Sunil Gavaskar: ఇంగ్లాండ్‌-భారత్‌ ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్‌కు కారణమదే : గావస్కర్‌

ఇంగ్లాండ్‌, భారత ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధానికి గల కారణాన్ని సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) వివరించాడు.

Published : 14 Mar 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ (IND vs ENG 2024)ను టీమ్‌ఇండియా (Team India) అద్భుతంగా ముగించిన విషయం తెలిసిందే. 4-1 తేడాతో ప్రత్యర్థిని మట్టి కరిపించి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో కొన్నిసార్లు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్‌ చోటుచేసుకుంది. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధంపై మాజీ దిగ్గజం, కామెంటేటర్‌ సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) స్పందించాడు. వాటి వెనక ఉన్న కారణాన్ని వివరించాడు.

‘‘ఇంగ్లాండ్‌, భారత్‌ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఆటగాళ్లు వాగ్వాదానికి దిగడం వెనక కారణముంది. చాలామంది ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌కు ఎంపిక కారు. ఎందుకంటే ప్రిపరేషన్‌ కోసమో, మరేదైనా కారణం చేతనో వాళ్లని ఏ సమయంలోనైనా బోర్డు వెనక్కి రప్పిస్తుంటుంది. దీంతో ఆయా ఫ్రాంచైజీలు అయోమయంలో పడతాయి. ఐపీఎల్‌ వేలంలో భారత ఆటగాళ్లు దక్కించుకుంటున్న మొత్తాన్ని చూసి వారు జీర్ణించుకోలేరు. అందుకే.. ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య మ్యాచ్‌ల్లో ఎక్కువగా ఆటగాళ్లు నోటికి పని చెప్పడం చూస్తుంటాం. దీంతో ఇంగ్లాండ్‌పై విజయం టీమ్‌ఇండియాకు ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది’’ అని గావస్కర్‌ అన్నాడు.

ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌పై కూడా గావస్కర్‌ స్పందించాడు. ‘‘బెన్‌స్టోక్స్‌ వాళ్ల ఆటగాళ్లను రాక్‌స్టార్స్‌లా ఆడాలని కోరుకుంటాడు. ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లు గెలవడం మొదలుపెట్టగానే.. అభిమానులకు, మీడియాకు ఇది ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే, ఇలాంటి ఆట తీరు.. ప్రత్యర్థి జట్టు ఎదురుదాడి లేని మంచి బ్యాటింగ్‌ పిచ్‌లపైనే కొనసాగింది’’ అని గావస్కర్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని