New Movies Release dates: వస్తున్నాం.. వచ్చేస్తున్నాం.. థియేటర్లో కలుద్దాం!

చిత్రసీమకు మరింత కళ వస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన భారీ బడ్జెట్‌ చిత్రాలు విడుదల తేదీని ప్రకటించాయి.బుధవారం మరికొన్ని (తెలుగు, హిందీ, తమిళ్‌ చిత్రాలు) థియేటర్లో విడుదల తేదీలను ఖరారు చేశాయి. అవేంటంటే..

Published : 03 Feb 2022 01:13 IST

తాజాగా విడుదల తేదీలను ప్రకటించిన చిత్రాలివే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండడంతో చిత్రసీమకు మరింత కళ వస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన భారీ బడ్జెట్‌ చిత్రాలు విడుదల తేదీని ప్రకటిస్తూవస్తున్నాయి. బుధవారం మరికొన్ని (తెలుగు, హిందీ, తమిళ్‌ చిత్రాలు) థియేటర్లో విడుదల తేదీలను ఖరారు చేశాయి. 

వలిమై: ఫిబ్రవరి 24

అజిత్‌ హీరోగా హెచ్‌.వినోద్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వలిమై’. బోనీ కపూర్‌ నిర్మించారు. హ్యూమా ఖురేషి కథానాయిక. తెలుగు యువనటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. కొవిడ్‌ పరిస్థితుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో అజిత్‌ సీబీసీఐడీ అధికారిగా కనిపించనున్నారు. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ రానుంది.


అమితాబ్‌ ‘ఝండ్‌’: మార్చి4   

బాలీవుడ్‌లోనూ థియేటర్లరో సందడి చేసేందుకు కొత్త సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడ్డ చిత్రాలు ఒక్కొక్కటీ విడుదల తేదీని ప్రకటిస్తూ వస్తున్నాయి. బిగ్‌బి అమితాబ్‌ సైతం ‘‘ ‘ఝండ్‌’తో వస్తున్నా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ‘‘ మా బృందంతో ఫైట్‌ చేసేందుకు సిద్ధంగా ఉండండి. మార్చి 4, 2022లో ‘ఝండ్‌’ థియేటర్లలో విడుదల కానుంది’’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఎన్జీవో స్లమ్‌ సాకర్‌ ఫౌండర్‌ విజయ్‌ బర్సే జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు నాగరాజ్‌ మంజులే. పిల్లల్లో స్ఫూర్తి నింపి ఓ ఫుట్‌బాల్‌ టీమ్‌ని ఏర్పాటుచేసేందుకు విజయ్‌ బర్సే ఏమి చేశారన్న కథ సారాంశం. ఆకాశ్‌ తోశర్, రింకూ రాజ్‌ గురు కీలక పాత్రలు పోషించారు. టీ-సిరీస్‌, తాండవ ఫిల్మ్‌, ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆపాట్‌ ఫిల్మ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

పక్కా కమర్షియల్‌: మే 20

 గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. తొలుత 2022 మార్చి 18న థియేటర్లో విడుదల అని చెప్పినా కరోనా కారణంగా వాయిదా వేశారు. ‘‘కరోనా కరుణిస్తే.. మే 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల కలుద్దాం’’ అంటూచిత్ర బృందం విడుదల తేదీని తాజాగా ఖరారు చేసింది. ఇందులో లాయర్లుగా గోపిచంద్‌, రాశీ ఖన్నా కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. జాక్స్‌ బెజోయ్‌ సంగీతం అందిస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని