ANR: ఏఎన్నార్‌ ఒక నట విశ్వ విద్యాలయం.. తెలుగు ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారు : వెంకయ్యనాయుడు

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

Updated : 20 Sep 2023 11:51 IST

హైదరాబాద్‌: అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao) శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు (venkaiah naidu) గుర్తుచేసుకున్నారు.

‘‘నాకు నాగేశ్వరరావు అంటే చాలా అభిమానం. ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోంది. ఆయనే నిల్చున్నారా అనేలా ఉంది. ఏఎన్నార్‌ మహానటుడు. అలాగే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహా మనిషి. నేను, ఆయన అనేక విషయాలపై మాట్లాడుకునే వాళ్లం. ఆయన జీవితమంతా నటిస్తూనే ఉన్నారు. ఆఖరి రోజు వరకూ నటించిన నటుడు నాకు తెలిసి మరొకరు లేరు. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావు. ఆయన చూపిన మార్గంలో ప్రయాణించడం ఆయనకు మనమిచ్చే నివాళి. ఆయన భాష, వేషం, వ్యక్తిత్వం వీటిలో కొంతైనా మనం అందిపుచ్చుకోవాలి. ఇక వాళ్ల కుటుంబమంతా తెలుగులో మాట్లాడడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు కనుమరుగవుతుందేమోనని భయం పుడుతుంది. పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. తెలుగంటే ఏఎన్నార్‌కు చాలా అభిమానం. భాషపోతే శ్వాస పోతుంది. శ్వాస పోతే అంతా పోతుంది. అందుకే మన భాషను ఎప్పటికీ మర్చిపోకూడదు. అందరూ తెలుగులో మాట్లాడుకోవాలి’’. 

తెలుగు సినిమా బతికినంత వరకు ప్రేక్షకుల మనసుల్లో ఆయన ఉంటారు: చిరంజీవి

‘‘తెలుగు సినీరంగానికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రెండు కళ్లు. నాగేశ్వరరావు తన జీవితానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునే వారు. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగిపోయేవారు. ఆయన ఒక నట విశ్వ విద్యాలయం. తెలుగు ప్రజల హృదయాల్లో జీవించే ఉంటారు. ఆయన జీవితాన్ని చదివారు. జీవితంతో ఆయన పోరాటం చేశారు. దాన్ని ప్రేమించారు. ఆస్వాదించారు. జీవితంలో తాను నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టి చూపించారు. దీన్ని మనం అలవాటు చేసుకుంటే అదే ఆయనకు మనం ఇచ్చే నివాళి. ఆయనెప్పుడూ పోరాడి ఓడిపోలేదు. ఆత్మ విశ్వాసం, జీవిత విలువలు తెలుసుకున్నారు. నేటి యువత కూడా వీటిని తెలుసుకోవాలి. ఆయన్ని నటుడిగా ఆరాధించడమే కాదు.. ఆయన జీవితం నుంచి స్ఫూర్తిపొందాల్సింది ఎంతో ఉందని నా అభిప్రాయం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి.. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకున్నారు. సాంఘిక పాత్రల్లో ఆయనకు ఆయనే సాటి. ఆయన  ప్రతి సినిమాలో సందేశం ఉండేది. ఈ మధ్య సినిమాల్లో వాడుతున్న భాష బాగుండటం లేదు. డబుల్ మీనింగ్ వచ్చేలా పదాలు వాడుతున్నారు. రాజకీయం కన్నా సినిమా ప్రభావం ప్రజలపై ఎక్కువ. అక్కినేని స్ఫూర్తితో మంచి లక్షణాలను అలవరుచుకొని తర్వాత తరానికి కూడా నేర్పించాలి. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని