Sankranthi Movies: విజయ్‌.. బాలయ్య బెర్తులు ఖరారు.. చిరు వెయిటింగ్‌..!

ఈ సంక్రాంతికి విడుదలయ్యే తెలుగు చిత్రాల్లో ఈ కామన్‌ పాయింట్స్‌ గమనించారా?

Published : 03 Dec 2022 16:14 IST

తెలుగువారికి అతి పెద్ద పండగ అంటే సంక్రాంతి. ప్రతి ఇంటా రంగుల ముగ్గులు, చుట్టాల సందడితో పాటు, థియేటర్‌లు కొత్త చిత్రాలతో కళకళలాడుతుంటాయి. సంక్రాంతికి ఊరు వెళ్లాలంటే టికెట్‌లు బుక్‌ చేసుకోవాలి. థియేటర్‌కు సినిమా రావాలంటే డేట్‌ ఫిక్స్‌ చేసుకోవాలి. అలా రాబోయే సంక్రాంతికి వచ్చేస్తున్నామంటూ ఇప్పటికే పలు చిత్ర బృందాలు ప్రకటన చేశాయి. వాటిలో అగ్ర కథానాయకులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విజయ్‌ల చిత్రాలు ఉండగా, తాజాగా రెండు చిత్రాలకు బెర్తు అదేనండీ.. డేట్‌ ఫిక్స్‌ అయింది. మరొక చిత్రం ఇంకా వెయింటింగ్‌ లిస్ట్‌లోనే ఉంది. మరి ఆ చిత్రాలేంటో చూసేయండి.

మొదటి బెర్తు.. ‘వారసుడు’

తమిళంతో పాటు, తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విజయ్‌ (Vijay). ఇటీవల కాలంలో ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ విడుదలవుతోంది. తాజాగా ఆయన నటిస్తున్న తమిళ చిత్రం ‘వారిసు’ (varisu). రష్మిక కథానాయిక. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ‘వారసుడు’ (Varasudu) పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్‌ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. సంక్రాంతికి డేట్‌ను ప్రకటించి మొదట రేసులో నిలిచాడు ‘వారసుడు’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.


‘వీరసింహారెడ్డి’దీ అదే బెర్తు..!

సంక్రాంతి పండగ కలిసొచ్చిన తెలుగు హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఒకరు. ఆయన కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు కూడా దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘వీరసింహారెడ్డి’ని జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు శనివారం చిత్ర బృందం ప్రకటించింది. దీంతో బాక్సాఫీస్‌ ఒకే రోజున అటు విజయ్‌, ఇటు బాలకృష్ణ ఢీకొనబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూడా తమన్‌ స్వరకర్త.


‘వాల్తేరు వీరయ్య’.. వెయింటింగ్‌..!

‘వారసుడు’, ‘వీర సింహారెడ్డి’ చిత్రాల తేదీల ప్రకటనలు రావడంతో ఇప్పుడు అందరూ చిరంజీవి ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూస్తున్నారు. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ)దర్శకత్వంలో చిరు నటిస్తున్న మాస్‌ యాక్షన్‌, ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. జనవరి 12వ తేదీన రెండు చిత్రాలు తమ డేట్స్‌ను ఫిక్స్‌ చేసుకోవడంతో చిరు అందరికంటే కాస్త ముందుగా లేదా, ఆలస్యంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే జనవరి 10 లేదా జనవరి 14 తేదీల్లో ‘వాల్తేరు వీరయ్య’వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి రెండూ పెద్ద చిత్రాలే. ఇద్దరూ స్టార్‌ హీరోలే. ఈ క్రమంలో థియేటర్లు పంచుకోవాలంటే కనీసం రెండు రోజుల గ్యాప్‌ అయినా ఉండాలి. అదీ లేదంటే జనవరి మొదటి వారంలోనే వచ్చేయాలి. అయితే, సంక్రాంతికి ఆ వేడి చల్లారిపోతుంది. మరొక విషయం ఏంటంటే, అటు బాలకృష్ణ చిత్రాన్ని, ఇటు చిరు చిత్రాన్ని నిర్మిస్తున్నది మైత్రీ మూవీ మేకర్స్‌. ఇప్పటికే బాలయ్య సినిమా ప్రకటన వచ్చేసింది కాబట్టి, ఇక చిరు చిత్రంపైనే నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.


2023 సంక్రాంతికి రాబోయే చిత్రాల్లో కొన్ని కామన్‌ పాయింట్స్‌ ఉన్నాయి.

  • మూడు చిత్రాలు తెలుగు వర్ణమాలలో ‘వ’ అక్షరంతో మొదలవుతాయి. ‘వారసుడు’, ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’. మొదటి రెండు చిత్రాలు ఇంగ్లీష్ లెటర్‌ ‘V’ కాగా, మూడో చిత్రం ‘W’తో మొదలవుతుంది.
  • ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ ఈ రెండు భారీ చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్‌నిర్మిస్తుండటం విశేషం.
  • అటు బాలయ్య చిత్రంలోనూ, ఇటు చిరంజీవి చిత్రంలోనూ శ్రుతిహాసన్‌ కథానాయిక కావడంతో మరో ఆసక్తికర అంశం.
  • విజయ్‌, బాలకృష్ణ చిత్రాలకు తమన్‌ సంగీత దర్శకుడు.
  • ‘వారసుడు’, ‘వీరసింహారెడ్డి’ రెండూ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని