Tamannaah: అటు రజనీ.. ఇటు చిరు.. తమన్నా జోరు..

తమన్నా (Tamannaah) నటించిన రెండు చిత్రాలు ఒక్కరోజు తేడాతో విడుదల కానున్నాయి. ఆగస్టు 10న ‘జైలర్‌’, 11న ‘భోళా శంకర్‌’ ప్రక్షకుల ముందుకు రానున్నాయి.

Updated : 08 Aug 2023 10:35 IST

వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో అలరిస్తోంది తమన్నా (Tamannaah). నటనతోనే కాదు.. డ్యాన్స్‌తోనూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇటీవలే రెండు వెబ్‌సీరిస్‌లలో కనిపించి ఎలాంటి పాత్రలనైనా చేయగలనని మరోసారి నిరూపించింది. ఇప్పుడు బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో స్టార్ హీరోల సినిమాల్లో కనిపించడానికి సిద్ధమైంది. చిరంజీవి, రజనీకాంత్‌లతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకొని.. ఒక్కరోజు తేడాతో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో తమన్నా ఎలా కనిపించనుందో ఓ సారి చూద్దాం.. 

రజనీకాంత్‌ ‘జైలర్‌’లో అలా..

నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dilipkumar) దర్శకత్వంలో రజనీకాంత్‌ (Rajinikanth) నటిస్తోన్న చిత్రం ‘జైలర్‌’ (Jailer). మామూలుగానే రజనీకాంత్‌ సినిమా వస్తుందంటేనే సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ‘జైలర్‌’ ట్రైలర్‌తోనే ఆసక్తి కలిగించి అంచనాలు పెరిగేలా చేసింది. ఇందులోని ‘కావాలయ్యా..’ పాట ఇప్పటికే రికార్డులు సృష్టించింది. తమన్నా తన డ్యాన్స్‌తో ఊర్రూతలూగించిన ఈ సాంగ్.. విడుదలైన నాటి నుంచే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ‘జైలర్‌’లో ఆమె పాత్ర గురించి చూడడం కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్లో తమన్నా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేస్తూ  ‘తమన్నా ఎక్కడ?..’ అని పోస్ట్‌లు కూడా పెట్టారు. అయితే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం ఇప్పటి వరకు రివీల్‌ చేయలేదు. దీంతో ‘జైలర్‌’లో తమన్నా ఎలా ఉండనుందోనని ఆమె అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది.

చిరంజీవితో ‘భోళా శంకర్‌’లో ఇలా..

చిరంజీవి (Chiranjeevi) హీరోగా మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh) రూపొందించిన చిత్రం ‘భోళా శంకర్’ (Bhola Shankar). ఇందులో చిరంజీవి సరసన తమన్నా ఆడిపాడనుంది. లాయర్‌ లాస్యగా కనిపించనుంది. ఇక తమన్నాను ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అదే పేరుతో ఓ పాటరాయడం విశేషం. ఇటీవల విడుదలైన ఆ పాటలో తమన్నా, చిరు ఇద్దరూ వారి స్టెపులతో అదరగొట్టారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన తమన్నా..  చిరంజీవితో కలిసి రెండో సారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపింది. ‘‘సైరా’లో చిరంజీవితో కలిసి నటించాను. కానీ, అప్పుడు ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేసే అవకాశం రాలేదు. ‘భోళా శంకర్‌’లో మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. ఆయన గొప్ప డ్యాన్సర్‌. ‘మిల్కీ బ్యూటీ’ పాటలో ఆయనతో కలిసి డ్యాన్స్‌వేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమా మంచి అనుభవాన్నిచ్చింది’’ అని పేర్కొంది. తమిళంలో ‘వేదాళం’ రీమేక్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విమర్శకులకు తనశైలిలో సమాధానం..

ఇక ఈ ఇద్దరి హీరోలకు, తమన్నాకు మధ్య వయసు వ్యత్యాసం చాలా ఉందని కొందరు ఆమెను విమర్శించారు. అలాంటి వారికి తమన్నా తనశైలిలో సమాధానం చెప్పింది. ఈ చిత్రాల ప్రచారంలో భాగంగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ‘మీ కంటే వయసులో చాలాపెద్దవారి సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారెందుకు?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం చెప్పిన తమన్నా.. సినిమాల్లో నటీనటుల మధ్య వయసు వ్యత్యాసాన్ని ఎందుకు చూస్తున్నారంటూ ప్రశ్నించింది. అందులో నటించే రెండు పాత్రలను మాత్రమే చూడాలని సూచించింది. తాను 60 ఏళ్ల వయసులోనూ టామ్‌ క్రూజ్‌లా విన్యాసాలు చేస్తానని చెప్పింది. అప్పుడు కూడా డ్యాన్స్‌ చేయాలనుందని తెలిపింది. చిరంజీవి, రజనీకాంత్‌ లాంటి గొప్ప నటులతో పనిచేయడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొంది.

బాధను దాచుకుని నటించి..

‘భోళా శంకర్‌’ ప్రమోషన్‌లో తమన్నా గురించి చిరంజీవి చెప్పిన ఓ విషయంతో సినీప్రియులకు ఆమెపై గౌరవం పెరిగింది. తమన్నాకు సినిమాలంటే ఎంత ఇష్టమో చిరంజీవి చెప్పారు. ‘మిల్కీ బ్యూటీ’ పాట సమయంలో తమన్నా వాళ్ల నాన్నకు పెద్ద సర్జరీ జరిగిందని ఆ సమయంలోనూ చిత్రీకరణలో పాల్గొందని తెలిపారు. షాట్‌ మధ్యలో కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పేదన్నారు. తనకు ఎంత బాధ ఉన్నా దానిని దాచుకుని కెమెరా ముందుకు రాగానే డ్యాన్స్‌లో లీనమయ్యేదని.. తమన్నాను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని చిరంజీవి మెచ్చుకున్నారు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు కూడా తమన్నాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నాకెరీర్‌లో ఇదో మర్చిపోలేని మలుపు: తమన్నా

ఇక ఈ రెండు సినిమాల గురించి తమన్నా మాట్లాడుతూ సంతోషంగా ఉందని తెలిపింది. ఇవి రెండు ఒకేసారి విడుదలవుతున్నాయని ఓ కథానాయికగా ఇంతకంటే తానేం కోరుకోవడం లేదని చెప్పింది. ఇదో కలలా ఉందని.. తన కెరీర్‌లో ఇది మర్చిపోలేని మలుపని ఆనందం వ్యక్తం చేసింది. ఈ రెండూ తనకు ఎప్పటికీ ప్రత్యేకమైనవేనని తమన్నా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు