Rashmika: అందులో రష్మిక పేరు లేకపోవడంతో షాకయ్యా: సందీప్ వంగా

‘యానిమల్‌’లో రష్మిక అద్భుతంగా నటించిందని సందీప్ వంగా మరోసారి ప్రశంసించారు.

Updated : 07 Feb 2024 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూపర్‌ హిట్‌ చిత్రం ‘యానిమల్‌’లో గీతాంజలిగా రష్మిక తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాల్లో తన నటన అద్భుతంగా ఉందంటూ విమర్శకులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. అయితే, తాజాగా జరిగిన ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డుల్లో ఉత్తమ నటి కేటగిరీలో రష్మికకు నామినేషన్‌ దక్కకపోవడంపై దర్శకుడు సందీప్ వంగా (Sandeep Reddy Vanga) స్పందించారు. ఈ విషయంలో తాను షాక్‌కు గురైనట్లు చెప్పారు.

‘‘యానిమల్‌’లో గీతాంజలి పాత్రలో నటించడం అంత సులభమేం కాదు. ఒక్క సన్నివేశంలోనే చాలా హావభావాలు పలికించాలి. నవ్వడం, అరవడం, పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం.. ఇలాంటివన్నీ ఒకే సన్నివేశంలో చేయాలి. 11 నిమిషాలున్న ఆ సీన్‌లో రష్మిక అద్భుతంగా నటించింది. నాకు అవార్డుల మీద నమ్మకం లేదు. ‘ఫిల్మ్‌ఫేర్‌’లో ‘యానిమల్‌’ 19 కేటగిరీల్లో నామినేషన్లు దక్కించుకుంది. చిత్రబృందమంతా ఆ వేడుకకు హాజరైంది. దర్శకుడిగా నేను వెళ్లకపోవడం భావ్యం కాదు కాబట్టి హాజరయ్యాను’ అని చెప్పారు. 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ (69th FilmFare Awards) అవార్డుల్లో ‘యానిమల్‌’ ఏకంగా ఆరు కేటగిరీల్లో సత్తా చాటింది. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) అవార్డును అందుకున్నారు.

సందీప్ వంగా - రణ్‌బీర్‌ కపూర్‌ల కాంబోలో వచ్చిన ‘యానిమల్‌’ గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకువచ్చి భారీ విజయాన్ని అందుకుంది. రూ.900 కోట్లు వసూళ్లు సాధించింది. త్వరలోనే దీనికి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ తెరకెక్కనుంది.  గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ఈ సీక్వెల్‌ లక్ష్యమని సందీప్ ఓ సందర్భంలో అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని