Devil: తప్పు జరిగితే మీరు ఊరుకుంటారా?: ‘దేవర’పై కల్యాణ్‌రామ్‌ కామెంట్స్‌

తన కొత్త సినిమా ‘డెవిల్‌’ ట్రైలర్‌ విడుదల వేడుకలో ‘బింబిసార 2’, ‘దేవర’ చిత్రాల అప్‌డేట్స్‌ ఇచ్చారు హీరో కల్యాణ్‌ రామ్.

Updated : 12 Dec 2023 19:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను హీరోగా నటించిన హిట్‌ చిత్రం ‘బింబిసార’ (Bimbisara)కు సీక్వెల్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) తెలిపారు. అనంతరం, ‘దేవర’ (Devara)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొత్త సినిమా ‘డెవిల్‌’ (Devil) ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. పీరియాడికల్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా నటించారు. సంయుక్త, మాళవిక నాయర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్వీయ నిర్మాణంలో అభిషేక్‌ నామా తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం.. హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించి, అభిమానుల సమక్షంలో ట్రైలర్‌ రిలీజ్‌ (Devil Trailer Launch) చేశారు.

వేడుకనుద్దేశించి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.. ‘‘కథ బాగున్న సినిమాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ‘బింబిసార’ సమయంలో చెప్పా. దాన్ని మీరంతా నిజం చేశారు. ‘డెవిల్‌’ కూడా మంచి కథ, కథనం, విజువల్స్‌తో కూడిన సినిమా. దీనినీ ఆదరిస్తారని ఆశిస్తున్నా. అభిమానులు కోరుకునే అన్ని హంగులు ఈ చిత్రంలో ఉన్నాయి. ట్రైలర్‌ చూసి కొంతమంది ఇది నా ‘వన్‌మ్యాన్‌ షో’ అని అంటున్నారు. ఏ చిత్రమైనా సమృష్టి కృషితో రూపొందేదే తప్ప ఒక్కరి వల్ల కాదు’’ అని పేర్కొన్నారు. గతేడాది విడుదలైన ‘బింబిసార’ సినిమా సీక్వెల్‌పై స్పందిస్తూ.. వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభమవుతుందని తెలిపారు.

ఆ రికార్డు ప్రభాస్‌ సినిమాలకు మాత్రమే సాధ్యం.. ‘సలార్’ నిర్మాత

ఎన్టీఆర్‌ (NTR) హీరోగా తెరకెక్కుతోన్న ‘దేవర’ గురించి మాట్లాడుతూ.. ‘‘తమ్ముడు అప్‌డేట్స్‌ చెప్పొద్దన్నాడు. కానీ, ఓ మాట చెప్పాలనుకుంటున్నా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లాంటి సినిమా చేసిన తర్వాత నటులు, దర్శకుడు, నిర్మాతలకు తదుపరి చిత్రాల విషయంలో ఎక్కువ బాధ్యత ఉంటుంది. కథ, విజువల్స్‌.. ఇలా ఎందులోనైనా ఒకవేళ తప్పు జరిగితే మీరు (అభిమానులు) ఊరుకుంటారా? మేం తెలిసి తప్పు చేయం. బాధ్యతగా తీసుకుని మిమ్మల్ని అలరించేందుకు ఎంతో కష్టపడతాం. త్వరలో గ్లింప్స్‌ రాబోతుంది. సంబంధిత పనులు జరుగుతున్నాయి. ‘దేవర’తో మీకో కొత్త ప్రపంచం చూపించబోతున్నాం. మేమంతా చర్చించుకుని గ్లింప్స్‌ రిలీజ్‌ డేట్‌ త్వరలో ప్రకటిస్తాం. అప్పటి వరకు ఓపిక పట్టండి’’ అని విజ్ఞప్తి చేశారు.

రెండు భాగాలుగా రూపొందుతున్న ‘దేవర’కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సైఫ్‌ అలీఖాన్ ప్రతినాయకుడు. తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న (Devara Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు