Ramayanam: 25 ఏళ్ల ‘రామాయణం’.. సెట్స్‌లో ఎన్టీఆర్‌ ఎంత అల్లరి చేసేవాడంటే?

రామాయణ ఇతివృత్తంతో ఎన్ని సినిమాలొచ్చినా గుణశేఖర్‌ తెరకెక్కించిన ‘రామాయణం’ ఎప్పటికీ ప్రత్యేకమే. పూర్తిస్థాయిలో బాల నటులతో తెరకెక్కించడమే ఇందుకు కారణం.

Published : 12 Apr 2022 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రామాయణం నేపథ్యంతో ఎన్ని సినిమాలొచ్చినా గుణశేఖర్‌ తెరకెక్కించిన ‘రామాయణం’ ఎప్పటికీ ప్రత్యేకమే. పూర్తిస్థాయిలో బాల నటులతో తెరకెక్కించడమే ఇందుకు కారణం. జూనియర్‌ ఎన్టీఆర్‌.. బాల రాముడిగా నటించిన ఈ చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ వీడియోను పంచుకున్నారు గుణశేఖర్‌.

‘‘శబ్దాలయ థియేటర్స్‌ పతాకంపై ఎం.ఎస్‌. రెడ్డిగారు నా దర్శకత్వంలో నిర్మించిన రామాయణం చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా మీ ముందుకురావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో చాలామంది పిల్లలు బాల నటులుగా పరిచయమయ్యారు. వారికి, ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడం ఎంతో ప్రోత్సాహనిచ్చింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పౌరాణిక గాథ ‘శాకుంతలం’తో మీ ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని గుణశేఖర్‌ తెలిపారు.

1997లో విడుదలైన ఈ చిత్రం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది. సీతగా స్మితమాధవ్‌, రావణుడిగా స్వాతికుమార్‌, లక్ష్మణుడిగా నారాయణమ్‌ నిఖిల్‌ కీలక పాత్రల్లో కనిపించారు. మాధవపెద్ది సురేశ్‌, వైద్యనాథన్‌ సంగీతం అందించారు.

సెట్స్‌లో గోలగోల

ఎన్టీఆర్‌.. తెరవెనక విపరీతమైన అల్లరి చేసేవాడట. ఎన్టీఆర్‌ సహా ఇతర బాల నటులందరినీ నియంత్రించడం చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారేదట. శివ ధనుర్భంగం సన్నివేశం కోసం దర్శకుడు ఓ విల్లును టేకుతో ప్రత్యేకంగా తయారు చేయించారు. చాలా బరువు ఉండటంతో కొందరు దాన్ని పైకెత్తే సాహసం కూడా చేయలేదట. ఎన్టీఆర్‌ బలవంతంగా పైకెత్తి బ్యాలెన్స్‌ చేయలేక కిందపడేయటంతో అది విరిగిపోయింది. అంతే.. తారక్‌పై గుణశేఖర్‌ కోప్పడ్డారు. దాంతో ‘ఇక నేను సినిమా చేయను. వెళ్లిపోతా’ అని అప్పుడు ఎన్టీఆర్‌ గోల చేశారట. మరోవైపు, అన్నపూర్ణ స్టూడియోస్‌లో వానర సైన్యంపై సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఆ గెటప్‌లో ఉన్న పిల్లల తోకలు లాగేవాడట తారక్‌. రాముడి వేషంలో వారిని బాణాలతో పొడుస్తూ తెగ ఏడిపించేవాడట. అలాంటి చిలిపి ఎన్టీఆర్‌.. ఇప్పుడు ఎంతటి స్టార్‌ అయ్యాడో తెలిసిన విషయమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని