Dhanush: బలవంతంగా నటుడై.. హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి: ధనుష్‌ బర్త్‌డే స్పెషల్‌

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం..

Updated : 28 Jul 2023 09:59 IST

‘సినిమా బాగోలేదుగానీ హీరోహీరోయిన్ల నటన అద్భుతం’ అనే మాట తరచూ వినిపిస్తుంటుంది. ‘సినిమా సూపర్‌ హిట్‌. హీరోనే ఫ్లాప్‌’ అనే అభిప్రాయం అరుదుగా వ్యక్తమవుతుంది. ఈ రెండో కేటగిరీకే చెందుతాడు ధనుష్‌ (Dhanush). లుక్‌ చూసి ‘ఇలా ఉన్నాడేంటి’ అని ప్రేక్షకుల నుంచి ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న అతడిప్పుడు హాలీవుడ్‌కూ సుపరిచితుడయ్యాడు. నేడు అతడి పుట్టినరోజు (40) సందర్భంగా ఆ ప్రయాణాన్ని చూద్దాం (Happy Birthday Dhanush)..

తండ్రి కోసం నటుడయ్యాడు..

చెఫ్‌ కావాలనేది ధనుష్‌ లక్ష్యం. కానీ, తండ్రి కస్తూరి రాజా (Kasthuri Raja) మాటను కాదనలేక నటుడిగా మారాడు. నటనపై ఆసక్తేలేదని చెప్పినా రాజా వినకుండా కొడుకుని హీరోని చేశారు. ‘తుల్లువదో ఇలమై’ (Thulluvadho Ilamai) సినిమా తెరకెక్కించారు. 2002 మే 10న విడుదలైందా చిత్రం. మార్నింగ్‌ షో నుంచే హిట్‌టాక్‌ వినిపించింది. ప్రేక్షకులు కథకు ఎంతగా కనెక్ట్‌ అయ్యారో కథానాయకుడి నటనకు అంతగా డిస్‌కనెక్ట్‌ అయ్యారు! ‘హీరో ఆకర్షణీయంగా లేడు. నటనా అంతంత మాత్రమే’ అని విమర్శలు గుప్పించారు. దీన్నొక కారణంగా చూపించి, నటనకు గుడ్‌బై చెప్పి తన డ్రీమ్ నెరవేర్చుకోవాలని ధనుష్‌ అనుకోలేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి పొందాలనుకునే ఆలోచనతో ముందుకు కదిలాడు.

అన్నయ్య చేతిలో దెబ్బలు తిన్నాడు!

తొలి ప్రయత్నంలో చేసిన తప్పులను గ్రహించిన ధనుష్‌ రెండో సినిమా ‘కాదల్‌ కొండెయిన్‌’ విషయంలో అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాడు. తన అన్నయ్య సెల్వ రాఘవన్‌ (Selvaraghavan) దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని నటన కోలీవుడ్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఆ ఫలితం వెనుక చాలా కష్టం దాగుంది. ధనుష్‌ నుంచి మంచి నటనను రాబట్టుకునేందుకు రాఘవన్‌ కొన్ని సందర్భాల్లో కొట్టారట. ‘అన్నయ్య ఆరోజు అలా చేయడం వల్లే ఈ రోజు నా నటనకు అభిమానులున్నారు’ అని అంటుంటాడు ధనుష్‌.

వైవిధ్యానికి చిరునామా.. 

తొలి రెండు సినిమాలతోనే ధనుష్‌ ఎంతో అనుభవం గడించాడు. వైవిధ్యానికే పెద్దపీట వేస్తూ వస్తున్నాడు. పాత్రకు తగ్గట్టు మలుచుకోవడం ఆయన ప్రత్యేకత. వయసుకు మించిన క్యారెక్టర్లలో ఇమిడిపోగలడు.. చిన్న వయసు రోల్స్‌లోనూ ఒదిగిపోగలడు. లవ్‌, కామెడీ, యాక్షన్‌.. ఇలా నేపథ్యం ఏదైనా తన మార్క్ చూపిస్తాడు.

కోలీవుడ్‌ టు హాలీవుడ్‌..

‘రాంజనా’ (Raanjhanaa)తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ధనుష్‌ ఆ తర్వాత నటించిన ‘షమితాబ్‌’తో ప్రశంసలు అందుకున్నాడు. ‘అత్రంగీరే’తో సందడి చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘తేరే ఇష్క్‌ మే’ సినిమా చేస్తున్నాడు. ధనుష్‌ నటనను హాలీవుడ్‌ కూడా గుర్తించింది. అలా ఆయన నటించిన తొలి ఆంగ్ల చిత్రం ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’. రెండో సినిమా ‘ది గ్రే మ్యాన్‌’ గతేడాది విడుదలైంది. హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువమంది ఇండియన్‌ యాక్టర్స్‌లో ధనుష్‌ ఒకడు. పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు వారికి పరిచయమైన ధనుష్‌ ‘రఘువరన్‌ బీటెక్‌’ చిత్రంతో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నాడు. తెలుగు దర్శకుడితో ఆయన చేసిన తొలి సినిమా ‘సార్‌’ (SIR) ఈ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకుంది. ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller)తో ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నాడు.

ఖలేజా టైటిల్‌.. అత్యాశకు పోయి రూ.10లక్షలు పోగొట్టుకున్నారు!

ఇది చాలా స్పెషల్‌..

తండ్రి, సోదరుడు, మాజీ భార్య (ఐశ్వర్య రజనీకాంత్‌), ఆమె సోదరి దర్శకత్వంలో ధనుష్‌ నటించాడు. ఒకే కుటుంబంలో ఇంతమంది దర్శకులు ఉండటం ఒక విశేషమైతే అందరితోనూ పనిచేయడం మరో విశేషం.

ఆరు నిమిషాల్లో పాట రాసి.. సంచనలం సృష్టించి

ధనుష్‌లో దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయిత, కథా రచయిత కూడా ఉన్నారు. తాను నటించిన ‘3’ సినిమా కోసం ఆయన రాసి, ఆలపించిన ‘వై దిస్‌ కొలవెరి’ పాట సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ దాటిన ఇండియన్‌ ఫస్ట్‌ మ్యూజిక్‌ వీడియోగా నిలిచింది. ప్రస్తుతం ఆ సంఖ్య 409 మిలియన్‌కి చేరింది. ఆ సాంగ్‌ను ధనుష్‌ ఆరు నిమిషాల్లో రాయడం గ్రేట్‌. 

ఆ బాధ ఇప్పటికీ ఉంది

‘‘మమ్మల్ని చదివించేందుకు మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో.. నా పిల్లలను చదివిస్తుంటే అర్థమవుతోంది. చదువుకోవాల్సిన సమయంలో నేను అల్లరి పనులు చేసేవాణ్ని. చదువు కోసం కాకుండా ఓ అమ్మాయి కోసం ట్యూషన్‌లో చేరా. ట్యూషన్‌ టీచర్‌ ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పలేకపోయేవాణ్ని. కొన్ని రోజులకు నాపై నాకే సిగ్గేసి ట్యూషన్‌ మానేశా. స్నేహితురాలిని కలుసుకునేందుకు బయట వేచి చూసేవాణ్ని. నేను వచ్చినట్టు ఆమెకు తెలియాలని బైక్‌తో సౌండ్‌ చేసేవాణ్ని. దాంతో, టీచర్‌ నాపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘మీరంతా బాగా చదువుకుని, పరీక్షలు పాసై ఉన్నత స్థానంలో ఉంటారు. బయట వాహనంతో గోల చేసేవాడు వీధుల్లో డ్యాన్స్‌ చేసుకోవాల్సిందే’’ అని అక్కడున్న వారితో అన్నారట. ఆయన చెప్పినట్టు తమిళనాడులో నేను డ్యాన్స్‌ చేయని వీధి అంటూ ఏదీ లేదు (నవ్వుతూ..). వెనక్కి తిరిగి చూస్తే.. నేనెందుకు తరగతులకు హాజరుకాలేదు? అని ఇప్పటికీ చింతిస్తున్నా’’ అని ధనుష్‌ ఓ సందర్భంలో చెప్పాడు.

‘శివ’లో ఆ పాత్ర కోసం మోహన్‌బాబు.. వద్దంటే వద్దన్న వర్మ!

మరికొన్ని సంగతులు..

  • ధనుష్‌ అసలు పేరు వెంకటేశ్‌ ప్రభు కస్తూరి రాజా.
  • ఆయన శివుడుని ఆరాధిస్తాడు. ఈ మేరకు తన కొడుకులకు యాత్ర, లింగ అని పేర్లు పెట్టాడు.
  • పనే దైవం.. అందం కాదు ప్రతిభ ముఖ్యం అనేదాన్ని బాగా నమ్ముతాడు.
  • ఉత్తమ నటుడిగా రెండు (ఆడుకాలమ్‌, అసురన్‌) జాతీయ అవార్డులుసహా ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు.
  • అత్యధిక పారితోషికం అందుకుని, ఫోర్బ్స్‌ ఇండియా ‘సెలబ్రిటీ 100’ లిస్ట్‌లో ఆరు సార్లు చోటు సంపాదించుకున్నాడు.
  • 2011లో ‘పెటా’ ప్రకటించిన ‘హాటెస్ట్‌ వెజెటేరియన్‌ సెలబ్రిటీ’ టైటిల్‌ గెలుచుకున్నాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని