకులు హర్‌ప్రీత్‌ను చుట్టుముట్టి ఆయనతోనే పంట వ్యర్థాలకు నిప్పు పెట్టించారని బఠిండా ఎస్పీ గుల్‌నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని