ఈతరం సావిత్రి .. ‘మహానటి’ని వదులుకుంది 

‘నిత్య’గా టాలీవుడ్‌కి పరిచయమైంది.. ‘ప్రియ’గా ఇష్క్‌ను పంచింది.. ‘శ్రావణి’గా గుండెజారి గల్లంతయ్యేలా చేసింది.. ‘నజీరా’గా.. ‘అను’గా సహజమైన నటనతో  ఆకట్టుకుంది.. ఈతరం ‘సావిత్రి’ అనిపించుకుంది.. ఎప్పుడూ చిరు నవ్వులు చిందిస్తూ ‘మాయ’ చేస్తుంటుంది నిత్యా మేనన్‌.

Updated : 08 Apr 2021 14:12 IST

నిత్యా మేనన్‌ ఇష్టాయిష్టాలు మీకు తెలుసా

‘నిత్య’గా టాలీవుడ్‌కి పరిచయమైంది.. ‘ప్రియ’గా ఇష్క్‌ను పంచింది.. ‘శ్రావణి’గా గుండెజారి గల్లంతయ్యేలా చేసింది.. ‘నజీరా’గా.. ‘అను’గా సహజమైన నటనతో  ఆకట్టుకుంది.. ఈతరం ‘సావిత్రి’ అనిపించుకుంది.. ఎప్పుడూ చిరు నవ్వులు చిందిస్తూ ‘మాయ’ చేస్తుంటుంది  ఆమే నిత్యా మేనన్‌. గురువారం ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా నిత్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన గురించి కొన్ని విశేషాలు చూద్దాం...

అలా మొదలైంది..

1990 ఏప్రిల్‌ 8న పుట్టిన నిత్య ఎనిమిదేళ్ల వయసులోనే నటించింది. ‘ది మంకీ హూ న్యూ టూ మచ్‌’ అనే ఇంగ్లిష్‌ చిత్రంలో బాల నటిగా మెరిసింది. ఇందులో టబుకి సోదరిగా కనిపిస్తుంది నిత్య. 2006లో ‘సెవెన్‌ ఓ క్లాక్’ అనే కన్నడ చిత్రంతో నాయికగా మారింది. 2009లో ‘ఆకాశ గోపురం’ సినిమాతో మలయాళ, 2011లో ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు, ‘నూట్రెన్‌బధు’తో తమిళ, 2019లో ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.

తొలి సినిమాతోనే..

నాని హీరోగా వచ్చిన ‘అలా మొదలైంది’లో నిత్య అనే పాత్రకు ప్రాణం పోసి తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అందం, అభినయంతోనే కాకుండా తన గళంతోనూ మెప్పించింది. తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంలోని ఇషా తల్వార్‌ పాత్రకు, డిస్నీ సంస్థ రూపొందించిన యానిమేషన్‌ సినిమా ‘ఫ్రోజెన్‌ 2’ లోని ఎస్లా అనే పాత్రకు గళం అందించింది నిత్యనే.

గాయనిగానూ..

నటన, డబ్బింగ్‌ల్లోనే కాదు పాటల్లోనూ తన ప్రతిభ చూపించింది నిత్య. అది కూడా తొలి చిత్రంతోనే. ‘అలా మొదలైంది’లో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, అమ్మమ్మో అమ్మో అనే పాటల్ని ఆలపించి తెలుగు ఇంతబాగా నేర్చుకుందా అనేలా చేసింది. ఆ తర్వాత ‘ఇష్క్‌’లో ఓ ప్రియా ప్రియా, ‘జబర్‌దస్త్‌‌’లో అరెరె అరెరె, ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో తూ హీ రే, ‘24’లో లాలిజో అనే గీతాల్ని సుమధురంగా పాడింది.

గుర్తింపునిచ్చిన పాత్రలు..

తొలి ప్రయత్నంలోనే (అలా మొదలైంది) నటిగా మంచి మార్కులు సంపాదించుకున్న నిత్య కథా బలమున్న సినిమానే ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో వచ్చినవే ‘ఇష్క్‌’లోని ప్రియ, ‘గుండెజారి గల్లంతయ్యిందే’లోని శ్రావణి, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’లోని నజీరా, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లోని వల్లి, ‘24’లోని ప్రియ, ‘జనతా గ్యారేజ్‌’లోని అను, ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’లోని సావిత్రి పాత్రలు. ప్రేమికురాలిగా సరదాగా సాగే పాత్రల్లో కనిపిస్తూనే బరువైన పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉంటుంది. ‘రుద్రమ దేవి’లోని ముక్తాంబ, త్వరలో రాబోతున్న ‘గమనం’లోని శైలాపుత్రి దేవి పాత్రలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఈ చిత్రంతోపాటు ‘నవరస’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

‘మహానటి’ని వదులుకున్నా..

‘నా తొలి తెలుగు చిత్రం ‘అలా మొదలైంది’ చూసిన చాలామంది నన్ను సావిత్రిలా ఉన్నావంటూ ప్రశంసించారు. అంతటి మహానటితో పోలుస్తున్నారంటే చాలా ఆనందంగా ఉండేది. సావిత్రిగారి బయోపిక్‌ కోసం ముందుగా నన్ను సంప్రదించింది చిత్రబృందం. అద్భుతమైన నటి జీవితగాథ అంటే మాటలా! చేస్తానని చెప్పా. కానీ, తర్వాత ఆ చిత్రాన్ని వదలుకున్నా. దానికి కారణం చెప్పలేను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిత్య.

అందుకున్న అవార్డులు..

* ఉత్తమ నటిగా నంది అవార్డు: అలా మొదలైంది (తెలుగు)

* ఉత్తమ నటిగా సినీ మా అవార్డు: ఇష్క్‌ (తెలుగు)

* ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు సౌత్‌: గుండెజారి గల్లంతయ్యిందే (తెలుగు)

* ఉత్తమ నటిగా (క్రిటిక్స్‌ విభాగంలో) ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు సౌత్‌: మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (తెలుగు)

* నంది అవార్డు (స్సెషల్‌ జ్యూరీ): మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (తెలుగు)

* ఉత్తమ నటిగా (క్రిటిక్స్‌ విభాగంలో) సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డు: ఒకే కన్మణి (తమిళ్‌)

* ఉత్తమ సహాయనటిగా 65వ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు సౌత్‌: మెర్సల్‌ (తమిళ్‌)

నిత్యకు ఏం ఇష్టమంటే..

* అన్ని సబ్జెక్టుల్లో మీకు ఏది ఇష్టం అంటే ఇంగ్లిష్ అని చెబుతుంది నిత్య. ఇంగ్లిష్‌లో కవిత్వం రాయడం మహా సరదా తనకి.

* పాటలు పాడటం అంటే అమితాసక్తి.

* ఆటలు చూడటం, ఆడటం నిత్యకి నచ్చవు.

ఏం చదివిందంటే..

కేరళలో పుట్టింది..  బెంగళూరులో పెరిగింది..  మణిపాల్‌ విశ్వ విద్యాలయంలో జర్నలిజం చదివింది. అయితే చదువుతున్నప్పుడే దానిపై ఆసక్తి తగ్గింది నిత్యకి. సమాజానికి అవగాహన కల్పించాలన్నా, సమాచారం అందించాలన్నా చాలా మార్గాలున్నాయి.. వాటిల్లో చిత్ర పరిశ్రమ ఓ మంచి మార్గం అనుకుంది.

ఎన్ని భాషలు వచ్చు..

కన్నడ, తెలుగు, ఇంగ్లిష్‌, మలయాళం, హిందీ.

ఎక్కువ సార్లు చూసిన సినిమా: జార్జ్‌ క్లూనీ నటించిన ‘ది డెసెండెంట్స్‌’.

మెచ్చే నటులు: రేవతి, టబు.

కాబోయేవాడు ఎలా ఉండాలంటే..

తెలివైనవాడు, దయగలవాడు, అందమైనవాడు.. ఎప్పుడూ గడ్డంతో కనిపించాలట.

మరిచిపోలేని సంఘటన..

నిత్యకి ప్రత్యేక ఆకర్షణ ఉంగరాల జుత్తు. దానికి అభిమాన సంఘమే ఉందండోయ్‌. ఆమె చదువుకునే రోజుల్లో ‘ప్రెట్టీ గర్ల్‌ విత్‌ కర్లింగ్‌ హెయిర్‌’  అనే బిరుదు కూడా ఇచ్చారట వాళ్లు. అయినా నిత్య ఇలాంటి పొగడ్తలకు పొంగిపోకుండా వాళ్లకి షాక్‌ ఇచ్చింది. తలపై ఎలాంటి బరువు లేకుండా ప్రశాంతంగా ఉండాలనే ఆలోచనతో గుండు చేయించింది. అయినా ఆమె అందానికొచ్చిన లోటేమీ లేదు. జుత్తు లేకపోయినా క్యూట్‌గా ఉన్నావని తన సీనియర్లు కితాబివ్వడంతో ఆ సమయంలో మురిసిపోయింది నిత్య.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని