Venu Thottempudi: సినిమా ఆడితేనే మేనల్లుడినని చెప్పుకొంటానన్నారు: వేణు

‘నీ సినిమా ఆడితేనే నా మేనల్లుడివని చెప్పుకుంటా. లేదంటే చెప్పను’ అని తన మావయ్య, మచిలీపట్నం మాజీ ఎంపీ మాగంటి అంకినీడు సరదాగా అనేవారని నటుడు తొట్టెంపూడి వేణు గుర్తుచేసుకున్నారు. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమా ప్రచారంలో భాగంగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి, సందడి చేశారు.

Published : 13 Jul 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నీ సినిమా ఆడితేనే నా మేనల్లుడివని చెప్పుకొంటా. లేదంటే చెప్పను’ అని తన మావయ్య, మచిలీపట్నం మాజీ ఎంపీ మాగంటి అంకినీడు సరదాగా అనేవారని నటుడు తొట్టెంపూడి వేణు (Venu Thottempudi) గుర్తుచేసుకున్నారు. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (RamaRao On Duty) సినిమా ప్రచారంలో భాగంగా ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga) కార్యక్రమానికి విచ్చేసి, సందడి చేశారు. కార్యక్రమ వ్యాఖ్యాత ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన ఎత్తు 6.3 అడుగులని చెప్పారు. ‘‘ఎంతోమంది ‘ఆలీతో సరదాగా’ షోకి వెళ్తున్నారు.. నువ్వెప్పుడు వెళ్తావ్‌ .. వెళ్లరా’’ అంటూ తన తల్లి అడిగేవారని తెలిపారు. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించిన రోజుల్ని నెమరువేసుకున్నారు. అబద్ధం చెప్పి సినిమాలకు వెళ్లేవాడినని, అది తెలిసి తన తండ్రి కొట్టేవారని నాటి సంగతులు వివరించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వంలో తెరంగేట్రం చేసే అవకాశం మిస్‌ అయిందని తెలిపారు. ‘ఇట్లు.. శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమా తాను చేయకపోయినా దర్శకుడు పూరి జగన్నాథ్‌ మళ్లీ కలిశారని, ‘దేశముదురు’ కథ వినిపించారని, అన్నీ చేసి సినిమా చేయలేదంటూ తన హావభావాలతో నవ్వులు కురిపించారు. అనంతరం, రాజకీయ నేపథ్యం గురించి చెప్తూ తన మావయ్య దివంగత మాగంటి అంకినీడు మాటను ప్రస్తావించారు.

‘స్వయంవరం’, ‘చిరు నవ్వుతో’, ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘కల్యాణ రాముడు’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖుషి ఖుషీగా’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపి.. గోపిక.. గోదావరి’ సినిమాలతో విశేష క్రేజ్‌ సంపాదించుకున్నారు వేణు. అనివార్య కారణంగా కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్న ఈయన రవితేజ (RaviTeja) హీరోగా తెరకెక్కిన ‘రామారావు’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు శరత్‌ మండవ రూపొందించిన ఈ సినిమా జులై 29న విడుదలకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని