SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంపై రికార్డులను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Updated : 03 Feb 2023 15:23 IST

దిల్లీ: 2002లో గుజరాత్ అల్లర్లు.. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ (Modi)ని విమర్శిస్తూ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో దాని ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం విచారణ జరిపింది. ఆ డాక్యుమెంటరీ ప్రసారం నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒరిజినల్‌ రికార్డులను సమర్పించాలంటూ కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

బీబీసీ డాక్యుమెంటరీ (BBC documentary)ని చూసే పౌరులను ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని, దీనిపై నిషేధం విధించడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమేనని పేర్కొంటూ సీనియర్‌ జర్నలిస్టు రామ్‌, టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, మరో న్యాయవాది ఎంఎల్‌ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంతో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి.. ఆ డాక్యుమెంటరీపై నిషేధానికి సంబంధించిన ఒరిజినల్‌ రికార్డులను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.

‘‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’’ పేరిట బీబీసీ రూపొందించిన డాక్యుమెంట్‌ను యూట్యూబ్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలు నెటిజన్లకు అందుబాటులో ఉంచాయి. ఇది కాస్త వివాదాస్పదమైనవని భావించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ లింకులను వెంటనే తొలగించాలని జనవరి 21న ఆయా సామాజిక మాధ్యమాలను ఆదేశించింది. ఆ డాక్యుమెంటరీపై మన దేశంలో భాజపా వర్గాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు