Kamal Haasan: మాలాంటి స్నేహితులు మరెవరూ లేరు: రజనీకాంత్‌ను ఉద్దేశిస్తూ కమల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘సైమా’ వేదికపై తన మిత్రుడు రజనీకాంత్‌ (Rajinikanth)ను ఉద్దేశిస్తూ కమల్‌హాసన్‌ (Kamal Haasan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి.

Updated : 17 Sep 2023 12:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకులు రజనీకాంత్‌ (Rajinikanth), కమల్ హాసన్‌ (Kamal Haasan) మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ కమల్‌హాసన్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్ఠాత్మక సైమా అవార్డుల (Siima awards 2023) వేదికపై ఆయన రజనీకాంత్‌ గురించి ప్రస్తావించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే..?

‘విక్రమ్‌’ (Vikram) చిత్రానికి గానూ ఈ ఏడాది ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అందుకున్నారు కమల్‌ హాసన్‌. ఈ సందర్భంగా ఆయన.. చిత్ర దర్శకుడు, తన అభిమాని లోకేశ్‌ కనగరాజ్‌ను మెచ్చుకున్నారు. అనంతరం లోకేశ్‌ - రజనీకాంత్‌ కాంబోలో రానున్న సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘లోకేశ్‌ కనగరాజ్‌ నాకు వీరాభిమాని. ఇటీవల అతడు నా స్నేహితుడు రజనీకాంత్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. దీనిపై పలువురు.. ‘రజనీకాంత్‌తో మీ అభిమాని సినిమా చేయడం ఏంటి?’ అనే సందేహాలు వ్యక్తం చేశారు. సాధారణ ప్రేక్షకులకు అది మాత్రమే తెలుసు. కానీ, వారిద్దరూ సినిమా చేయడం పట్ల నేనెంతో గర్విస్తున్నా. దాదాపు 15 ఏళ్ల క్రితం ‘కమల్‌ 50’ అనే కార్యక్రమంలో మా స్నేహబంధం గురించి మాట్లాడా. రజనీకాంత్‌ - కమల్‌హాసన్‌ లాంటి స్నేహితులు ఆనాటి తరంలో ఎవరూ లేరు. మా మధ్య కూడా పోటీ ఉండేది. కానీ, అది ద్వేషంతో కాకుండా ఆరోగ్యకరంగా ఉండేది. దానివల్లే మేము ఈ స్థాయికి చేరుకున్నాం’’ అని కమల్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

‘సైమా’లో ‘విక్రమ్‌’ హవా.. రెండు అవార్డులు అందుకున్న కమల్‌హాసన్‌

అనంతరం మణిరత్నంతో చేయనున్న సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘నాయగన్‌’ కోసం ఎలా అయితే ప్రశాంతంగా వర్క్‌ చేశామో దీని కోసం కూడా అలాగే పనిచేస్తున్నాం. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ సినిమా కోసం నేను గడ్డం పెంచుకుంటున్నా’’ అని కమల్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని