Akhil: ‘మహేశ్‌బాబు- రాజమౌళి కాంబోతో పనిచేయాల్సి వస్తే’.. అఖిల్‌ రియాక్షన్‌ ఏంటంటే?

అఖిల్‌ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఏజెంట్‌’. ఈ సినిమా ప్రచారంతో అఖిల్‌ బిజీగా ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో #SSMB29పై స్పందించారు.

Published : 26 Apr 2023 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కొత్త చిత్రం ‘ఏజెంట్‌’ (Agent) ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు హీరో.. అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni). ఆ సినిమా కబుర్లతోపాటు వ్యక్తిగత విశేషాలూ పంచుకుంటున్నారాయన. యాంకర్లు/హోస్ట్‌లు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిస్తూ ఆకట్టుకుంటున్నారు. సంబంధిత వీడియో ఒకటి ట్విటర్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అగ్ర దర్శక, కథానాయకులు రాజమౌళి (Rajamouli), మహేశ్‌బాబు (Mahesh Babu) కాంబినేషన్‌కు సంబంధించిన ప్రశ్న కావడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఆ సంభాషణ ఏంటంటే?

‘‘మహేశ్‌బాబుతో నేను చేయబోతోన్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తావా? అని రాజమౌళి అడిగితే మీరు ఏం చేస్తారు?’’ అని యాంకర్‌ అడగ్గా.. ఊహాగానాలు గురించి ఇప్పుడు ఎందుకని, వారిద్దరు తన కుటుంబ సభ్యుల్లాంటివారని, రాజమౌళి సినిమాకి ఎవరైనా నో చెబుతారా అంటూ అఖిల్‌ నవ్వుతూ బదులిచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి గతంలోనే మహేశ్‌బాబుతో ఓ సినిమా (#SSMB29 వర్కింగ్‌ టైటిల్‌) చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా ప్రారంభంకాని ఆ సినిమా గురించి రాజమౌళిగానీ, రచయిత విజయేంద్రప్రసాద్‌గానీ ఏదైనా వేదికపై మాట్లాడితే అది సంచలనమే అవుతుంది.  

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌.. ‘ఏజెంట్‌’. సాక్షివైద్య కథానాయిక. మలయాళీ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఈ క్రేజీ మూవీ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్‌ ఇందులో మునుపెన్నడూ కనిపించని లుక్‌లో నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు