Tollywood: తడబడినా.. నిలబడ్డారు

ఆరంభ చిత్రం అంచనాలకు తగినట్లు ఆడకున్నా.. తిరిగి నిలబడి పోరాట స్ఫూర్తిని చూపించారు కొంతమంది టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, దర్శకులు.  ఆ పరాజయాన్నే రాబోయే విజయాలకు తొలిమెట్లుగా చేసుకున్నారు.

Published : 01 Jul 2021 09:23 IST

చిత్ర పరిశ్రమలో మొదటి అడుగు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ తడబడితే కోలుకోవడం చాలా కష్టం. అరంగేట్రం సరిగా లేకపోతే ఆ తర్వాత అవకాశాలు కూడా తలుపు తట్టవు.  ఒక్కోసారి కెరీర్‌ మొత్తం ప్రమాదంలో పడిపోతుంది. ఆరంభ చిత్రం అంచనాలకు తగినట్లు ఆడకున్నా.. తిరిగి నిలబడి పోరాట స్ఫూర్తిని చూపించారు కొంతమంది టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, దర్శకులు. ఆ పరాజయాన్నే రాబోయే విజయాలకు తొలిమెట్లుగా చేసుకున్నారు. అలా తొలిఫ్లాప్‌ నుంచి తేరుకొని బ్లాక్‌ బస్టర్‌ కెరీర్‌ను నిర్మించుకున్న వారిపై ఈ కథనం. 

తొలి చిత్రం ఫ్లాప్‌.. తారజువ్వలా తారక్‌!

నందమూరి వారసుడిగా టాలీవుడ్‌ బరిలోకి దిగిన ఎన్టీఆర్‌ తొలి చిత్రంతోనే తడబడ్డారు. ఆయన హీరోగా తెరంగేట్రం చేసిన ‘నిన్ను చూడాలని’కి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితం రాలేదు. ఆ పరాజయం నుంచి కోలుకొని అదే ఏడాది ‘స్టూడెంట్‌ నెం.1’తో హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘సింహాద్రి’, ‘ఆది’ లాంటి ఇండస్ట్రీ హిట్లతో తెలుగు ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నాడు. మాస్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటూ, బాక్సాఫీస్‌ రికార్డులను చెరిపేసుకుంటూ దూసుకుపోతున్నాడు తారక్‌. ఇప్పుడు రాజమౌళితో నాలుగోసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కొమరం భీమ్‌గా విశ్వరూపం చూపేందుకు సిద్ధమవుతున్నాడు.   

ఈశ్వర్‌ వైఫల్యం.. బాహుబలితో విశ్వవ్యాప్తం!

‘బాహుబలి’తో ప్రభాస్‌ పేరు అంతర్జాతీయ స్థాయికి చేరింది. ప్రాంతీయ హద్దులు చెరిపేస్తూ మొత్తం ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆ సినిమా నిలిచింది. అంత భారీ విజయం సాధించిన ప్రభాస్‌కు కూడా తొలి విఘ్నం తప్పలేదు. ఆయన హీరోగా చేసిన మొదటి చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైంది. బస్తీ కుర్రాడిగా ప్రభాస్‌ నటించిన ‘ఈశ్వర్‌’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ‘వర్షం’, ‘ఛత్రపతి’ లాంటి విజయాలతో తెలుగు ప్రజల డార్లింగ్‌ అయిపోయాడు ప్రభాస్‌. ‘బాహుబలి’తో ఆయన స్టార్‌డమ్‌ విశ్వవ్యాప్తమైంది. పాన్ ఇండియా చిత్రాలంటే ప్రభాస్‌ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. 

  పరాజయం నుంచి పవర్‌ స్టార్‌ దాకా..

పవర్‌ స్టార్‌.. థియేటర్లు ఊగిపోడానికి, టికెట్లు తెగిపడటానికి, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురవడానికి ఈ ఒక్క పేరు చాలు. తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్న హీరో పవన్‌ కల్యాణ్‌. మెగాస్టార్‌ తమ్ముడిగా ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’తో హీరోగా పరిచయం అయ్యాడు. భారీ అంచనాల కారణంగా  బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిందా చిత్రం. ఆ తర్వాత ‘బద్రి’, ‘ఖుషి’, ‘గబ్బర్‌సింగ్‌’ లాంటి సినిమాలతో పవన్‌ సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. 

 మొదటి ‘జోష్‌’ లేకున్నా..  మాయచేసిన చైతూ..

అక్కినేని వారసుడు నాగచైతన్యకి తొలి అడుగులో పరాజయమే పలకరించింది. దిల్‌ రాజ్‌ నిర్మాణంలో ‘జోష్‌’ సినిమాతో అరంగేట్రం చేసిన చైతూకి ఆ చిత్రం నిరాశను మిగిల్చింది. బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఆ వెంటనే గౌతమ్‌ మేనన్‌తో తీసిన ‘ఏమాయ చేసావె’తో హిట్‌ కొట్టాడు. ‘100 %లవ్’‌,  ‘ప్రేమమ్‌’ సినిమాలతో  లవర్‌ బాయ్‌గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ములతో తీస్తున్న ‘లవ్‌స్టోరీ’పై భారీ అంచనాలే ఉన్నాయి. 

తొలి చిత్ర పరాజయ ప్రభావం.. హీరోలకంటే దర్శకుల మీదే ఎక్కువ.  మొదటి సినిమాతోనే కెరీర్‌ ముగిసిన దర్శకులు ఎందరో ఉన్నారు. అయితే ఆ  పరాజయాన్ని దాటుకొని మంచి విజయాలను అందుకున్న దర్శకులెందరో.. 

      హరీశ్‌ శంకర్‌కు తొలి ‘షాక్‌’

‘గబ్బర్‌సింగ్‌’ లాంటి పవర్‌ఫుల్‌ విజయం సాధించిన హరీశ్‌ శంకర్‌ తొలి చిత్రంతో తడబడ్డారు. రవితేజ, జ్యోతికలతో ఆయన తీసిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘షాక్‌’ ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత మళ్లీ రవితేజతోనే ‘మిరపకాయ్‌’లాంటి మాస్‌ మసాలా సినిమా తీసి ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఆ వెంటనే పవన్‌ కల్యాణ్‌తో ‘గబ్బర్‌ సింగ్‌’తో బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించి కమర్షియల్‌ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు  హరీశ్‌.  

  వంశీ పైడిపల్లికి ‘మున్నా’

టాలీవుడ్‌లో ‘బృందావనం’, ‘ఎవడు’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్లు సాధించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇప్పుడు తమిళ స్టార్‌ విజయ్‌తో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. ఆయన కూడా తొలి చిత్ర పరాజయ బాధితుడే. ప్రభాస్‌, ఇలియానా జంటగా ఆయన తీసిన ‘మున్నా’ టాలీవుడ్‌ను ఆకర్షించలేకపోయింది. అది ఆడకపోయినప్పటికీ చిత్ర నిర్మాత దిల్‌ రాజు ఎన్టీఆర్‌తో మరో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు. అలా ‘బృందావనం’తో హిట్‌ కొట్టారు వంశీ పైడిపల్లి. ఆ తర్వాత పరాజయమే తెలియని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. 

జాతిరత్నానికి మొదటి పరాభవం

 తెలుగు థియేటర్లను నవ్వుల్లో  ముంచెత్తిన సినిమా ‘జాతి రత్నాలు’. చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. కేవీ అనుదీప్‌ తీసిన మొదటి చిత్రం ‘పిట్టగోడ’ సరిగా ఆడలేదు. ఆ చిత్ర ఫలితం గురించి ఆలోచించకుండా అనుదీప్‌ ప్రతిభపై నమ్మకముంచి మరో అవకాశం ఇచ్చారు నాగ్‌ అశ్విన్‌. అనుకున్నట్లుగానే తానేంటో రెండో చిత్రంతో నిరూపించుకున్నాడు. 

ప్రవీణ్‌ సత్తారు తొలి ‘ఎల్బీడబ్ల్యూ’

‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్‌’లాంటి సినిమాలతో వైవిధ్యమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు ప్రవీణ్‌ సత్తారు. ‘గరుడ’తో ఓ స్పై చిత్రాన్ని అందించి హీరో రాజశేఖర్‌ను విజయాల బాట పట్టించారు. బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించిందా సినిమా. ఆయన తీసిన మొదటి చిత్రం ‘ఎల్బీడబ్ల్యూ’కి విభిన్న ప్రేమ కథా చిత్రంగా పేరొచ్చినా, కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదు. రెండో చిత్రం ‘రొటీన్‌ లవ్‌ స్టోరీ’తో హిట్‌ బాట పట్టాడీ దర్శకుడు. అది బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధించి పెట్టింది. ఇప్పుడు అగ్రహీరోలతో సినిమాలు చేస్తున్నాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే పరాజయం నుంచి గుణపాఠాలు నేర్చుకొని విజయాలు సాధించిన నటీనటులు, దర్శకులు ఇంకా ఉన్నారు. ఓటమితో కిందకు పడిపోయినా, ప్రయత్నిస్తే మళ్లీ విజయ శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని