Vijay Antony: కష్టాలు, కన్నీళ్లు, ఆకలికేకలు.. సినిమాని తలపించేలా విజయ్ ఆంటోనీ లైఫ్ స్టోరీ
నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony)కి సంబంధించిన ఆసక్తికర విశేషాలు.
ఇంటర్నెట్‌డెస్క్: విజయ్ ఆంటోనీ (Vijay Antony).. రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్‌తో కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. సంగీతంలో ఓనమాలు దిద్దకుండానే మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి హిట్స్ అందుకుని మనసు మాట మేరకు నటుడిగా రాణిస్తున్నారాయన. అయితే, విజయ్ ఆంటోనీ జీవితంలో సక్సెస్‌లే కాదు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఆకలి కేకలు ఉన్నాయి. ఏడేళ్ల ప్రాయంలోనే బాధలు చూసి.. వాటి నుంచి రాటు తేలిన ఆయన తన (Vijay Antony) జీవిత ప్రయాణం గురించి గతంలో పలు ఇంటర్వ్యూల్లో తెలిపిన విషయం తెలిసిందే.
ఏడేళ్లకే జీవితం తలకిందులు..!
తమిళనాడులోని నాగర్‌కోయిల్ మా ఊరు. నాన్న ప్రభుత్వ రంగానికి సంబంధించిన సంస్థలో క్లర్క్. దాంతో చిన్నప్పుడు మా జీవితం సాఫీగా సాగింది. నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. అంతే, ఒక్కసారిగా మా కుటుంబం తలకిందులైంది. బరువు బాధ్యతలన్నీ అమ్మే చూసుకోవాల్సి వచ్చింది. మాకంటూ సొంత ఇల్లు లేదు. ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు. దాంతో అమ్మా, నేనూ, చెల్లి బంధువుల ఇళ్లల్లో ఉన్నాం. కొంతకాలానికి నాన్న ఉద్యోగం అమ్మకు ఇచ్చారు.
అమ్మను రావొద్దని చెప్పారు..!
ఉద్యోగ నిమిత్తం అమ్మతో కలిసి తిరునల్వేలికి వెళ్లినప్పుడు.. అక్కడ మాకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వలేదు. ఏం చేయాలో తెలియక అమ్మ ఎంతో బాధపడింది. అదే ప్రాంతంలో ఉన్న హాస్టల్స్‌లో మేము ముగ్గురం జాయిన్ అయ్యాం. ప్రతిరోజూ మా ఇద్దర్నీ కలవడానికి అమ్మ వచ్చేది. అయితే, ప్రతిరోజూ మమ్మల్ని కలవడానికి వస్తే మిగతా పిల్లలు బాధపడతారని చెప్పి అమ్మను హాస్టల్‌కు రావొద్దని అక్కడి సిబ్బంది కోరారు. దాంతో ఆమె వారానికొకసారి వచ్చి కలిసేవారు. ఉద్యోగంలో భాగంగా ఓసారి అమ్మ వేరే ఊరు వెళ్లారు. చెల్లిని కూడా తనతోపాటు తీసుకువెళ్లారు. కొన్నిరోజులకే నా హాస్టల్‌కు అనుకోకుండా సెలవులు ఇచ్చారు. అప్పుడు ఎక్కడికి వెళ్లాలో, అమ్మను ఎలా కలవాలో నాకు తెలియదు. మాకంటూ ఇల్లు కూడా లేదు. అలాంటి సమయంలో శ్రీలంక శరణార్థ విద్యార్థులతో కలిసి బస చేశాను. చేతిలో రూపాయి లేదు. అరటిపళ్లతో కాలం గడిపా. అలా, ‘ఆకలి కేకలు’ చూశా.
అదే తొలి విజయం..!
సినిమా వాళ్లకు కావాల్సినంత డబ్బు, సమాజంలో పేరు ఉంటుందని చిన్నప్పుడే నాకు అర్థమైంది. అందుకే ఇండస్ట్రీలోకి రావాలనుకున్నా. అదే విషయాన్ని అమ్మతో చెబితే మొదట అంగీకరించలేదు. విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేస్తానని చెప్పి చెన్నైకు వచ్చాను. ఓ వైపు చదువుకుంటూనే సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేశాను. నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ వద్ద సౌండ్ ఇంజనీరింగ్‌లో మెళకువలు నేర్చుకున్నా. నేను కట్టిన ట్యూన్స్‌ను సీడీగా చేసి ఓ సంస్థకు పంపించా. వాళ్లే నాకు సీరియల్స్‌లో తొలి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా ఎలాంటి శిక్షణ లేకుండానే మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాను. ‘డిష్యుం’ తో మ్యూజిక్ డైరెక్టర్‌గా సక్సెస్ అందుకున్నా. తమిళం, కన్నడంతోపాటు తెలుగులో వచ్చిన ‘మహాత్మ’, ‘దరువు’ చిత్రాలకు స్వరాలు అందించాను. అలాగే కొన్ని సినిమాలకు ఎడిటర్‌గానూ వర్క్ చేశా.
అందరూ షాకయ్యారు..!
సంగీత దర్శకుడిగా మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఏదో తెలియని వెలితి నన్ను వెంటాడింది. నటుడిగా మారాలనిపించింది. కుటుంబసభ్యులకు ఇదే విషయాన్ని చెబితే వాళ్లు షాకయ్యారు. సంతోషంగా ఉన్న జీవితాన్ని ఎందుకు కష్టాలమయంగా చేసుకుంటావని అన్నారు. అయినప్పటికీ మనసు మాట విని.. ‘విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ అనే బ్యానర్ స్థాపించి.. ‘నాన్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాను. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘నకిలీ’ పేరుతో విడుదల చేసి సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత వచ్చిన ‘బిచ్చగాడు’ (Bichagadu) తెలుగు రాష్ట్రాల్లో నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆనాటి నుంచి నేను నటించిన ప్రతి తమిళ సినిమాని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాను. కాకపోతే తెలుగులో పబ్లిసిటీ సరిగ్గా చేయకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఇక్కడ విజయం అందుకోలేకపోయాయి.
అమ్మే నాకు ప్రాణం..!
‘బిచ్చగాడు’ కథను శశి రచించాడు. అతడు ఈ కథ చెప్పినప్పుడు నేను ఏడ్చేశాను. వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి.. సినిమా చేద్దామని మాటిచ్చా. అలా, ఆ సినిమా చేశాను. అమ్మ అంటే నాకెంతో ఇష్టం. ఆమె కోసం ఏదైనా చేస్తాను. నాన్న చనిపోయాక ఆమె ఎన్నో కష్టాలు పడింది. డబ్బు లేకపోతే ఒక ఒంటరి మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో నాకు చిన్నప్పుడే తెలిసింది.
ఆ రిపోర్టరే నా భార్య..!
‘డిష్యుం’ సక్సెస్ ఆ తర్వాత ఓ రిపోర్టర్ (ఫాతిమా) నాకు ఫోన్ చేసి విషెస్ చెప్పింది. ఇంటర్వ్యూ కోసం నన్ను కలిసింది. కట్ చేస్తే కలిసిన నాలుగో రోజే నేను ఆమెకు ప్రపోజ్ చేశా. పెద్దల అంగీకారంతో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. నేను ఏం చేసినా తను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది.
కొత్త అవతారం..!
‘బిచ్చగాడు -2’ (Bichagadu 2) షూట్ చేస్తున్నప్పుడు నేను బోటు ప్రమాదంలో గాయపడ్డా. ప్రమాదం కారణంగా నా దవడ భాగం కిందకు జారిపోయింది. దాన్ని సరి చేయడానికి తొమ్మిది ప్లేట్లు వేశారు. దాంతో నా ముఖం ఎంతో మారిపోయినట్లు ఉంది.
సంబంధం లేదు..!
‘బిచ్చగాడు’ తల్లి సెంటిమెంట్‌పై తెరకెక్కిన సినిమా. ఇప్పుడు వస్తున్న ‘బిచ్చగాడు -2’ దానికి సీక్వెల్ కాదు. మొదటి దానితో దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కొత్త కథ. ఈ కథను నేనే రాశాను. సోదరి సెంటిమెంట్‌తో ఇది రూపుదిద్దుకుంది. డబ్బు గురించీ ఇందులో ఎక్కువగానే చూపించా. ఇది తప్పకుండా విజయం అందుకుంటుందని నమ్ముతున్నా. తెలుగులోనూ ఒక సినిమా చేయాలని ఉంది’’ అని విజయ్ ఆంటోనీ (Vijay Antony) పలు సందర్భాల్లో వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!