G20 Summit: భారత్‌ బయల్దేరిన బైడెన్‌.. మధ్యాహ్నానికి దిల్లీకి రిషి సునాక్‌

భారత్‌ అధ్యక్షతన దిల్లీ వేదికగా జరిగే జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల అధినేతలు బయల్దేరుతున్నారు. ఈ సాయంత్రానికి అందరూ దిల్లీ చేరుకోనున్నారు.

Updated : 08 Sep 2023 10:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit)కు దిల్లీ సిద్ధమైంది. ఇప్పటికే కొంతమంది సభ్య దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాకతో సందడి మొదలైంది. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) కూడా భారత్‌ బయల్దేరారు. ఈ సాయంత్రానికి ఆయన దిల్లీ చేరుకోనున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) కూడా మధ్యాహ్నానికి రానున్నారు.

మోదీతో బైడెన్‌ భేటీ..

శుక్రవారం రాత్రి 7 గంటలకు బైడెన్‌ దిల్లీ చేరుకోనున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ అగ్రరాజ్య అధ్యక్షుడికి స్వాగతం పలకనున్నారు. రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ (PM Modi)తో ఆయన ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారు. ఇక, బైడెన్‌ సతీమణి జిల్‌ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌ బయల్దేరే గంట ముందు కూడా అధ్యక్షుడికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌ వచ్చినట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. అయినప్పటికీ.. దిల్లీ పర్యటనలో ఆయన కొవిడ్‌ నిబంధనలను పాటించనున్నట్లు తెలిపింది.

ఐటీసీ మౌర్యలో బైడెన్‌.. శాంగ్రీలాలో బస చేయనున్న సునాక్‌

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో బైడెన్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌, ఇతర ఉన్నాధికారులు ఉన్నారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం జరుగుతున్న కీలక జీ-20 సదస్సులో అమెరికన్ల ప్రయోజనాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల పురగోతిపై మేం దృష్టిసారిస్తాం’’ అని భారత్‌ బయల్దేరేముందు బైడెన్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో రాసుకొచ్చారు.

సునాక్‌.. ప్రధానిగా తొలిసారి

అటు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా ఈ మధ్యాహ్నానికి దిల్లీకి చేరుకోనున్నారు. ఈ భారత సంతతి నేత యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన దేశానికి రావడం ఇదే తొలిసారి. దిల్లీ విమానాశ్రయంలో రిషి సునాక్‌కు కేంద్రమంత్రి అశ్వనీ చౌబే స్వాగతం పలకనున్నారు. అటు సునాక్‌ బంధువులు కూడా ఆయనను ఆహ్వానించేందుకు దిల్లీ చేరుకుంటున్నారు.

ఇక, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా కూడా ఈ మధ్యాహ్నానికి భారత్‌ చేరుకోనున్నారు. ఇప్పటికే అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ దిల్లీ చేరుకోగా.. కేంద్రమంత్రి ఫగన్‌ సింగ్ కులస్థే ఆయనుక స్వాగతం పలికారు.

స్పెయిన్‌ అధ్యక్షుడికి కరోనా..

ఇదిలా ఉండగా.. స్పెయిన్‌ అధ్యక్షుడు పెడ్రో శాంషెజ్‌ కరోనా బారినపడ్డారు. గురువారం ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ జీ-20 సదస్సుకు రాలేనని వెల్లడించారు. దీంతో ఆయన స్థానంలో స్పెయిన్‌ ఉపాధ్యక్షురాలు నడియా కాల్వినో శాంటామారియా, విదేశాంగ మంత్రి జోస్‌ మాన్యూల్‌ అల్బరీస్‌ సదస్సుకు హాజరుకానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని