The Great Indian Suicide Review: రివ్యూ: ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌.. చనిపోయిన వ్యక్తిని బతికించడానికి 8 మంది ఆత్మహత్య!

The Great Indian Suicide Review: తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ ఎలా ఉందంటే?

Updated : 06 Oct 2023 14:38 IST

The Great Indian Suicide Review | చిత్రం: ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌ (తెలిసినవాళ్లు); నటీనటులు: రామ్‌ కార్తిక్‌, హెబ్బా పటేల్‌, నరేష్‌ వీకే, పవిత్ర లోకేష్‌, జయప్రకాష్‌, రత్నశేఖర్‌రెడ్డి, డెబోరా డొర్సిస్ఫెల్‌, తేజారెడ్డి, లక్ష్మీ నారాయణ, సాయికుమార్‌ బబ్లూ, అర్మాన్‌, మాస్టర్‌ రోహన్‌ తదితరులు; ఆర్ట్‌: ఉపేందర్‌రెడ్డి; సంగీతం: శ్రీచరణ్‌ పాకాల; సినిమాటోగ్రఫీ: అజయ్‌ వి.నాగ్‌, అనంత్‌ వి.నాగ్‌; ఎడిటింగ్‌: ధరేంద్ర కాకరాల; రచన, నిర్మాత, దర్శకత్వం: విప్లవ్‌ కోనేటి; స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా

వైజ్ఞానికంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఇప్పటికీ చాలా మంది మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలను అనుసరిస్తూ తమ ప్రాణాలతో పాటు, కుటుంబ సభ్యుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వారు సైతం వాటిని అనుసరించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిత్యం ఏదో ఒక మూలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో రూపొందిన తాజా మిస్టరీ థ్రిల్లర్‌ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’. మదనపల్లిలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు విప్లవ్‌ కోనేటి ఈ మూవీని తీర్చిదిద్దారు.

కథేంటంటే: హర్ష (రామ్‌ కార్తీక్‌) అనాథ. స్వశక్తితో ఎదిగి స్నేహితుడితో కలిసి కాఫీ షాపు నడుపుతూ ఉంటాడు. తన సిస్టర్‌తో కలిసి ఇంట్లో తయారు చేసిన కుకీస్‌ అంటూ వాటిని అమ్మడానికి ఆ షాపునకు వస్తుంది చైత్ర (హెబ్బా పటేల్‌). తొలి పరిచయంలోనే ఆమె మాటలకు ఫిదా అయిపోతాడు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. హర్ష తన ప్రేమను వ్యక్తం చేయగానే చైత్ర అందుకు నో చెబుతుంది. దీంతో ఊరు విడిచి వెళ్లిపోవాలనుకుంటాడు. విషయం తెలిసిన చైత్ర షాపు దగ్గరకు వచ్చి, హర్షను ప్రేమిస్తున్నానని చెబుతుంది. కానీ, త్వరలోనే తనతో పాటు, తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోబోతోందని చెబుతుంది. (The Great Indian Suicide Review) కారు ప్రమాదంలో చనిపోయిన తన పెదనాన్న నీలకంఠ (నరేష్‌)ను తిరిగి బతికించుకునేందుకు ఇదొక మార్గమని చెప్పడంతో హర్ష ఆశ్చర్యపోతాడు. ఆ షాక్‌ నుంచి తేరుకుని తను ప్రేమించిన చైత్రను కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ ఆత్మహత్యను ఎవరు ప్రేరేపించారన్న విషయం తెలుసుకునేందుకు.. చైత్రను పెళ్లి చేసుకుని, ఆ ఇంటి సభ్యుడిగా వెళ్తాడు. ఇంతకీ చైత్ర కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణం ఏంటి? వారిని ఆ వైపు వెళ్లేలా ప్రోత్సహించింది ఎవరు? హర్షతో సహా చైత్ర కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే నీలకంఠం బతికి వచ్చాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఒక మనిషి తనని తాను చంపుకొంటే అది ఆత్మహత్య.. కొందరు కలిసి తమ ప్రాణాలను తాము తీసుకుంటే అది సామూహిక ఆత్మహత్య. అలా కొందరు కలిసి చావడానికి ఒక ఫిలాసఫీ ఉంటే, అది కల్ట్‌ సూసైడ్‌. చరిత్రలో ఇలాంటి ఘోరమైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాలిఫోర్నియా నుంచి దిల్లీ వరకూ ఇలాంటివి కోకొల్లలు. అంతెందుకు మన తెలుగు ప్రాంతమైన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఘటన అందరినీ కలిచి వేసింది.  ఘటన జరిగినప్పుడు హెడ్‌లైన్స్‌లో నిలిచే ఇలాంటి వార్తలు ఆ తర్వాత నెమ్మదిగా కనుమరుగైపోతాయి. ఇలాంటి ఆత్మహత్యల వెనుక కేవలం మూఢ నమ్మకాలే కాదు, ఇంకేదో మిస్టరీ దాగి ఉంటుంది. (The Great Indian Suicide Review)  అలాంటి నేపథ్యాన్ని తీసుకుని, ఆద్యంతం ఉత్కంఠగా ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ను తీర్చిదిద్దడంలో దర్శకుడు విప్లవ్‌ కోనేటి విజయం సాధించారు. యథార్థ సంఘటనలను తెరపై ఆవిష్కరించేటప్పుడు అందుకు సంబంధించిన కసరత్తు చేయాలి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలకు సంబంధించి ఏం జరిగిందో మూలాలకు వెళ్లి కనుక్కోవడం చాలా కష్టం. ఈ విషయంలో దర్శకుడు కొంత వరకూ మాత్రమే సమాచారం సేకరించగలిగారు. చనిపోయిన వారి కోసం ప్రాణ త్యాగం చేస్తే, తిరిగి వస్తారనే విషయాన్ని చెప్పడం కోసం ఫలానా ఉపనిషత్‌లలో అలా ఉంది.. మరొక దానిలో ఇలా ఉంది.. అంటూ పైపైనే చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో చనిపోయిన మనిషి తిరిగి వస్తాడని చెప్పడానికి బలమైన కారణం అంటూ కనిపించదు. 

కారు ప్రమాదం జరిగి నీలకంఠం చనిపోవడంతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు వెంటనే హర్ష, చైత్ర పాత్రలను పరిచయం చేసి, వాళ్ల మధ్య లవ్‌ ట్రాక్‌ నడిపే ప్రయత్నం చేశాడు. దీంతో అసలు కథ మొదలవడానికి కాస్త సమయం పడుతుంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య వచ్చే సన్నివేశాలు, మాంటేజ్‌ సాంగ్‌ ఇలా ఆరంభం కాస్త నెమ్మదిగా సాగుతుంది. తమ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటుందని ఎప్పుడైతే హర్షతో చైత్ర చెబుతుందో అప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది. (The Great Indian Suicide Review) ఎందుకు కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది? అది వాళ్ల నిర్ణయమేనా? లేదా ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? అనే విషయాలను తెలుసుకునేందుకు హర్ష చైత్ర ఇంటికి వెళ్లడం, అక్కడ నీలకంఠం కుటుంబ సభ్యుల పరిచయంతో కథ ఆసక్తిగా మారుతుంది. ఈ క్రమంలో ప్రతి పాత్రపైనా అనుమానం కలిగేలా ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురి చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. చనిపోయిన నీలకంఠం చెంబులోకి రావడం, అందరితో మాట్లాడటం తదితర సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. నీలకంఠం వచ్చి, నేరుగా హర్షనే ఆవహించినట్లు చూపించి విరామ సన్నివేశాలకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు.

ఇక్కడి నుంచి కథ మరో కొత్త మలుపు తిరుగుతుంది. పౌర్ణమి గడువు సమీపించే కొద్దీ చిక్కు ముడులుగా ఉన్న ఎన్నో ప్రశ్నలను హర్ష విప్పుతూ వెళ్తాడు. దీంతో ఇంటి సభ్యుల ఒక్కొక్కరి స్వరూపం బయటపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే హర్షకు అనేక విషయాలు తెలుస్తాయి. పౌర్ణమి రోజున అందరూ ఆత్మహత్య చేసుకున్న తర్వాత జరిగే పరిణామాలు ప్రేక్షకుడిని మరింత ఉత్కంఠకు గురిచేస్తాయి. అయితే, ‘కల్ట్‌ సూసైడ్‌’ వెనుక ఉన్నదెవరన్న విషయం మాత్రం ప్రేక్షకుడిని కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. (The Great Indian Suicide Review) అదేంటో తెరపైనే చూడాలి. సినిమా ప్రారంభం నుంచి మొదలైన ఎన్నో ప్రశ్నలకు చివరి 20 నిమిషాల్లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అవన్నీ కాస్త చకచకా చుట్టేశాయా? అనిపిస్తాయి. దీంతో పతాక సన్నివేశాలు కాస్త గందరగోళంగా ఉంటాయి. ‘కల్ట్‌ సూసైడ్‌’ అనే కాన్సెప్ట్‌ను తీసుకుని, సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు దాన్ని జత చేసి దర్శకుడు ప్రజెంట్‌ చేసిన విధానం బాగున్నా, ముగింపు రొటీన్‌గా అనిపిస్తుంది. క్లైమ్యాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను మాత్రం ఎవరూ ఊహించరు.

ఎవరెలా చేశారంటే:  హర్షగా రామ్‌ కార్తీక్‌, చైత్రగా హెబ్బా పటేల్‌ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. హెబ్బాది కాస్త డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న పాత్ర. అందుకు ఆమె న్యాయం చేసింది. నరేష్‌ వీకే, పవిత్ర లోకేష్‌, జయప్రకాష్‌, రత్నశేఖర్‌రెడ్డి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం చాలా చోట్ల సన్నివేశాలను హైలైట్‌ చేసింది. ముఖ్యంగా కల్ట్‌ సూసైడ్‌ గురించి చెప్పే సన్నివేశాలు, పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగుంది. అజయ్‌ వి.నాగ్‌, అనంత్‌ వి.నాగ్‌ సినిమాటోగ్రఫీ, లైటింగ్‌ ఎఫెక్ట్‌ బాగున్నాయి.  ధరేంద్ర ఎడిటింగ్‌ ఓకే. (The Great Indian Suicide Review) రచయిత, దర్శకుడు విప్లవ్‌ కోనేటి చెప్పాలనుకున్న అసలు పాయింట్‌ కాస్త రొటీన్‌ అయినా, దానికి ‘కల్ట్‌ సూసైడ్‌’ అనే కాన్సెప్ట్‌ జోడించి, ఆసక్తికరంగా సినిమాను తీర్చిదిద్దడంలో సక్సెస్‌ అయ్యారు. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’లో ఈ కథకు  ‘తెలిసినవాళ్లు’ టైటిల్‌ పెట్టారు. బహుశా మరికొన్ని కొత్త కథలతో, కొత్త మిస్టరీలతో ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ సిరీస్‌ కొనసాగే అవకాశం ఉంది.

కుటుంబంతో కలిసి చూడొచ్చా?: ఓకే చూడొచ్చు. కానీ, ఒకట్రెండు హాట్‌సీన్స్‌, ‘ఎఫ్‌’ వర్డ్‌ పదాలు ఉన్నాయి. ఓటీటీ కావడంతో సెన్సార్‌ చేసే అవకాశం లేదు. అక్కడ ఫార్వర్డ్‌ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. హింస, రక్తపాతం వంటివి ఏమీ లేవు. ఈ వీకెండ్‌లో ఏదైనా మిస్టరీ థ్రిల్లర్‌ చూడాలనుకుంటే ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ మంచి ఆప్షన్‌. ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

  • బలాలు
  • + కథా నేపథ్యం
  • + స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
  • + నటీనటులు
  • బలహీనతలు
  • - నెమ్మదిగా ఆరంభ సన్నివేశాలు
  • చివరిగా: థ్రిల్‌ను పంచే ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ (The Great Indian Suicide Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని