Paruchuri: ఆ జాగ్రత్త తీసుకుని ఉంటే ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’కి మంచి లాభాలొచ్చేవి

‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’(Miss Shetty Mr Polishetty) సినిమాను పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు. సినీ ప్రపంచం మోడ్రన్‌గా మారుతుందనడానికి ఈ చిత్రం ఉదాహరణ అన్నారు.

Published : 18 Nov 2023 17:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవీన్‌ పోలిశెట్టి- అనుష్క శెట్టి ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’(Miss Shetty Mr Polishetty). కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు. పరుచూరి పాఠాల్లో (Paruchuri Paatalu) భాగంగా ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇందులో కామెడీ కంటే ఎక్కువ భావోద్వేగం ఉందన్నారు.

‘‘పెళ్లి చేసుకోకుండా, భర్త లేకుండా పిల్లల్నికని వాళ్లతో ఉండాలనే కథతో ఈ ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాను తెరెక్కించారు. సినిమా ప్రపంచం ఎంత మోడ్రన్ అయిందో చెప్పడానికి ఈ చిత్రాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. తనకంటే పెద్దదైన అమ్మాయితో హీరో ప్రేమలో పడతాడేమోనని ఇంట్లో వాళ్లంతా భయపడుతుంటారు. అయితే ఆ పాత్రలను పాత్రలుగా మాత్రమే చూడగలిగే పరిస్థితిని ఇవాళ మోడ్రన్ డైరెక్టర్లు కలిగిస్తున్నారు. హీరోయిన్ వంటలు చేసే పాత్రగా చూపించారంటే అది చాలా పెద్ద సాహసం. అద్భుతంగా వంటలు చేసే అమ్మాయి కథే ఈ ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’’.

‘‘ఒక తల్లి తన బిడ్డను ‘నాకు నువ్వు ఉన్నావమ్మా నీకెవ్వరున్నారు? అని అడుగుతుంది. అది చాలా మంచి ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు ఆలోచన కలిగిస్తాయి. ఐయూఐ విధానంలో ఓ బిడ్డకు జన్మనివ్వాలనుకోవడంలోనూ హీరోయిన్‌ ఎంతో ఆలోచిస్తుంది. మంచి వ్యక్తి ద్వారానే బిడ్డను కనాలనుకుంటుంది. అలాంటి సమయంలోనే స్టాండప్‌ కమెడియన్‌గా పనిచేసే హీరో ఈ అమ్మాయి జీవితంలోకి వస్తాడు. అయితే హీరోయిన్‌ పెట్టే కండీషన్‌కు హీరో అంగీకరిస్తాడా? లేదా? అనే ఆలోచన ప్రేక్షకులకు కలిగిస్తారు. అలా ప్రేక్షకుల మెదడుకు పనిపెట్టగలిగితేనే ఆ రచయిత, దర్శకుడు గొప్పవాళ్లు అవుతారు’’.

దీని కోసమే మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.. పాయల్ భావోద్వేగం

‘‘ఇక సెకండాఫ్‌లో మెలోడ్రామా కొంచెం ఎక్కువైందని నాకు అనిపించింది. హీరోయిన్ బిడ్డను కనే సమయంలో సీన్స్‌ను కొంచెం ఎడిట్‌ చేయగలిగి ఉంటే ఇంకా బాగుండేది. వసూళ్లలో లాభాల కంటే ఈ చిత్రం భారతీయతకు గొప్ప లాభాన్నిచ్చింది. తెలుగుదనాన్ని చూపింది. ఇలా ఎవరోఒకరితో ఐయూఐ విధానంలో బిడ్డను కనేసి జీవితం కొనసాగిస్తామంటే అది కుదరదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమానుబంధాలు ఉంటాయి అనే గొప్ప మెసేజ్‌ను ఈ సినిమా ద్వారా దర్శకనిర్మాతలు ప్రేక్షకులకు చెప్పాలనుకున్నారు. ఈ పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పడంలో విజయం సాధించారు’’.

‘‘ప్రేమించిన వాళ్ల కోసం త్యాగాలు చేస్తారనే మాట నిజమైతే ఈ సినిమాలో హీరో చేసింది కూడా త్యాగమే అవుతుంది. సినిమా నిడివి కాస్త తగ్గించుకొని ఉంటే ఇంకా మంచి వసూళ్లు వచ్చేవి. సెకండాఫ్‌లో కూడా కామెడీకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యతనిస్తే.. బాగుండేది. ఇక ఇలాంటి కథలకు క్లైమాక్స్‌ రాయడం చాలా కష్టం. కానీ, ఈ సినిమా క్లైమాక్స్‌ మాత్రం అద్భుతంగా ఉంది’’ అంటూ పరుచూరి గోపాలకృష్ట  చిత్రబృందాన్ని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని