Adipurush: అమ్మో.. ఇంత నిడివా!.. ‘పాతాళ భైరవి’ నుంచి ‘ఆదిపురుష్‌’ వరకు..

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’ సినిమా సుమారు 3 గంటల నిడివితో.. ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా.. ఇప్పటి వరకు అధిక రన్‌టైమ్‌తో వచ్చిన టాలీవుడ్‌ చిత్రాలేంటో చూద్దాం..

Updated : 13 Jun 2023 12:31 IST

రామాయణం ఆధారంగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush) ఈ శుక్రవారం విడుదల కానుంది. సెన్సార్‌ బోర్డు (Central Board of Film Certification).. యు (U) సర్టిఫికెట్‌ జారీ చేసిన ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు. ఈ అప్‌డేట్‌ గురించి తెలియగానే ‘అమ్మో.. ఇంత నిడివా!’ అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నెట్టింట చర్చ సాగించారు. అయితే, ఇంతటి రన్‌టైన్‌ టాలీవుడ్‌కి కొత్తేమీ కాదు. నాటి నుంచి గతేడాది వరకు విడుదలైన పలు సినిమాలు సుమారు 3 గంటలు, అంతకంటే ఎక్కువ నిడివితో విడుదలై, మంచి విజయం అందుకున్నాయి. కొన్ని ఎవర్‌గ్రీన్‌ చిత్రాలుగా నిలిచాయి. అవేంటో చూసేయండి..

పాతాళ భైరవి

దర్శకుడు కె.వి. రెడ్డి (KV Reddy)- నటుడు నందమూరి తారక రామారావు (NT Rama Rao) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం.. ‘పాతాళ భైరవి’ (Pathala Bhairavi). ఈ ఫాంటసీ ఫిల్మ్‌ రన్‌టైమ్‌.. 3: 15 గం. ఈ సినిమా 1951లో విడుదలైంది.

మిస్సమ్మ 

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) హీరోలుగా దర్శకుడు ఎల్‌.వి. ప్రసాద్‌ (LV Prasad) తెరకెక్కించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం .. ‘మిస్సమ్మ’ (Missamma). 3: 01 గం. నిడివితో ఈ సినిమా 1955లో విడుదలైంది.

మాయాబజార్‌

కె.వి. రెడ్డి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన చిత్రం.. ‘మాయాబజార్‌’ (Mayabazar). 1957లో విడుదలైన ఈ సినిమా రన్‌టైమ్‌ 3: 04 గం.

లవకుశ

నందమూరి తారక రామారావు ప్రధాన పాత్రలో దర్శకులు సి. పుల్లయ్య, సి.ఎస్‌. రావు రూపొందించిన సినిమా.. ‘లవకుశ’ (Lava Kusa). 3: 28 గం. రన్‌టైమ్‌తో 1963లో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ మైథలాజికల్‌ ఫిల్మ్‌.

పాండవ వనవాసం

కమలాకర కామేశ్వరరావు (Kamalakara Kameswara Rao) దర్శకత్వంలో నందమూరి తారక రామారావు నటించిన పౌరాణికం సినిమా.. ‘పాండవ వనవాసం’ (Pandava Vanavasam). 1965లో రిలీజ్‌ అయిన ఈ సినిమా నిడివి 3: 18 గం.

అల్లూరి సీతారామరాజు

కృష్ణ (Krishna) హీరోగా దర్శకుడు వి. రామచంద్ర రావు (V Ramachandra Rao) తెరకెక్కించిన చిత్రం.. ‘అల్లూరి సీతారామరాజు’ (Alluri Seetarama Raju). 1974లో విడుదలైన ఈ సినిమా నిడివి 3 గంటల 7 నిమిషాలు.

దాన వీర శూర కర్ణ

స్వీయ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు హీరోగా నటించిన మైథలాజికల్‌ చిత్రం.. ‘దాన వీర శూర కర్ణ’ (Daana Veera Soora Karna). 1977లో విడుదలైన ఈ సినిమా నిడివి 3 గంటల 46 నిమిషాలు.

ప్రస్థానం

సాయికుమార్‌ (Sai Kumar), శర్వానంద్‌ (Sharwanand), సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌.. ‘ప్రస్థానం’ (Prasthanam). 3: 01 గం. రన్‌టైమ్‌తో ఈ సినిమా 2010లో రిలీజ్‌ అయింది.

నువ్వు నాకు నచ్చావ్‌

వెంకటేశ్‌ (Venkatesh), ఆర్తి అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా దర్శకుడు కె. విజయ భాస్కర్‌ (K Vijaya Bhaskar) తెరకెక్కించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం.. ‘నువ్వు నాకు నచ్చావ్‌’ (Nuvvu Naaku Nachav). 2001లో విడుదలైన ఈ సినిమా రన్‌టైమ్‌: 3 గంటలు.

అర్జున్‌ రెడ్డి

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బ్లస్టర్‌గా నిలిచిన చిత్రం.. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy). సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన ఈ సినిమా 3: 02 గం. నిడివితో 2017లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

రంగస్థలం

రామ్‌ చరణ్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘రంగస్థలం’ (Rangasthalam) ఒకటి. సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2018లో విడుదలైంది. రన్‌టైమ్‌: 2: 54 గం.

గద్దలకొండ గణేష్

వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోగా యాక్షన్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన సినిమా.. ‘గద్దలకొండ గణేష్‌’ (Gaddalakonda Ganesh). హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) డైరెక్షన్‌లో.. 2: 52 గం. నిడివితో ఈ సినిమా 2019లో విడుదలైంది.

పుష్ప

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా ఫిల్మ్‌.. ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa: The Rise). 2021లో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు.

ఆర్‌ఆర్‌ఆర్‌

రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (NTR) హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా రన్‌టైమ్‌ 3: 02 గం. గతేడాది విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

  • భారతీయ సినిమాల సాధారణ నిడివి రెండున్నర గంటలు లేదా అంతకంటే తక్కువ. ఎంతగా ఎడిట్‌ చేసినా.. కథ డిమాండ్‌ మేరకు కొన్ని చిత్రాలకు రన్‌టైమ్‌ ఎక్కువైనా అలానే విడుదల చేయాల్సి వస్తుంది. నిడివి పెరిగినంత మాత్రాన ప్రేక్షకులు ఆస్వాదించలేరనేది అసత్యమని పైన పేర్కొన్న సినిమాలు నిరూపించాయి. అయితే, లాంగ్‌ రన్‌టైమ్‌తో తెరకెక్కి, ఆశించిన ఫలితం అందుకోలేని సినిమాలూ ఉన్నాయి. సుమారు 3 గంటల రన్‌టైమ్‌తో రాబోతున్న ‘ఆదిపురుష్‌’ (Adipurush Release on June 16th)లో హీరో ప్రభాస్‌.. రాముడిగా కనిపించనున్నారు. రామాయణంలోని అరణ్య కాండ, యుద్ధ కాండ ప్రధానఘట్టాలుగా ఈ సినిమాలో చూపించనున్నారు దర్శకుడు ఓంరౌత్‌. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని