Bhola Shankar: ‘భోళా శంకర్‌’ టికెట్‌ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం తిరస్కారం.. జరిగింది ఇదీ!

Bhola Shankar: చిరంజీవి ‘భోళా శంకర్‌’ మూవీ టికెట్‌ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని వచ్చిన వార్తలపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.

Published : 09 Aug 2023 20:02 IST

హైదరాబాద్‌: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’ (Bhola Shankar). తమన్నా కథానాయిక. కీర్తి సురేశ్‌, సుశాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అగ్ర కథనాయకుల సినిమాలు విడుదలైనప్పుడు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘భోళా శంకర్‌’ చిత్ర బృందం అందుకు దరఖాస్తు చేసుకోగా, ఏపీ ప్రభుత్వం తిరస్కరించిందంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అసలు ఏం జరిగిందంటే.. ‘భోళాశంకర్’ సినిమా టికెట్ రేటు పెంచాలని కోరుతూ చిత్రబృందం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవం. అయితే, దరఖాస్తులో మరికొన్ని వివరాలు కావాలని ప్రభుత్వ వర్గాలు చిత్ర బృందాన్ని కోరాయి. దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో తదుపరి వివరాలు కోరామని ప్రభుత్వం తెలిపింది. వంద కోట్ల రూపాయల బడ్జెట్‌పై మార్గదర్శకాల మేరకు అదనపు వివరాలు కావాలని కోరింది. నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తే, టికెట్‌ రేట్లు పెంపునకు అనుమతి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ టాపిక్‌ ట్రెండ్‌ అవుతోంది. చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్‌గా మంత్రులు, వైకాపా నాయకులు స్పందిస్తున్నారు. ఇటువైపు నుంచి కేవలం నాగబాబు మాత్రమే ఏపీ నాయకుల కౌంటర్‌కు ప్రతి కౌంటర్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ‘భోళా శంకర్‌ టికెట్‌ రేట్ల పెంపును ఏపీ ప్రభుత్వం నిరాకరించిందన్న వార్తలు వైరల్‌ అయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని