Updated : 18 Jun 2021 20:25 IST

Corona: ఉపశమనం కల్పించే ‘పాజిటివ్‌’ న్యూస్‌! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుతోంది. ఏపీలో కరోనా కర్ఫ్యూని సడలించారు. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స ఔషధాల లభ్యత పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో ఉపశమనం ఇచ్చే కొన్నివార్తలు మీ కోసం..

* కరోనా వైరస్‌ స్వభావం ఎలాంటి సవాళ్లు విసిరిందో రెండో దశ తెలియజేసిందని, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల నైపుణ్యాభివృద్ధి కోసం కోసం స్వల్పకాల శిక్షణా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ప్రధాని కౌశల్‌ వికాస్‌ యోజన 3.0 కింద రూ.276కోట్లతో  చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 26 రాష్ట్రాల్లో 111 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా శిక్షణ ఇవ్వనున్నారు. కరోనా వైరస్‌ పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొవిడ్‌ నిబంధనల నుంచి కొన్ని సడలింపులను ప్రకటించింది. జూన్‌ 21నుంచి 10 రోజుల పాటు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలింపులు ఇచ్చింది. అంటే, రాత్రిపూట కర్ఫ్యూ మాత్రమే కొనసాగనుంది. కొవిడ్‌ పాజిటివిటీ రేటు అధికంగా ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాను మినహాయించింది. అక్కడ మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ మాత్రమే సడలింపులు ఉంటాయని తెలిపింది. తాజా మినహాయింపుల నేపథ్యంలో సాయంత్రం 5గంటలకే దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. 

*  కరోనా అనంతరం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలో వాడే ఆంఫొటోరిసిన్‌-బి, ఇతర ఔషధ నిల్వలు దేశంలో అవసరానికి మించి ఉన్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ ఔషధం ఉత్పత్తిని భారత్‌ ఐదు రెట్లు పెంచిందని తెలిపారు. ఏప్రిల్‌లో కేవలం 62వేల వయల్స్‌గా ఉన్న ఉత్పత్తి ఈ నెలలో 3.75లక్షలు దాటుతుందని అంచనా వేశారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచడంతో పాటు, విదేశాల నుంచి 9.05 లక్షల వయల్స్‌ను మైలాన్‌ సంస్థ ద్వారా కేంద్రం తెప్పిస్తోందన్నారు. దేశంలో ఆంఫోటెరిసిన్‌-బి అందుబాటును పెంచే ఏ ఒక్క అవకాశాన్నీ భారత్‌ వదులుకోలేదని తెలిపారు. ఈ నెల 17వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మొత్తంగా 7,28,045 వయల్స్‌ కేటాయించినట్టు ఆయన పేర్కొన్నారు 

దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. 513 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువగానే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ తర్వాత కరోనా సోకినా ఆస్పత్రిపాలయ్యే ముప్పును 75నుంచి 80శాతం మేర తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆక్సిజన్‌ అవసరాలు 8శాతానికి తగ్గాయని..  మే 10 నుంచి 78.6శాతం మేర క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టినట్టు వివరించారు. అలాగే, మే 7తో పోలిస్తే దాదాపు 85శాతం కొత్త కేసుల్లో తగ్గుదల కనబడిందన్నారు. కొత్త వ్యాక్సినేషన్‌ విధానం ఈ నెల 21 నుంచి అమలవుతుందని చెప్పారు. దేశంలో రికవరీ రేటు 96శాతానికి పైగా ఉంది. 

*  కరోనాతో నెలకొన్న సంక్షోభ సమయంలో పలు సంస్థలు ప్రభుత్వాలకు సహకారం అందిస్తున్నాయి. రాజస్థాన్‌లోని రాజసమాంద్‌ ప్రాంతంలో వేదాంత గ్రూపులో భాగమైన హిందూస్థాన్‌ జింక్‌ ఆధ్వర్యంలో 100 పడకల అత్యాధునిక కొవిడ్‌ కేర్‌ ఫీల్డ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. మైన్స్‌, చమురు, సహజవాయువుల ఉత్పత్తి సంస్థగా ప్రఖ్యాతిగాంచిన వేదాంత గ్రూపు.. అనిల్‌ అగర్వాల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 8వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో జర్మనీ సాంకేతికతతో కూడిన అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసింది. దీంట్లో 20 ఐసీయూ పడకలు కూడా ఉన్నట్టు తెలిపింది. కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కోవడంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. కరోనా వైరస్‌ లక్షల మందిపై ప్రభావం చూపుతోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి తాము అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ ఆస్పత్రి ఏర్పాటు చేసినట్టు తెలిపింది.

‘కొవాగ్జిన్‌’ తయారుచేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి శుభవార్త అందింది. కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగ లిస్టింగ్‌ యూయూఎల్‌ అనుమతికి పత్రాలు సమర్పణకు అంగీకరించింది. ఈ నెల 23న టీకా డేటా వివరాలు అందజేసేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఇది కొవాగ్జిన్‌ టీకాపై పూర్తిస్థాయి సమీక్షా సమావేశం కాదని, వ్యాక్సిన్‌ మొత్తం డేటా సమర్పించేందుకు ఉద్దేశించిన భేటీగా డబ్ల్యూహెచ్‌వో వర్గాలు తెలిపాయి. కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగ లిస్టింగ్‌ ఈయూఎల్‌కు డబ్ల్యూహెచ్‌వో నుంచి జులై లేదా సెప్టెంబర్‌లో అనుమతి లభించవచ్చని భారత్‌ బయోటెక్‌ గత నెలలో ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. 

*  హైదరాబాద్‌ ఆస్పత్రులకు దీటుగా మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలందించనున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన 200 పడకల ఆక్సిజన్‌ వార్డును ఆయన ప్రారంభించారు. కొత్త ఆస్పత్రితో పాటు మరిన్ని సదుపాయాలు సమకూర్చుకొనేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలిపారు. తమిళనాడు, కేరళ తరహాలో ఆస్పత్రుల ఏర్పాటుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. 

ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా దేశంలోని ప్రతిఒక్కరికీ టీకా అందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ.. ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని భయపెడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లోని దుర్గాభాయి దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. కరోనాను కట్టడిచేయాలంటే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాలన్నారు. 15 రోజుల్లోనే దేశంలో ఆక్సిజన్‌ కొరతను పరిష్కరించామన్నారు. తెలంగాణలో 46 ఆస్పత్రులకు కేంద్రం 1400 వెంటిలేటర్లు ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు.

*  ప్రాణాంతక కరోనాతో పాటు ఇతర ప్రమాదకర వైరస్‌ రకాలను సమర్థంగా నిరోధించే మాత్రల (పిల్స్‌) తయారీకి అమెరికా సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.23,745కోట్లు కేటాయించనున్నట్టు ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. ప్రమాదకర వైరస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే వినియోగించుకొనేలా ఈ మాత్రలు ఉపయోగపడతాయన్నారు. ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని