నేను బతికున్నంతవరకు బెంగాల్లో సీఏఏ అమలు కానివ్వను: మమత

తాను బతికున్నంత వరకు పశ్చిమబెంగాల్‌లో ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సీఏఏ) అమలు కానివ్వబోనని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చెప్పారు.

Updated : 31 Jan 2024 07:55 IST

రాయ్‌గంజ్‌: తాను బతికున్నంత వరకు పశ్చిమబెంగాల్‌లో ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సీఏఏ) అమలు కానివ్వబోనని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చెప్పారు. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో భాజపా సీఏఏ రాగం అందుకుందని విమర్శించారు. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏ అమలు చేస్తామంటూ కేంద్రమంత్రి శాంతను ఠాకుర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఉత్తర్‌ దినాజ్‌పుర్‌ జిల్లా రాయ్‌గంజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత దీనిపై స్పందించారు. రాజకీయ అవకాశవాదంతోనే భాజపా సీఏఏ అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. ఎవరి పౌరసత్వాన్ని లాక్కొనిపోయేందుకు అనుమతించేది లేదని స్పష్టంచేశారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలను భాజపా ఇప్పుడు చెప్పడం పూర్తిగా రాజకీయమేనన్నారు. బెంగాల్‌ సరిహద్దులో ఉంటున్నవారందరికీ తాము పౌరసత్వం ఇచ్చామని, వారు ఓటుహక్కు వినియోగించుకోవడంతో పాటు అన్ని ప్రయోజనాలు పొందగలుగుతున్నారని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి బీఎస్‌ఎఫ్‌ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తోందంటూ ఆరోపణలొస్తున్న నేపథ్యంలో- అలాంటి కార్డులను స్వీకరించొద్దని హెచ్చరించారు. ఎన్‌ఆర్‌సీ ఉచ్చులో పడవేసేందుకు అవి సాధనాలు అవుతాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని