ఆమె వల్లే సినిమాల్లోకి..!

‘రావణాసురిడి వాళ్లవిడ కూడా వాళ్లయన్ని పవన్‌ కల్యాణ్  అనే అనుకుంటుంది’ అని తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది అనుపమ పరమేశ్వరన్‌. అందమే కాదు అభినయంలోనూ తక్కవేం కాదని తాను ఎంపిక చేసుకునే పాత్రలతో నిరూపిస్తూనే ఉంది. ఫిబ్రవరి 18న ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా  అనుపమ గురించి కొన్ని విశేషాలు చూద్దాం...

Updated : 18 Feb 2021 10:09 IST

‘రావణాసురిడి వాళ్లవిడ కూడా వాళ్లయన్ని పవన్‌ కల్యాణ్  అనే అనుకుంటుంది’ అని తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది అనుపమ పరమేశ్వరన్‌. అందమే కాదు అభినయంలోనూ తక్కువేం కాదని తాను ఎంపిక చేసుకునే పాత్రలతో నిరూపిస్తూనే ఉంది. ఫిబ్రవరి 18న ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా  అనుపమ గురించి కొన్ని విశేషాలు చూద్దాం..

కేరళలోని త్రిసూర్‌ జిల్లాకు చెందిన ఇరంజలకుడ పట్టణం అనుపమ స్వస్థలం. పరమేశ్వరన్‌, సునీత దంపతులకు 1996 ఫిబ్రవరి 18న జన్మించింది. ఆమెకు ఓ సోదరుడు ఉన్నారు. పేరు అక్షయ్‌ పరమేశ్వరన్‌. ఇంటర్‌(ప్లస్‌ 2)వరకు స్వగ్రామంలోనే చదువుకున్నారు. కొట్టాయంలోని సి.ఎం.ఎస్‌ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే సినిమాల్లో అవకాశం వచ్చింది. దాంతో చదువుకు కాస్త దూరమైన ఆమె కొన్నాళ్లకు దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తిచేశారు. 

ముద్దుపేరు: అనుపమ ముద్దుపేరు పొన్ను. పొన్ను అంటే బంగారం అని అర్థం.

చిన్నప్పటి నుంచే..

పాఠశాల రోజుల నుంచే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది అనుపమ. ఆ సమయంలోనే ఆమెకు కెమెరా పరిచయమైంది. అందుకే కెమెరా అంటే భయంతో ఏదో నటించేశాం అని కాకుండా ఎంచుకున్న పాత్రలో ఒదిగిపోతుంది. తనకు ఫొటోషూట్‌ అంటే ఎంత ఇష్టమో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు బట్టి తెలిసిపోతుంది. 

అలా సినిమాల్లోకి..

ఏదైనా సినిమా చూసినపుడు అందులోని పాత్రల్లో తానైతే ఎలా నటిస్తారో ఊహించుకునేవారట అనుపమ. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె స్నేహితురాలు ‘ప్రేమమ్‌’(మలయాళం) సినిమాకు సంబంధించి ఆడిషన్స్‌ జరుగుతున్నాయని, ఫొటోలు పంపించమని అనుపమకు చెప్తే ‘హీరో నివిన్‌ పౌలి పక్కన నటించే అవకాశమా? అది సాధ్యంకాద’ని నో చెప్పారు అనుపమ. ‘నా కోసం.. ప్లీజ్‌’ అంటూ స్నేహితురాలు మరోసారి కోరితే చిత్రబృందానికి ఫొటోలు పంపించారు అనుపమ. కొన్ని రోజులకు చిత్రబృందం ఫోన్‌ చేసి రమ్మనగా.. ఆడిషన్స్‌కి హాజరై నటిగా ఎంపికయ్యారు. ఆ స్నేహితురాలి వల్లనే ఇప్పుడిలా మీ ముందు ఉన్నా అంటుంటారు అనుపమ. అనుపమ సినిమాల్లో నటించడం కుటుంబ సభ్యులకు మొదట్లో నచ్చకపోయినా ఆమె ఇష్టాన్ని చూసి కాదనలేకపోయారు. 

ఖ పలకడం రాలేదు..

తెలుగులో తొలి సినిమా ‘అఆ’ నుంచే తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం మొదలుపెట్టారు అనుపమ. రెండో చిత్రం ‘ప్రేమమ్‌’ విషయంలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ జరిగిందట. అన్ని డైలాగులు సింగిల్‌ టేక్‌లో చెప్పిన అనుకి ‘లోపలికి రా శేఖర్‌’ అనే సంభాషణ పలకడం సరిగా రాలేదని, శేఖర్‌ స్థానంలో శేగర్‌ అని ఉచ్ఛరించేదని ఓ సందర్భంలో అభిమానులతో పంచుకున్నారు ఆ చిత్ర దర్శకుడు చందు మొండేటి. ఎన్నిసార్లైనా శేగర్‌ అనే చెప్తుండటంతో అదే మాటను ఉంచేశారట.  

ఒత్తిడి పోయేందుకు..

అనుకున్న పని సరిగా చేయలేని సందర్భంలో, కోపం వచ్చినపుడు కాగితంపై ఏబీసీడీలు రాయడం అనుపమ అలవాటు. ‘సాధారణంగా చాలామంది కోపం వస్తే ఒత్తిడి తగ్గించేందుకు 10 నుంచి 1 వరకు అంకెలు లెక్కిస్తారు కానీ నేను ఏబీసీడీలు రాస్తుంటాన’ని ఓ సినిమా ప్రచారంలో తెలియజేశారు. 

తెలుగు సినిమాలు-పాత్రలు

> అఆ- నాగవల్లి

> ప్రేమమ్- సుమ

> శతమానం భవతి- నిత్య

> ఉన్నది ఒకటే జిందగీ- మహా

> కృష్ణార్జున యుద్ధం- సుబ్బలక్ష్మీ

తేజ్ ఐలవ్‌యూ- నందిని

హలో గురు ప్రేమకోసమే -అనుపమ

రాక్షసుడు-కృష్ణవేణి

> ప్రస్తుతం నిఖిల్‌ సరసన ‘18 పేజీస్‌’లో నటిస్తోంది. దీంతోపాటు మరో రెండు తెలుగు చిత్రాలకు సంతకం చేసింది.

టాలీవుడ్‌లో సన్నిహితులు:

యువ కథానాయకుడు శర్వానంద్‌ తనకు క్లోజ్‌ అని ఓ కార్యక్రమంలో తెలిపారు అనుపమ. ‘శతమానం భవతి’ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమెను ముదురు అని పిలిచేవారట శర్వా.

ఇష్టాలు:

> పాటలు పాడటం 

> పెయిటింగ్‌ వేయడం

> ఐస్‌క్రీమ్‌

> సాధు జంతువులు పెంచడం

ఇదీ అనుపమ ఫాలోయింగ్‌:

సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుకుగా ఉంటారు అనుపమ. వ్యక్తిగత, సినిమా విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడమే కాదు వాళ్లతో తరచూ ముచ్చటిస్తుంటారామె. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య: 8.4 మిలియన్‌. ట్విటర్‌లో 2.4 మిలియన్‌ మంది ఫాలోవర్స్‌ సొంతం చేసుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్న అనుపమ తొలి ఫొటో.

* అనుపమ పెంచుకుంటున్న కుక్క. పేరు: విస్కీ.

* అనుపమకు ఇష్టమైన స్నాక్స్‌

* చీర కట్టుకోవడం అంటే అనుపమకు చాలా ఇష్టం, అందుకే ఆ వయసులో కట్టేసింది.

* ఖాళీ సమయంలో సరదాగా పెయింటింగ్‌..

* తండ్రి పరమేశ్వరన్‌తో బుల్లి అనుపమ..

*తల్లి సునీతతో..

*తమ్ముడితో కేరింతలు..

*కృష్ణుడి అవతారంలో..

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని