రైలు టికెట్లకూ డబ్బుల్లేవ్‌

లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి ఆర్థికంగా నిర్వీర్యం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ అగ్రనేతలు ఆరోపించారు.

Updated : 22 Mar 2024 06:26 IST

మా పార్టీ బ్యాంకు ఖాతాలను కావాలనే స్తంభింపజేశారు
సోనియా, రాహుల్‌, ఖర్గే ఆరోపణ

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి ఆర్థికంగా నిర్వీర్యం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ అగ్రనేతలు ఆరోపించారు. దశాబ్దాల క్రితంనాటి ఆదాయపు పన్ను రిటర్నుల వివాదంలో నోటీసులిచ్చి, వెంటనే స్తంభింపజేసిన ఖాతాలను సత్వరం తమకు అప్పగించాలని పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ఉమ్మడిగా డిమాండ్‌ చేశారు. గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వారు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల స్తంభన, ఎన్నికల బాండ్ల అంశాలపై మాట్లాడారు. తమ పార్టీని దెబ్బతీసేందుకే ప్రధాని మోదీ తీవ్ర చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలవేళ డబ్బుల్లేక ప్రచారంలో సమానావకాశాలు కోల్పోతామని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా దేశంలో కోర్టులు, ఎన్నికల సంఘం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడం అబద్ధమని, మనదేశంలో ప్రజాస్వామ్యమే లేదని రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.

రెండు రూపాయలైనా ఖర్చుచేయలేకపోతున్నాం

‘‘కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేరపూరిత చర్యకు పాల్పడుతున్నారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాలు పనిచేయకపోతే ఎలాంటి లావాదేవీలు చేయలేం. ఎన్నికల ప్రచార ప్రకటనలు కూడా ఇవ్వలేకపోతున్నాం. ప్రచారం కోసం మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు పక్కనబెట్టండి.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ మా వద్ద డబ్బుల్లేవు’’ అని రాహుల్‌ గాంధీ తెలిపారు. ‘‘ఇది కేవలం కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను స్తంభింపచేయడం కాదు.. ప్రజాస్వామ్యాన్ని నిలువరించడమే. దేశంలో ప్రజాస్వామ్యమనేదే లేకుండా పోయింది. 20% ఓటర్లు మాకు మద్దతుగా ఉన్నా మేం రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నాం. వ్యక్తుల బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డులను రద్దుచేస్తే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యాపార సంస్థకు ఇలా జరిగితే అది మూతపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు అదే జరిగింది. ఎన్నికల్లో పోరాడకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు’’ అని రాహుల్‌ వివరించారు.

ఆర్థికంగా దెబ్బతీసేందుకేనన్న సోనియా

తొలుత సోనియా గాంధీ మాట్లాడుతూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘‘ఓవైపు ఎన్నికల బాండ్ల వ్యవహారం.. మరోవైపు దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఆర్థిక లావాదేవీలపై దాడి జరుగుతోంది. ఇన్ని సవాళ్ల నడుమ ఎన్నికల్లో మేం సమర్థంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజల నుంచి వసూలుచేసిన విరాళాలను స్తంభింపజేసి మా ఖాతాల్లో ఉన్న డబ్బును బలవంతంగా తీసేసుకున్నారు. ఇంతటి తీవ్రమైన పరిస్థితులున్నప్పటికీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించడానికి మేం ప్రయత్నిస్తున్నాం. ఎన్నికల బాండ్ల ద్వారా భారీగా లబ్ధిపొందిన భాజపా మమ్మల్ని ఆర్థికంగా దెబ్బకొట్టడానికి కుట్రపన్నింది. ఇది పూర్తి అప్రజాస్వామికం’’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

భాజపా డబ్బుకు లెక్కాపత్రం లేదు: ఖర్గే

‘ఎన్నికల బాండ్ల ద్వారా భాజపా 56% నిధులను చేజిక్కించుకొంది. కాంగ్రెస్‌కు 11% మాత్రమే దక్కాయి. బాండ్ల నిధులతోపాటు, భాజపాకు నగదు కూడా వచ్చింది. దానికి లెక్కాపత్రం లేదు. ప్రింట్‌, టీవీ, సామాజిక మాధ్యమాల్లో వారి ఆధిపత్యం కొనసాగుతోంది. ఇంత భారీ మొత్తం విరాళాలను ఒక పార్టీ చేజిక్కించుకోవడం ప్రజాస్వామ్య చర్రితలో ఇదే తొలిసారి.  ఐటీ రిటర్నుల వివాదం కోర్టులో తేలుతుంది. అంతవరకు ఐటీ విభాగం వేచిచూడాలి. రాజకీయ పార్టీలు పన్ను చెల్లించవు. దేశంలో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేలా ఎన్నికల్లో సమానావకాశాలు కల్పించాలి’ అని ఖర్గే డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని