Butta Bomma: ‘బుట్టబొమ్మ’ ఓటీటీలోకి వస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

‘బుట్టబొమ్మ’ సినిమా అతి త్వరలోనే ఓటీటీలో విడుదల కాబోతుంది. ఏ ఓటీటీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published : 02 Mar 2023 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ఠ, అనిఖా సురేంద్రన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘బుట్టబొమ్మ’ (Butta Bomma) సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చి 4న నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్‌ కానుంది. తమ ఓటీటీలో ‘త్వరలో రాబోతున్న సినిమాల జాబితా’లో నెట్‌ఫ్లిక్స్‌ ఆ వివరాలను పొందుపరిచింది. శౌరి చంద్రశేఖర్‌, టి. రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మలయాళ సినిమా ‘కప్పేల’కు రీమేక్‌గా రూపొందిన ‘బుట్టబొమ్మ’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

కథేంటంటే: అరకు ప్రకృతి అందాల మధ్య ఉన్న దూది కొండకు చెందిన ఓ మామూలు మధ్యతరగతి అమ్మాయి సత్య (అనిఖా సురేంద్రన్‌). ఆమెది చాలా సింపుల్‌ లైఫ్‌. టైలరింగ్‌ చేసుకునే తల్లి, రైసు మిల్లులో పని చేసే తండ్రి, స్కూల్‌కు వెళ్లే ఓ చెల్లి, ఇష్టంగా పూజించే కృష్ణుడు.. ఆమె జీవితంలో కనిపించే ముఖ్యమైన వ్యక్తులు వీళ్లే. ఓ కెమెరా ఫోన్‌ కొనుక్కుని.. రీల్స్‌ చేసి ఫేమస్‌ అవ్వాలన్నది ఆమె కల. కానీ, ఓ రాంగ్‌ నంబర్‌ సత్య జీవితాన్ని మార్చేస్తుంది. కనీసం ఒక్కసారైనా చూడకుండానే ఫోన్‌లో పరిచయమైన మురళీ (సూర్య వశిష్ఠ)ని ప్రేమిస్తుంది. తన తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం చేయడంతో.. చెప్పాపెట్టకుండా అతడిని కలవడం కోసం విశాఖపట్నం వెళ్తుంది. కానీ, ఆ తర్వాత ఆమె జీవితం అనూహ్య మలుపులు తిరుగుతుంది. మరి మురళీని కలవడం కోసం వైజాగ్‌ వెళ్లిన సత్యకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ జంటను ఆర్కే (అర్జున్‌ దాస్‌) ఫాలో చేయడానికి కారణమేంటి? అతను ఎవరు? చివరికి ఏం చేశాడు? అన్నది మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని