Kartikeya: నాలుగేళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నా.. ఇప్పుడు రిలీఫ్‌ కలిగింది: కార్తికేయ

కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో కార్తికేయ మాట్లాడారు. ఆ వివరాలివీ..

Published : 30 Aug 2023 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న పాత్రలు పోషించినా నాలుగేళ్ల నుంచి విజయం దగ్గరగా వచ్చి వెళ్లిపోయేదని, ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) బాగుందని ప్రేక్షకులంతా చెప్పడం రిలీఫ్‌ ఇచ్చిందని నటుడు కార్తికేయ (Kartikeya) అన్నారు. ఈయన హీరోగా నూతన దర్శకుడు క్లాక్స్‌ తెరకెక్కించిన చిత్రమిది. నేహాశెట్టి (Neha Shetty) కథానాయిక. ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనరావడంతో చిత్ర బృందం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అవన్నీ ఇప్పుడు మధుర జ్ఞాపకాలు: కార్తికేయ

‘‘సినిమా హిట్‌ అయింది. ఎక్కువ మంది చూస్తున్నారు. మంచి వసూళ్లు వస్తున్నాయి. మేం నమ్మిన కంటెంట్‌ను ప్రేక్షకులు అంగీకరించడం అన్నింటికన్నా ఎక్కువ సంతోషాన్నిచ్చింది. నా మైండ్‌ ప్రేక్షకుల మైండ్‌తో సింక్‌లో ఉందని అర్థమైంది. సినిమా విడుదలైన రోజు రెండు షోల తర్వాత సినిమా బాగుందని అందరూ చెప్పిన మాట రిలీఫ్‌ ఇచ్చింది. నాలుగేళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నా, విభిన్న పాత్రలు పోషిస్తున్నా విజయం దగ్గరకు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది. ‘బెదురులంక 2012’ విషయంలో నేను అనుకున్నది నిజమైంది. ఈ సినిమాతో సుమారు రెండేళ్లు ప్రయాణించా. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఈ విజయంతో అవన్నీ ఇప్పుడు మధుర జ్ఞాపకాలుగా మారాయి. సక్సెస్‌ అయినా అవ్వకపోయినా ఇంతకాలం నన్ను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా విడుదల సమయంలో మా అమ్మ యూఎస్‌లో ఉంది. అది హిట్‌కావడంతో ‘బెదురులంక’ కూడా హిట్‌కావాలనే ఉద్దేశంతో మళ్లీ అక్కడికే వెళ్లింది’’ అని నవ్వుతూ తెలిపారు.

రివ్యూ: బెదురులంక 2012

శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు క్లాక్స్‌ నాకు 2009 నుంచి పరిచయం. అప్పుడే ఈ సినిమా కథ గురించి నాకు తెలుసు. ఎప్పుడూ వింత కథలు చెబుతూ ఉండేవాడు. వాటిని నిర్మాతలు అంగీకరించరు.. కమర్షియల్‌ స్టోరీలు రాసుకోమని నేను సలహా ఇచ్చేవాణ్ని. క్లాక్స్‌ కష్టపడే తత్వం ఉన్నవాడు. రామ్‌గోపాల్‌ వర్మలాంటి దర్శకుల దగ్గర కొంతకాలం పనిచేశాడు. నేను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటా. అలాంటిది కార్తికేయ నటించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’లోని ఓ పాట బాగా నచ్చడంతో ట్వీట్‌ ఎలా చేయాలో తెలుసుకుని మరీ నా అభిప్రాయం వ్యక్తం చేశా. కార్తికేయ మంచి హీరో అవుతాడని ఆ సమయంలోనే అనుకున్నా’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని