ప్రధాని ప్రత్యర్థి అజయ్‌రాయ్‌

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వారణాసి నియోజకవర్గం నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ పోటీ చేయనున్నారు.

Updated : 24 Mar 2024 06:23 IST

45 మందితో కాంగ్రెస్‌ నాలుగో జాబితా
విరుధునగర్‌ నుంచి మాణికం ఠాగూర్‌

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వారణాసి నియోజకవర్గం నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ పోటీ చేయనున్నారు. 12 రాష్ట్రాలకు చెందిన స్థానాల కోసం 45 మంది అభ్యర్థులతో ఆ పార్టీ శనివారం రాత్రి నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇందులో మధ్యప్రదేశ్‌ 12, మహారాష్ట్ర 4, రాజస్థాన్‌ 3, తమిళనాడు 7, ఉత్తర్‌ప్రదేశ్‌ 9 స్థానాల చొప్పున ఉన్నాయి. మోదీపై పోటీ చేయబోతున్న అజయ్‌రాయ్‌ ఇదివరకు అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి 2009లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున; 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆ రకంగా మోదీపై పోటీ ఇది మూడోసారి. వరుస ఓటములను లెక్కచేయకుండా ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. భాజపా విద్యార్థి విభాగం ఏబీవీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన రాయ్‌ 1996-2007 మధ్య మూడుసార్లు భాజపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2012లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

రాజ్‌గఢ్‌ నుంచి దిగ్విజయ్‌

ఇండియా కూటమి తరఫున ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 17 సీట్లలో పోటీచేయాలని నిర్ణయించిన కాంగ్రెస్‌పార్టీ తాజా జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇటీవల బీఎస్పీ నుంచి వచ్చి చేరిన లోక్‌సభ సభ్యుడు డానిష్‌ అలీకి అమ్రోహా సీటు కేటాయించింది. బారాబంకి ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్‌ నాయకుడు పీఎల్‌ పునియా తనయుడు తనూజ్‌ పునియాను రంగంలోకి దింపింది. మధ్యప్రదేశ్‌లో రాజ్‌గఢ్‌ నుంచి సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌, రత్లాం నుంచి కాంతిలాల్‌ బూరియా పోటీ చేయనున్నారు. తమిళనాడులోని విరుధునగర్‌ నుంచి ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ను బరిలోకి దింపింది. ఈయన అక్కడ భాజపా అభ్యర్థి అయిన సినీనటి రాధికా శరత్‌కుమార్‌తో తలపడనున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వికాస్‌ ఠాక్రే పోటీ చేయనున్నారు.

శివగంగలో కార్తీ చిదంబరం

శివగంగ నుంచి సీనియర్‌ నేత పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మరోసారి తలపడనున్నారు. పొత్తులో భాగంగా తమిళనాడులో 9 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్‌ ఇప్పుడు ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 39, రెండో జాబితాలో 43, మూడో జాబితాలో 56 పేర్లు విడుదల చేసిన కాంగ్రెస్‌ దీంతో మొత్తం 183 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. రాజస్థాన్‌లోని నాగౌర్‌ స్థానాన్ని హనుమాన్‌ బేణీవాల్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని