Naa Saami Ranga: ఓటీటీలోకి ‘నా సామిరంగ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగ’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Published : 10 Feb 2024 13:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’ (Naa Saami Ranga)తో పలకరించారు నాగార్జున (Nagarjuna). విజయ్‌ బిన్ని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆయన మాస్‌ అవతార్‌లో అలరించారు. నాగ్‌ సరసన ఆషికా రంగనాథ్ సందడి చేయగా.. అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కీలకపాత్రల్లో మెప్పించారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ప్రసారం కానున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందించిన ఈ చిత్రంలో మిర్నా మేనన్, రుక్సర్‌ థిల్లాన్, నాజర్, రావు రమేష్ తదితరులు నటించారు.

కథేంటంటే: కిష్టయ్య (నాగార్జున) అనాథ. అంజి (అల్లరి నరేశ్‌) తల్లి అతడిని చేరదీస్తుంది. అప్పటి నుంచి వారిద్దరూ సొంత అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు. తల్లి చనిపోయిన తర్వాత ఆ పిల్లలిద్దరికీ ఊరి ప్రెసిడెంట్‌ పెద్దయ్య (నాజర్‌) అండగా నిలబడతాడు. కిష్టయ్య 12 ఏళ్ల వయసులోనే వరాలు (ఆషికా రంగనాథ్‌)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. చదువుల కోసం పట్టణానికి వెళ్లిపోయిన ఆమె.. 15 ఏళ్లకు తిరిగి వస్తుంది. దీంతో వీరిద్దరి ప్రేమ మళ్లీ మొదలవుతుంది. తన ప్రేమ విషయాన్ని పెద్దయ్యకు చెప్పేందుకు వరాలును తీసుకొని ఇంటికి వెళ్తాడు కిష్టయ్య. సరిగ్గా అప్పుడే ఆమె తండ్రి వరదరాజులు (రావు రమేశ్‌) తన కూతుర్ని పెద్దయ్య కుమారుడు దాసు (షబ్బీర్‌)కు ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం కుదుర్చుకోవడానికి వస్తాడు. అయితే.. వీళ్ల ప్రేమను అర్థం చేసుకొని పెద్దయ్య ఆ సంబంధాన్ని వదులుకుంటాడు. కానీ, తన కూతుర్ని కిష్టయ్యకు ఇచ్చి పెళ్లి చేయడానికి వరదరాజులు ససేమిరా అంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది? వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కిందా? అంజిపై దాసు పగ పెంచుకోవడానికి కారణమేంటి? ఈ కథలో భాస్కర్‌ (రాజ్‌తరుణ్‌) - కుమారి (రుక్సార్‌)ల ప్రేమకథతో ఏర్పడ్డ సంఘర్షణ ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని