OMG 2: ‘ఆదిపురుష్‌’ ఎఫెక్ట్‌.. అక్షయ్‌ సినిమాకి రివిజన్‌ కమిటీ?

అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఓ మై గాడ్‌ 2’. ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు చాలా జాగ్రత్త తీసుకుంటుందని సమాచారం.

Published : 13 Jul 2023 19:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) తాజా చిత్రం ‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2) విషయంలో సెన్సార్‌ బోర్డు (Central Board of Film Certification- CBFC) చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సినిమాని రివిజన్‌ కమిటీకి పంపించినట్టు బాలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. ఆ కమిటీ ఇచ్చే సూచనల మేరకు విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్‌ వినిపిస్తోంది. ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ (Adipurush), అదాశర్మ ప్రధాన పాత్రల్లో సుదీప్తో సేన్‌ తెరకెక్కించిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) తదితర సినిమాల విషయంలో సెన్సార్‌ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆయా సినిమాల్లో పలు అభ్యంతర సన్నివేశాలు/ సంభాషణలు ఉన్నాయని, వాటి విషయంలో సెన్సార్‌ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదనలు గట్టిగా వినిపించాయి. దాంతో, ఇతిహాసాలు, మతపరమైన కథాంశాలతో రూపొందిన సినిమాల విషయంలో సెన్సార్‌ బోర్డు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుందట.

‘ఓ మై గాడ్‌ 2’.. దైవానికి సంబంధించిన అంశాలతో రూపొందిన సినిమాకావడంతో ఎలాంటి అభ్యంతరాలకు తావు లేకుండా ఉండాలని సెన్సార్‌ బోర్డు నిర్ణయించుకుని, ఈ మేరకు ఇప్పటికే సినిమాని చూసిన బోర్డు దాన్ని రీవిజన్‌ కమిటీకి పంపించిందని టాక్‌. అయితే, దీనిపై దర్శక, నిర్మాతలు స్పందించలేదు. అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్‌.. శివుడి పాత్ర పోషించారు. యామీ గౌతమి కథానాయికగా నటించగా పంకజ్‌ త్రిపాఠి, అరుణ్‌ గోవిల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2012లో విడుదలై, మంచి విజయాన్ని అందుకున్న ‘ఓ మై గాడ్‌’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాని ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని