Prabhas: రామ్‌ చరణ్‌తో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్‌

‘కల్కి 2898 ఏడీ’ సినిమా గ్లింప్స్‌ విడుదల సందర్భంగా ప్రభాస్‌ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆ మాటలు వైరలవుతున్నాయి.

Published : 21 Jul 2023 11:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రభాస్‌ (Prabhas) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా గ్లింప్స్‌ విడుదలై ట్రెండింగ్‌లోకి వచ్చింది.  ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ ఈవెంట్లో (Comic-Con) చిత్రబృందం పాల్గొని సినిమా టైటిల్, గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ అంతా అక్కడి మీడియాతో మాట్లాడింది. అందులో ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

‘బాహుబలి, ఆదిపురుష్‌, సాహో, సలార్‌, ఇప్పుడు కల్కి 2898 ఏడీ.. ఇలా భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో బ్లూ స్క్రీన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి కదా.. మీకు వాటిని చూసి బోర్‌ కొట్టడంలేదా?’ అనే ప్రశ్నకు ప్రభాస్‌ సరదాగా సమాధానం చెప్పారు. ‘మొదట్లో నాకు చాలా బోర్‌ కొట్టింది. అంత పెద్ద బ్లూ స్క్రీన్‌ ముందు నేను చాలా చిన్నగా కనిపించేవాడిని. కానీ, గ్లింప్స్‌ చూశాక ఆనందం వేసింది. బాగుందనిపించింది’ అని చెప్పారు.

‘పుష్ప 2’ డైలాగ్‌ లీక్‌ చేసిన అల్లు అర్జున్‌.. వీడియో వైరల్‌

అలాగే రాజమౌళి, రామ్ చరణ్‌ల గురించి ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చాలా గొప్ప సినిమా. ఆ సినిమాలోని పాటకు ఆస్కార్‌ రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అది భారతదేశ ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించాం. అలాగే రాజమౌళి ఇలాంటి వాటికి అర్హుడు. ఇక రామ్‌చరణ్‌ నాకు మంచి స్నేహితుడు. ఏదో ఒక రోజు మేమిద్దరం కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం’’ అని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్‌, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో సినిమా వస్తే అది బిగ్‌ మల్టీస్టారర్‌ అవుతుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ‘కల్కి 2898 ఏడీ’సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కోలీవుడ్‌ అగ్ర నటుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) భాగం కావడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని