Chiranjeevi-Balakrishna: చిరు వర్సెస్‌ బాలయ్య.. సంక్రాంతికి ఎన్ని సార్లు పోటీపడ్డారంటే?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు నిలవబోతున్నాయి. గతంలో వారు నటించిన ఏయే సినిమాలు సంక్రాంతి కానుకగా వచ్చాయంటే?

Updated : 13 Jan 2023 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ అగ్ర హీరోలైన చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna)ల చిత్రాలు ఒక్కరోజు తేడాతో విడుదలకానుండడంతో అందరి చూపు ఇప్పుడు సంక్రాంతిపైనే  ఉంది. అయితే, ఈ స్టార్‌ హీరోలు సంక్రాంతి బరిలో నిలవడం ఇదే తొలిసారి కాదు. వీరు నటించిన పలు చిత్రాలు ముగ్గుల పండగ కానుకగా విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ఆ సినిమాలేంటో, ఏయే సంవత్సరాల్లో వచ్చాయో చూసేద్దాం..

వీరసింహారెడ్డి x వాల్తేరు వీరయ్య

బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). చిరంజీవి హీరోగా దర్శకుడు కె. బాబీ రూపొందించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). బాలయ్య చిత్రం విడుదల 2023 జనవరి 12న ఖరారు కాగా 13న ‘వాల్తేరు వీరయ్య’ వస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి.

బాలయ్యకు బాగా కలిసొచ్చిన పేరుకావడం (సింహా), ‘అఖండ’ వంటి సూపర్‌హిట్ తర్వాత ఆయన నటించిన చిత్రం కావడం, ‘క్రాక్‌’ హిట్‌ తర్వాత గోపీచంద్‌ డైరెక్షన్‌ చేసింది కావడంతో ‘వీరసింహారెడ్డి’పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నమోదవుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’పైనా అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. చిరు వింటేజ్‌ లుక్‌, రవితేజ కీలక పాత్ర పోషించడం తదితర అంశాలు అందుకు కారణం. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన విశేషం ఏంటంటే.. రెండింటిలోనూ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ (Shruti Haasan), రెండింటిని నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) సంస్థే. 

చిరు ‘పోరాటం’.. బాలయ్య ‘బలం’

చిరంజీవి, బాలకృష్ణ తొలిసారి సంక్రాంతి బరిలో నిలిచిన సంవత్సరం 1985. చిరు హీరోగా కె. బాపయ్య తెరకెక్కించిన ‘చట్టంతో పోరాటం’, తాతినేని ప్రసాద్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘ఆత్మబలం’ సినిమాలు ఆ ఏడాది సంక్రాంతి కానుకగా (రోజుల వ్యవధిలో) విడుదలయ్యాయి.

ఇటు మొగుడు.. అటు రాముడు

1985 తర్వాత 1987 సంక్రాంతికి చిరు, బాలయ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ‘దొంగమొగుడు’ (జనవరి 9) సినిమాతో చిరంజీవి, ‘భార్గవరాముడు’ (జనవరి 14)తో బాలకృష్ణ ఆ సంవత్సరం ప్రేక్షకులను పలకరించారు.  ఈ రెండు చిత్రాలకు దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి కావడం విశేషం.

ఇక్కడ దొంగ.. అక్కడ పోలీసు

1988 సంక్రాంతికీ చిరు, బాలయ్య సినిమాల సందడి నెలకొంది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘మంచిదొంగ’ సినిమా ఆ ఏడాది జనవరి 14న విడుదలకాగా.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం ‘ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌’ జనవరి 15న వచ్చింది.

సోదర సెంటిమెంట్‌..

చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ‘హిట్లర్‌’, దర్శకుడు శరత్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘పెద్దన్నయ్య’ సినిమాలు 1997 సంక్రాంతి సీజన్‌కు విడుదలయ్యాయి. ఈ రెండింటిలో హీరోలు సోదర పాత్రలో కనిపిస్తారు. యాక్షన్‌ హీరోలు ఫ్యామిలీ డ్రామాల్లో నటించినా విజయం అందుకోవచ్చనే విషయాన్ని ఆ రెండు చిత్రాలు మరోసారి నిరూపించాయి. ఆ సంవత్సరం జనవరి 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హిట్లర్‌’, జనవరి 10న విడుదలైన ‘పెద్దన్నయ్య’.. రెండూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరోలను విజేతలుగా నిలబెట్టాయి.

ఫ్రెండ్‌షిప్‌.. ఫ్యాక్షన్‌

1999 జనవరిలోనూ చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య పోటీ నెలకొంది. చిరు ‘స్నేహంకోసం’ ఆ సంవత్సరం జనవరి 1న విడుదలైంది. దర్శకుడు కె. ఎస్‌. రవికుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. బాలయ్య ‘సమరసింహారెడ్డి’ జనవరి 13న విడుదలైంది. బి. గోపాల్‌ దర్శకుడు.

1997లో అలా.. 2000లో ఇలా

1997లో వచ్చిన ‘హిట్లర్‌’ కాంబో చిరంజీవి- ముత్యాల సుబ్బయ్య 2000 జనవరి 7న ‘అన్నయ్య’ సినిమాతో వచ్చింది. 1997లోని ‘పెద్దన్నయ్య’ కాంబినేషన్‌ బాలకృష్ణ- శరత్‌ 2000లో రిపీట్‌ అయింది. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కిన మరో చిత్రం ‘వంశోద్థారకుడు’ 2000 జనవరి 14న విడుదలైంది. 97లో రెండు కాంబినేషన్‌లు విజయాన్ని అందుకున్నాయి.

ఒకేరోజు వచ్చారు..

అప్పటి వరకూ రోజుల తేడాతో పొంగల్‌ సీజన్‌కు చిరు, బాలయ్యల చిత్రాలు విడుదలవగా 2001లో ఒకేరోజు (జనవరి 11) వచ్చాయి. అవే.. ‘నరసింహనాయుడు’ (బాలకృష్ణ), ‘మృగరాజు’ (చిరంజీవి).

లక్ష్మీనరసింహా వర్సెస్‌ అంజి

బాలకృష్ణ హీరోగా దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ తెరకెక్కించిన ‘లక్ష్మీనరసింహా’, చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అంజి’ చిత్రాలు 2004 సంక్రాంతి పోటీలో నిలిచాయి.

ఖైదీ వర్సెస్‌ శాతకర్ణి

కొన్నాళ్లు పాలిటిక్స్‌లో ఉన్న చిరంజీవి చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చి, నటించిన తొలి చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. వి. వి. వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017 జనవరి 11న విడుదలై, మంచి వసూళ్లు రాబట్టింది. బాలకృష్ణ హీరోగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ సినిమా అదే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకుంది.

నాన్‌ సంక్రాంతి సీజన్‌..

పండగల సీజన్‌ అనే కాదు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకేరోజు/వారంలో విడుదలవుతున్నాయంటే ప్రేక్షకులకు ఆసక్తే. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం..

🎥 మంగమ్మగారి మనవడు (బాలకృష్ణ)- ఇంటిగుట్టు (చిరంజీవి) : 1984 సెప్టెంబరు

🎥 కథానాయకుడు (బాలకృష్ణ)- రుస్తుం (చిరంజీవి): 1984 డిసెంబరు

🎥 కొండవీటి రాజా (చిరంజీవి): 1986 జనవరి 31.. నిప్పులాంటి మనిషి (బాలకృష్ణ): 1986 ఫిబ్రవరి 7

🎥 రాక్షసుడు (చిరంజీవి)- అపూర్వ సహోదరులు (బాలకృష్ణ): 1986 అక్టోబరు

🎥 పసివాడి ప్రాణం (చిరంజీవి)- రాము (బాలకృష్ణ): 1987 జులై

🎥 యుద్ధభూమి (చిరంజీవి)- రాముడు భీముడు (బాలకృష్ణ): 1988 నవంబరు

🎥 శ్రీ మంజునాథ (చిరంజీవి)- భలేవాడివి బాసూ! (బాలకృష్ణ): 2001 జూన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని