Kiran Abbavaram: నన్ను టార్గెట్‌ చేస్తే మీకేం వస్తుంది?.. నెపోటిజం ఇండస్ట్రీలో లేదు: కిరణ్‌ అబ్బవరం

తన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా విజయోత్సవ సమావేశంలో కిరణ్‌ అబ్బవరం ట్రోలర్స్‌పై మండిపడ్డారు.

Published : 21 Feb 2023 23:25 IST

హైదరాబాద్‌: ‘నన్ను టార్గెట్‌ చేస్తూ విమర్శిస్తే మీకేం వస్తుంది?’ అని ట్విటర్‌ వేదికగా తనను ట్రోల్స్‌ చేసే వారిని యువ నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ప్రశ్నించారు. నెపోటిజం చిత్ర పరిశ్రమలో లేదని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే వారే నెపోటిజాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. తన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha)కు విడుదలైన నాలుగు రోజుల్లోనే డబ్బులు తిరిగి వచ్చాయన్న ఆయన.. ఆ చిత్రంపై ట్విటర్‌లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల తనలాంటి యువ కథానాయకులు సినీ పరిశ్రమలో ఎలా ఎదుగుతారని ప్రశ్నించారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం, కిరణ్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నా గత చిత్రాలకు మీరిచ్చిన ఫలితాన్ని నేను కాదనలేదు. నేను చేసిన సినిమాలు అలా ఉన్నాయేమో అనుకున్నా. కానీ, ఇప్పుడు ‘వినరో భాగ్యము విష్ణుకథ’ విషయంలో మాట్లాడొచ్చు అనుకుంటున్నా. ప్రేక్షకులంతా ఈ సినిమాని ఆదరించారు. ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియదుగానీ కొన్ని బ్యాచ్‌లు ట్విటర్‌ తెరవగానే కనిపిస్తున్నాయి. ‘నీ సినిమా బాగోలేదు’ అని పుణె నుంచి ఒకడు మెసేజ్‌ పెడతాడు. పుణెలో ఉన్నవాడు నా సినిమా ఎలా చూస్తాడు? ఇలా విమర్శించే వారి వివరాలు చూస్తుంటే ఇక్కడివారు కాదని తెలుస్తుంది. మీరేం చేసినా నేను ఇక్కడే ఉంటా’’ అని కిరణ్‌ స్పష్టం చేశారు. ఈయన హీరోగా దర్శకుడు మురళీ కిశోర్‌ తెరకెక్కించిన చిత్రమిది. కశ్మీరా పరదేశి కథానాయిక. నంబర్‌ నైబర్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న విడుదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని