Ram Charan: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్‌.. లీగ్‌ క్రికెట్‌లోకి రామ్‌చరణ్‌..!

క్రీడా రంగంలో నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) మరో ముందడుగు వేశారు.  ఐఎస్‌పీఎల్‌లో హైదరాబాద్‌ టీమ్‌ను ఆయన కొనుగోలు చేశారు.

Updated : 24 Dec 2023 13:33 IST

హైదరాబాద్‌: క్రీడా రంగంలోనూ తన మార్క్‌ చూపించేందుకు సిద్ధమయ్యారు నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan). ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌లో హైదరాబాద్‌ జట్టును ఆయన తాజాగా కొనుగోలు చేశారు. ఆదివారం ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్‌ టీమ్‌కు యజమానిగా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతిభ, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం, గల్లీ క్రికెట్‌ సంస్కృతిని సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం ఈ వెంచర్‌ను మొదలుపెట్టా’’ అని తెలిపారు. ఈ టీమ్‌లో భాగం కావాలనుకున్న క్రీడాకారుల కోసం ఓ లింక్‌ను షేర్‌ చేసిన ఆయన.. ఆసక్తి ఉన్న వాళ్లు రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు. వర్ధమాన క్రికెట్‌ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఈ టోర్నమెంట్‌ ఉపయోగపడుతుందని భారత మాజీ సెలెక్టర్‌, ఐఎస్పీఎల్‌ సెలక్షన్‌ కమిటీ హెడ్‌ జతిన్‌ పరాంజపే గతంలో తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు చెప్పారు. ముంబయి జట్టుకు అమితాబ్‌ బచ్చన్‌, బెంగళూరు టీమ్‌కు హృతిక్‌ రోషన్‌, జమ్మూ-కశ్మీర్‌ టీమ్‌కు అక్షయ్‌ కుమార్‌ యజమానులుగా వ్యవహరిస్తున్నారు.

Sriya Reddy: పవన్‌కల్యాణ్‌ గురించి ఆ విషయం నాకు తెలియదు: శ్రియారెడ్డి

సినిమాల విషయానికి వస్తే.. రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తున్నారు. కార్తిక్‌ సుబ్బరాజ్‌ అందించిన కథతో శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ కథా చిత్రంగా ఇది సిద్ధమవుతోంది. రామ్‌చరణ్‌ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత దిల్‌రాజు ఇటీవల తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని