మల్కాజిగిరికి సునీత.. సికింద్రాబాద్‌కు దానం

రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు పోటీచేసే ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ గురువారం మలి జాబితాను విడుదల చేసింది. ఇటీవల భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి అధిష్ఠానం పెద్దపీట వేసింది.

Updated : 24 Mar 2024 14:47 IST

మల్లు రవికే నాగర్‌కర్నూల్‌ - చేవెళ్లకు రంజిత్‌రెడ్డి.. పెద్దపల్లికి గడ్డం వంశీకృష్ణ
కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల మలి జాబితాలో ఐదుగురికి చోటు
భారాస నుంచి వచ్చిన ముగ్గురికి స్థానం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు పోటీచేసే ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ గురువారం మలి జాబితాను విడుదల చేసింది. ఇటీవల భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి అధిష్ఠానం పెద్దపీట వేసింది. తాజాగా మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, నాగర్‌కర్నూల్‌, చేవెళ్ల, పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో నలుగుర్ని, రెండో జాబితాలో ఐదుగుర్ని మొత్తం 9 మందిని ఖరారు చేసింది. తాజాగా ప్రకటించిన ఐదు స్థానాల్లో మూడు భారాస నుంచి వచ్చిన వారికే దక్కాయి.

టికెట్లు వీరికే...

  • మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి ఇటీవల భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. ఆమెకు తాజాగా మల్కాజిగిరి టికెట్‌ లభించింది.
  • సిటింగ్‌ ఎమ్మెల్యే, భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌కు సికింద్రాబాద్‌ టికెట్‌ దక్కింది.
  • కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోదరుడు, మాజీ ఎంపీ మల్లు రవికి నాగర్‌కర్నూల్‌ టికెట్‌ దక్కింది. ఈ టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పోటీపడ్డారు. తమ సామాజికవర్గానికే ఇక్కడ ఓట్లు ఎక్కువ ఉన్నాయని, టికెట్‌ తనకే ఇవ్వాలని అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. అయినా పార్టీ మల్లు రవి వైపే మొగ్గుచూపింది.
  • చేవెళ్ల టికెట్‌ను సిటింగ్‌ ఎంపీ, ఇటీవల భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన జి.రంజిత్‌రెడ్డికి పార్టీ ఖరారు చేసింది.
  • కాంగ్రెస్‌ పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ తనయుడు వంశీకృష్ణకు పార్టీ పెద్దపల్లి టికెట్‌ కేటాయించింది.

మరో 8 స్థానాలపై కసరత్తు

ప్రకటించాల్సిన మరో ఎనిమిది స్థానాలపై కసరత్తు జరుగుతోంది. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, భువనగిరి, వరంగల్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని ప్రకటించాలని అనుకున్నా, వివిధ సమీకరణాల నేపథ్యంలో పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. తొలుత కరీంనగర్‌ నుంచి ప్రవీణ్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని అనుకున్నారు. అయితే అక్కడ బలమైన అభ్యర్థులు పోటీలో ఉండటంతో జీవన్‌రెడ్డి వైపు పార్టీ మొగ్గుచూపుతోంది. అయితే ఆయన నిజామాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి స్థానాలను ఎస్సీల్లోని ఒకే వర్గానికి ఇవ్వడంతో వరంగల్‌ను మరో వర్గానికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇక్కడి నుంచి ఓ పేరు పరిశీలనలో ఉండగా.. ఇంకా బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఆదిలాబాద్‌ టికెట్‌ కోసం ఇద్దరు నేతలు పోటీపడటంతో పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. ఖమ్మం టికెట్‌ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి పోటీపడుతున్నారు. మెదక్‌ స్థానం బీసీలకు ఇవ్వాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. ఇక్కడి నుంచి పోటీకి నీలం మధు ముదిరాజ్‌ పేరు ప్రతిపాదనకు వచ్చినా ఆయనతో పాటు మరో పేరును పార్టీ పరిశీలిస్తోంది. కీలకమైన భువనగిరి లోక్‌సభ టికెట్‌ కోసం తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి టికెట్‌ దాదాపు ఖరారైనా.. ఈ టికెట్‌ను సిటింగ్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.. తన సతీమణికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. హైదరాబాద్‌ నుంచి బలమైన అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై తర్జనభర్జన సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని