
Air Pollution: వారాంతపు లాక్డౌన్కు సిద్ధం.. దిల్లీ ప్రభుత్వం వెల్లడి
దిల్లీ: దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులపై సుప్రీంకోర్టు కూడ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు లాక్డౌన్ విధించడం, వర్క్ ఫ్రం హోం వంటి చర్యలు చేపట్టవచ్చేమో ఆలోచించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల సూచించింది. ఈ మేరకు అత్యవసర సమావేశం నిర్వహించి.. ఎలాంటి చర్యలు తీసుకోగలరో చెప్పాల్సిందిగానూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. ఇందులో భాగంగా దిల్లీ ప్రభుత్వం.. స్థానికంగా వారాంతపు లాక్డౌన్, వారం పాటు వర్క్ ఫ్రం హోం ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీంతోపాటు నగరవ్యాప్తంగా నిర్మాణాలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది.
యోగీ ఆదిత్యనాథ్ సైతం..
‘మేం వారాంతపు లాక్డౌన్ విధించాలని ప్రతిపాదించాం. దాన్ని అమలు చేసేందుకూ సిద్ధంగా ఉన్నాం. మా తదుపరి నిర్ణయాలు కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంటాయి’ అని దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. రెడ్ లైట్ పడినప్పుడు వాహనాలు నిలిపివేసే విధానాన్ని డిసెంబర్ 3 వరకు పొడిగించనున్నట్లు చెప్పారు. దిల్లీ- ఎన్సీఆర్లో ప్రైవేట్ కార్యాలయాలకూ వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని సూచించినట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సైతం మంగళవారం వాయు కాలుష్యంపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజారవాణాను ప్రోత్సహించాలని, పంట వ్యర్థాలను కాల్చకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
ఇవీ చదవండి
Advertisement