Nani: దాన్ని బ్రేక్‌ చేయడం కష్టం.. ‘దసరా’ అరుదైన చిత్రం: నాని

తాను హీరోగా నటించిన ‘దసరా’ అరుదైన చిత్రమని నాని అన్నారు. ఆ సినిమాలోని ‘ఓరి వారి’ పాట విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు.

Published : 13 Feb 2023 22:33 IST

హైదరాబాద్‌: నాని(Nani) హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’ (dasara). కీర్తి సురేశ్‌ కథానాయిక. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ఓ వేడుక నిర్వహించి, సినిమాలోని బ్రేకప్‌ పాట ‘ఓరి వారి’ని విడుదల చేసింది. అనంతరం నాని.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

* ఇతర చిత్ర పరిశ్రమల్లోని ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్‌ చేసుకుంటారనుకుంటున్నారు?

నాని: కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమాలకు ఏ భాష ప్రేక్షకులైనా ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌’, ‘పుష్ప’, ‘కాంతార’ చిత్రాలు అలాంటివే. ఈ సినిమా కథలు ప్రేక్షకులు రెగ్యులర్‌గా చూసేవి కాదు. అలానే హైదరాబాద్‌లో ఉన్నవారికి వీర్లపల్లి అనేది ఎంత కొత్త ప్రపంచమో ముంబయి, చెన్నై, కేరళలో ఉన్నవారికీ అంతే కొత్త ప్రపంచం.

* ఇటీవల నిర్వహించిన ఫ్యాన్స్‌మీట్‌లో పొరుగు రాష్ట్రాల నుంచీ అభిమానులు వచ్చారు కదా!

నాని: ఒకప్పుడు హైదరాబాద్‌ దాటి నేను ఎక్కడికైనా వెళ్తే హాలీడేలా ఉండేది. ఎందుకంటే అప్పుడు నన్ను ఎవరూ గుర్తుపట్టేవారు కాదు. ఇప్పుడు ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా ఎవరో ఒకరు నాతో ఫొటో దిగుతున్నారు. తెలుగు సినిమా అంతగా ప్రేక్షకులకు చేరింది. ఈ విషయంలో ఓటీటీకి కూడా థ్యాంక్స్‌ చెప్పాలి. మంచి సినిమా తీస్తే అది తప్పక అందరికీ చేరుతుంది.

* ఇది మంచి సినిమానా? బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించే చిత్రమా?

నాని: బాక్సాఫీసును కొల్లగొట్టే మంచి సినిమా. ఇలాంటి కాంబినేషన్‌ అరుదు. ‘‘కథే ప్రధానంగా తీసే ఎందరో దర్శకులతో నేను పనిచేశా. అలా వారు స్టోరీ నిజాయతీగా చెబుతున్నప్పుడు కమర్షియల్‌ కోణం మిస్‌ అయ్యేది. వారందరి దగ్గర మిస్‌ అయింది శ్రీకాంత్‌ విషయంలో మిస్‌ అవ్వలేదు’’ అని సంగీత దర్శకుడు సంతోశ్‌ నారాయణ్‌ చెప్పారు.

* ఈ చిత్రానికి ఏదైనా అవార్డు ఆశిస్తున్నారా?

నాని: వద్దండీ.. ఇప్పటికే చాలా ఉన్నాయి ఇంట్లో. నేను మీ ప్రేమనే కోరుకుంటున్నా. అదే చిరస్థాయిగా ఉంటుంది. ఎవరైనా అవార్డు ఇస్తే మాత్రం వద్దనకుండా తీసుకుంటా (నవ్వులు).

* కీర్తి సురేశ్‌తో మరోసారి కలిసి నటించడం ఎలా అనిపించింది?

నాని: మేం గతంలో ‘నేను లోకల్‌’ సినిమాలో కలిసి నటించాం. అందులోని పాత్రలను గుర్తుచేస్తూ మమ్మల్ని పొట్టి, బాబు అని ఇప్పటికీ పిలుస్తున్నారు. మార్చి 30 నుంచి ఆ పేర్లు వినిపించవు. ధరణి, వెన్నెల పేర్లే వినిపిస్తాయి. ఇకపై దీన్ని బ్రేక్‌ చేయాలంటే చాలా కష్టం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు