విధానాలపైనే యుద్ధం!

తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధానంగా 3 కూటముల మధ్యే భీకర పోరు సాగుతోంది. ఈ పోరులో ఆయా కూటముల విధానాలే కీలకాంశాలుగా మారాయి. వాటినే ప్రచారాస్త్రాలుగా ఆయా పార్టీల నేతలు ఎంచుకున్నారు.

Updated : 15 Apr 2024 06:47 IST

డీఎంకే, భాజపా, అన్నాడీఎంకే పరస్పర విమర్శలు
తమిళనాడులో వేడెక్కిన రాజకీయం

తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధానంగా 3 కూటముల మధ్యే భీకర పోరు సాగుతోంది. ఈ పోరులో ఆయా కూటముల విధానాలే కీలకాంశాలుగా మారాయి. వాటినే ప్రచారాస్త్రాలుగా ఆయా పార్టీల నేతలు ఎంచుకున్నారు.


భాజపా నుంచి విముక్తే డీఎంకే లక్ష్యం

లోక్‌సభ ఎన్నికల్ని రెండో స్వాతంత్య్ర పోరాటంతో డీఎంకే పోలుస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలతో దేశానికి భాజపా ముప్పుగా మారిందంటూ ఓటర్లను జాగృతం చేసే పనిలో పడింది. దీనికి ఎన్డీయే నుంచి విముక్తి ఒక్కటే పరిష్కార మార్గంగా ప్రజల్లో మాటల తూటాలు పేలుస్తోంది. దేశ ఐక్యతను దెబ్బకొట్టేలా మత రాజకీయాలకు భాజపా పాల్పడుతోందని ఆరోపిస్తోంది. మైనారిటీ వ్యతిరేక పార్టీగా భాజపా ముద్ర వేసుకుందని, సీఏఏ వారి విధానానికి పరాకాష్టగా మైనారిటీ వర్గాల్ని అప్రమత్తం చేస్తోంది. పనిగట్టుకుని డీఎంకేపై అసత్యాలు ప్రచారం చేసి దాన్నుంచి ఓట్లు దండుకోవాలని మోదీ చూస్తున్నారని, ఇలాంటి ఎత్తుగడలు తమిళనాడు ఓటర్ల దగ్గర సాగవని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ కరాఖండీగా చెబుతున్నారు. భాజపాలో పేరుకుపోయిన అవినీతే కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తెచ్చిపెట్టిందని, వారితో జతకట్టి జయలలిత ఇదివరకు అవినీతిలో కూరుకుపోయిన విషయాల్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అవినీతి పెరిగిందనే నివేదికలూ వస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల బాండ్లు దేశంలోనే పెద్ద స్కాంగా చిత్రీకరిస్తున్నారు. పదేళ్ల పాలనలో భాజపా తమిళనాడు మత్స్యకారుల్ని ఆదుకోలేకపోయిందని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ఇప్పుడు కచ్చతీవు అంశాన్ని లేవనెత్తుతోందని విమర్శలు సంధిస్తున్నారు. భాజపా వ్యతిరేకులపై ఈడీ, ఆదాయ పన్నుశాఖ దాడుల్ని నిర్వహించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెబుతూ.. ‘మోడీస్‌ ఈడీ’ అంటూ డీఎంకే కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు. భాజపా గుప్పిట్లో ఇప్పటికీ అన్నాడీఎంకే ఉందని, వారంతా ఒక్కటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజం కాకపోతే ‘పీఎంగా మోదీ వద్దు’ అని పళనిస్వామి నోటి నుంచి చెప్పమనండి అంటూ సవాల్‌ చేస్తున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, భాష, సంస్కృతులకు పెద్ద పీట వేసేలా ద్రావిడ పాలన తమిళనాడులో నడుస్తోందని, ప్రజలకు కూటమిపై పూర్తి విశ్వాసముందని ప్రచారాల్లో పేర్కొంటున్నారు. ఎన్నికల హామీలు దాదాపు నెరవేర్చామని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేక కొన్ని చేయలేకపోయామంటున్నారు. విశ్వ గురుగా పిలిపించుకుంటున్న మోదీ ఎందుకు తమిళనాడుకు అన్యాయం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. వరదలొచ్చినా కనికరించని ప్రధానిని గద్దెదించడమే లక్ష్యమని.. మళ్లీ ప్రధాని అయితే ఎన్నికలే లేకుండా చేస్తారని ప్రచారం చేస్తున్నారు. మహిళలకు హక్కుగా ప్రతి నెలా రూ.1000 ఇచ్చే ‘కలైంజ్ఞర్‌ మగిళిర్‌ ఉరిమై తిట్టం’, ఉచిత బస్సు ప్రయాణం, ముఖ్యమంత్రి అల్పాహార పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు రూ.1000 ఇచ్చే పుదుమై పెన్‌లాంటి ఎన్నో పథకాలు ప్రజాదరణ పొందాయని ప్రచారం చేస్తున్నారు.


రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా విమర్శనాస్త్రాలు

ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే వైదొలగినా.. భాజపా తన మిగిలిన కూటమి పార్టీలతో కలిసి జోరుగా ప్రజల్లోకి వెళ్తోంది. అసలైన పోటీ డీఎంకే, భాజపా మధ్యే అన్నట్లుగా అగ్ర నేతలు ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ పాలనా విధానాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేవలం కుటుంబానికి మేలు చేసుకునేందుకే డీఎంకే శ్రమిస్తోందని, ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం వారి నైజమని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం భాజపా చేస్తోంది. కేంద్రం నుంచి రూ.వేల కోట్ల నిధులను తమిళనాడుకు ఇస్తున్నామని.. వాటిని డీఎంకే నేతలు పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పిస్తోంది. అవన్నీ బయటికి తీసి ప్రజలకు పంచుతామని హామీ ఇస్తోంది. దుష్టశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడేది ప్రధాని మోదీ ఒక్కరేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అంటున్నారు. తమిళనాడు వికాసానికి డీఎంకే నేతలు అడ్డుగోడలా ఉన్నారని చెబుతున్నారు. డీఎంకే హయాంలోనే విపరీతంగా మత్తు పదార్థాలు అందుబాటులోని వచ్చాయని, పాఠశాలల్లో విద్యార్థుల చేతికీ వెళ్తున్నాయని విమర్శిస్తున్నారు. వాటిపై ఉక్కుపాదం మోపేలా రాష్ట్రంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో కార్యాలయం తెరుస్తామని హామీ ఇస్తున్నారు. దేశంలో తమిళనాడుకు ప్రత్యేక స్థానం ఇచ్చామనడానికి నిదర్శనంగా ఇక్కడికి డిఫెన్స్‌ కారిడార్‌ను తెచ్చి రాష్ట్ర ఖ్యాతి పెంచామని, ఇలాంటిది జీవిత కాలంలో డీఎంకే తీసుకురాగలదా అని సవాల్‌ విసురుతున్నారు. ఈసారి తమిళనాడులో భాజపా పాగా వేయడం ఖాయమని అంటున్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌, డీఎంకేలు మత్స్యకారుల ద్రోహులని విమర్శిస్తున్నారు. వారే కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారని ఆరోపిస్తున్నారు. దానిని తిరిగి తెప్పించి మత్స్యకారుల హక్కుల్ని కాపాడతామని భాజపా నేతలు హామీ ఇస్తున్నారు. మరోపక్క అన్నాడీఎంకేనూ భాజపా నేతలు వదలట్లేదు. ఎన్డీయేకు వ్యతిరేకంగా వెళ్తున్న అన్నాడీఎంకే ఈ ఎన్నికల తర్వాత మూతపడుతుందని ప్రచారం చేస్తున్నారు. మోదీ పదేళ్లలో దేశానికి చాలా చేశారని, ఇంకా చేయాల్సినవి ఉన్నాయని.. మూడోసారి ప్రధాని కావడం ఎంతో అవసరమని ఓటర్లకు చెబుతున్నారు.


అన్నాడీఎంకే శత్రువు స్టాలినే

ఎన్డీయే నుంచి తామెందుకు బయటికొచ్చామో అన్నాడీఎంకే క్షేత్ర స్థాయిలో ఓటర్లకు వివరిస్తోంది. భాజపా, అన్నాడీఎంకే ఒక్కటి కాదని నొక్కి మరీ చెబుతోంది. మరోపక్క తమకు రాష్ట్రంలో శత్రువు డీఎంకేనే అని పార్టీ అగ్రనేతలు ఓటర్లకు చెబుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో డీఎంకే అరాచక పాలన నడుస్తోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినడంతోపాటు మహిళలకు రక్షణ కొరవడిందని మాటల బాణాల్ని సంధిస్తున్నారు. డ్రగ్స్‌ ముఠాల్ని డీఎంకే పెంచి పోషిస్తోందని ఆరోపిస్తున్నారు. ‘సే నో టు డ్రగ్స్‌ అండ్‌ డీఎంకే’ నినాదాలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, ఇతర కీలక నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికారంలో ఉండీ డ్రగ్స్‌ను అరికట్టలేకపోతున్నారని, ఇది పెద్ద వైఫల్యంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకేలో కేవలం కుటుంబ పాలన సాగుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 500 ఎన్నికల హామీలిచ్చి 10శాతం కూడా పూర్తి చేయలేదని విమర్శిస్తున్నారు. భాజపాపైనా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ ఎన్నికలయ్యాక తమ పార్టీ ఉండదని భాజపా ప్రచారం చేస్తోందని, అసలు రాష్ట్రంలో వారి ఉనికే లేనప్పుడు 1998లో కమలం గుర్తును రాష్ట్రంలోకి తెచ్చిందే తామని అంటున్నారు. పార్టీని మూతేయడం ఎవరి తరమూ కాదని చెబుతున్నారు. తమిళనాడుకు సంబంధించి కీలక సమస్యలపై భాజపా దృష్టి సారించలేకపోయిందని ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర హక్కుల్ని కాపాడలేకపోయినందునే ఎన్డీయే నుంచి బయటికొచ్చామని చెబుతున్నారు. రైతులు, పారిశ్రామిక, కావేరీ జలాల్లాంటి ఎన్నో సమస్యల్ని ఎన్డీయే నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తున్నారు.


ఈనాడు, చెన్నై

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని