Published : 31 Dec 2021 01:34 IST

Year Ender 2021: సస్పెన్స్‌కి తెర దించారు.. షాక్‌కు గురి చేశారు..!

ఇంటర్నెట్‌డెస్క్‌‌: సమంత-నాగచైతన్య, అమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు.. ఇలా స్టార్‌ సెలబ్రిటీలు ఈ ఏడాది షాకింగ్‌ నిర్ణయాలతో వార్తల్లోకెక్కారు. కొన్ని సంవత్సరాల నాటి తమ ప్రేమ బంధానికి ఈ ఏడాది స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి అభిమానులను ఆవేదనకు గురి చేశారు. ఇలా బ్రేకప్‌ చెప్పుకున్న తారలు ఎవరంటే..

సమంత-నాగచైతన్య..!

‘ఏమాయ చేసావె’ చిత్రంలో నాగచైతన్య-సమంతల జోడీ ప్రేక్షకుల మది దోచేసింది. ఈ సినిమాతో పరిచయమైన ఈ జంట.. ‘మనం’ ‘ఆటోనగర్‌ సూర్య’లతో ప్రేమికులయ్యారు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ పెద్దల అంగీకారంతో 2017లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వివాహం అనంతరం వీరిద్దరూ కలిసి ‘మజిలీ’తో అలరించారు. ఇదిలా ఉండగా నాలుగేళ్ల తమ వైవాహిక బంధానికి, సుమారు 11 ఏళ్ల ప్రేమకు స్వస్తి చెబుతూ.. అక్టోబర్‌ 2న విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ఈ జంట చెప్పినప్పటికీ అభిమానులు మాత్రం ఆ విషయాన్ని  జీర్ణించుకోలేకపోయారు. అయితే, సామ్‌-చై అధికారికంగా ప్రకటించడానికి కొన్ని నెలల ముందు నుంచే వీరి విడాకులపై టాలీవుడ్‌లో విపరీతమైన చర్చ జరిగింది. ఈ క్రమంలో సస్పెన్స్‌కి తెర దించుతూ.. విడిపోతున్నట్లు ప్రకటించి ఈ జంట షాక్‌కు గురిచేసింది.

ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు

బాలీవుడ్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా చెప్పుకొనే ఆమిర్‌ఖాన్‌ ఈ ఏడాది తన అభిమానుల్ని ఆందోళనకు గురి చేశారు. కిరణ్‌రావుతో 15 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిందని ప్రకటించారు. ‘లగాన్‌’తో పరిచయమైన ఈ ఇద్దరూ కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉండి.. 2005లో పెళ్లి చేసుకొన్నారు. ప్రేమ వల్లే ఒక్కటయ్యామని.. అదే ప్రేమతో విడిపోయి స్నేహితులుగా ఉంటామంటూ జులైలో ఈ జంట చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు, ఆమిర్‌ఖాన్‌ మొదటి భార్య రీనాదత్తాతో కూడా వివాహమైన 15 ఏళ్ల తర్వాతనే విడిపోవడంతో తాజా విడాకులు చర్చనీయాంశంగా మారాయి.

మెహరీన్‌-భవ్య బిష్ణోయ్‌

తెలుగు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న నటి మెహరీన్‌ ఈ ఏడాది వ్యక్తిగత జీవితంలో గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనువడు భవ్య బిష్ణోయ్‌తో జరిగిన నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకూ భవ్య తనకెంతో నచ్చేశాడని.. అతనితో ప్రేమలో ఉన్నానని చెప్పిన మెహరీన్‌ హఠాత్తుగా విడిపోతున్నట్లు చెప్పింది. భవ్య కుటుంబంతో ఇకపై తనకు ఎటువంటి సంబంధంలేదని చెబుతూ అప్పటి వరకూ షేర్‌ చేసిన నిశ్చితార్థం ఫొటోలను సోషల్‌మీడియా నుంచి తొలగించింది.

సుస్మితాసేన్‌-రోహ్మన్‌షాల్‌

మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌ ఆమె ప్రియుడు రోహ్మన్‌ బ్రేకప్‌ చెప్పుకున్నారు. సోషల్‌మీడియా వేదికగా పరిచయమైన ఈ జంట చాలా సంవత్సరాల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. దీంతో వీళ్లిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని అభిమానులు ఎదురుచూస్తోన్న తరుణంలో.. ‘మా ప్రయాణాన్ని స్నేహంతో ప్రారంభించాం. ఇక ముందు కూడా స్నేహితులుగానే ఉంటాం. మా ఇద్దరి మధ్య అనుబంధం ముగిసింది. కానీ, ప్రేమ అలాగే ఉంది’ అని సుస్మిత ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు.

Read latest Cinema News and Telugu News

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts