TANA: అంగరంగ వైభవంగా తానా 23వ మహాసభలు

ఫిలడెల్ఫియాలో తానా 23వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. జులై 7 నుంచి మూడు రోజుల పాటు సాగిన ఈ వేడుకల్లో పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.

Updated : 14 Jul 2023 15:58 IST

ఫిలడెల్ఫియా: ఉత్తర అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరం పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జులై 7, 8, 9 తేదీల్లో నిర్వహించిన తానా 23వ మహా సభలు అంగరంగ వైభవంగా జరిగాయి. మూడ్రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు ఆటపాటలు, ప్రముఖుల ప్రసంగాలతో అందర్నీ అలరించాయి. ఈ వేడుకలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. తొలిరోజున దాదాపు 8వేల మందితో ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. తర్వాతి రెండు రోజులపాటు 20వేల పైచిలుకు ప్రవాస తెలుగువారితో మహాసభల ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.

తొలి రోజున 23వ మహాసభల సావనీర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడుకి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, చైర్మన్ శ్రీనివాస్ లావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, ఓవర్సీస్ డైరెక్టర్ వంశీ కోట తదితరులు సత్కరించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురికి తానా ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణను కూడా తానా ప్రతినిధులు సత్కరించారు. ఆయన చేతుల మీదుగా పలువురికి తానా ప్రతిభా అవార్డులను అందజేశారు.అదే వరుసలో తానా ప్రెసిడెన్షియల్ స్పెషల్ అవార్డులు, రికగ్నిషన్ అవార్డులు కూడా అందజేశారు.ఇదే వేదికపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తెలంగాణ కేబినెట్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ నేత సీతక్క, హీరోయిన్ శ్రీలీల, కథానాయకుడు నిఖిల్ తదితరులను కూడా సత్కరించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టుకు తానా కార్యవర్గం తరపున నిర్వాహకులు రూ. కోటి విరాళం అందించారు. బాంకెట్, అవార్డ్ కమిటీ, ఆర్గనైజేషన్ల రికగ్నిషన్ కార్యక్రమం కూడా కన్నులపండువగా జరిగింది. ఆ తర్వాత కవీస్ స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌ విద్యార్థులు టాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. కాప్రికో బ్యాండ్ లైవ్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంది. చివర్లో ప్రముఖ నేపథ్య గాయని చిత్ర, సింహా, కౌసల్య తదితరులు తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు.

రెండోరోజు ఉదయాన్నే కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తానా నాయకులంతా పూజలు చేశారు. అనంతరం తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ బండ్ల హనుమయ్య ప్రసంగాలతో వేడుకలు మొదలయ్యాయి. తానా మహాసభల కోసం ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగ శాస్త్రి రచించిన ‘తెలుగు వైభవం’ పాటకు స్థానిక నృత్య పాఠశాలలకు చెందిన విద్యార్థులంతా కలిసి అద్భుతమైన నాట్యం చేశారు. అనంతరం జొన్నవిత్తులను తానా నేతలు సత్కరించారు. ఆ తర్వాత ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ఎస్, ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ప్రైమ్ హాస్పిటల్స్ వ్యవస్థాకులు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ (టాటా) వ్యస్థాపకులు పైళ్ల మల్లారెడ్డి తదితరులను తానా నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో అలరించింది. అనంతరం ఆధ్యాత్మిక జీవితం గురించి, మనం చేసే పొరపాట్ల గురించి సద్గురు జగ్గీ వాసుదేవ్ అద్భుతంగా వివరించారు. ఇదే క్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును తానా నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు. చివర్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ అండ్ టీం సంగీత విభావరి అందరినీ అలరించింది.

మూడో రోజు వేడుకలు ఘనంగా కొనసాగాయి. స్థానిక సాంస్కృతిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ఆటపాటలు, కళానైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ధింతానా బృందాన్ని తానా నేతలు సత్కరించారు. అనంతరం వేదమంత్రాల నడుమ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తానా సేవలను ఆయన ప్రశంసించారు. అనంతరం సీనియర్ నటులు మాగంటి మురళీ మోహన్ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు చేసిన సేవలను గుర్తిస్తూ తానా-ఎన్టీఆర్ అవార్డుతో ఆయన్ను గౌరవించారు. నందమూరి బాలకృష్ణ ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లను తానా లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుతో గౌరవించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ నేతలను తానా నేతలు ఈ వేదికపై సత్కరించారు. ఆ తర్వాత తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రసంగించారు. అనంతరం బాలకృష్ణ దంపతులను తానా ప్రతినిధులు సత్కరించగా.. ఆయన తానా సేవలను కొనియాడారు. అనంతరం సంగీత రారాజు, మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా మ్యూజికల్ నైట్ కార్యక్రమం తెలుగు సంగీత ప్రేమికులను మంత్రముగ్దుల్ని చేసింది.

ఇతర గదుల్లో ధీంతానా పాటలు, నృత్య పోటీలు, అగ్రికల్చరల్ ఫోరమ్, జొన్నవిత్తుల ఆధ్వర్యంలో భుజనశతకం, ఎన్నారై మీట్స్, ఐటీ సర్వ్ అలయన్స్ మీట్ అండ్ గ్రీట్, వివిధ అంశాలపై చర్చలు, మ్యాట్రిమోని, పాఠశాల కాంపిటీషన్, సీనియర్ సిటిజన్ ఫోరమ్, రీల్స్ అండ్ షార్ట్ ఫిలిం పోటీలు, టీటీడీ శ్రీనివాస కల్యాణం, ఉమెన్స్ ఫోరమ్, యూత్ యాక్టివిటీస్ తదితర కార్యక్రమాలు కూడా ఉత్సాహంగా జరిగాయి. తానా సభల చివరి రోజునే అధ్యక్షులు అంజయ్య చౌదరి పదవీ కాలం కూడా ముగిసింది. ఈ క్రమంలో నూతన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ఈ వేదికపైనే ప్రమాణం చేశారు. ఆయన 2023-2025 వరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహాసభలను విజయవంతం చేసిన ఆయా కమిటీ సభ్యులందరినీ వేదిక పైకి ఆహ్వానించి మహాసభల ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు