FIFA: 56 ఏళ్లు గడిచినా.. ఓ మిస్టరీ ఛాంపియన్‌ గోల్‌ ఇదీ..!

1966 ఫుట్‌బాల్‌ ఫైనల్స్‌ సందర్భంగా ఓ గోల్‌ విషయంలో మైదానంలో గందరగోళం నెలకొంది. అది గోల్‌ అవునో.. కాదో తెలియదు. అందరికీ సందేహాలే.. కానీ, రెఫరీ మాత్రం దానిని గోల్‌గా ప్రకటించడంతో ఇంగ్లాండ్‌ అధిక్యంలోకి దూసుకెళ్లింది.

Published : 26 Nov 2022 10:11 IST

ఇంటర్నెట్‌డెస్క్: అదనపు సమయంలో లభించడంతో.. ఓ వివాదాస్పదమైన గోల్‌తో ఆధిపత్యం దక్కించుకొని ఏకంగా ప్రపంచకప్‌నే సొంతం చేసుకొన్న ఘటన 1966లో చోటు చేసుకొంది. బంతి గోల్‌ పోస్టులోకి వెళ్లిందా.. లేదా అనేది ఇప్పటికీ ఓ కొలిక్కి రాని వివాదంగానే మిగిలిపోయింది. ఈ ప్రపంచ కప్‌ ప్రస్తావన రాగానే ఇంగ్లిష్‌ అభిమానులు.. జర్మన్‌ అభిమానులు వాగ్వాదానికి దిగుతూనే ఉంటారు. అంతలా వివాదాస్పదమైన గోల్‌ ఈ మ్యాచ్‌లో నమోదైంది. 

1966 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌లో జరిగింది. ఆతిథ్య దేశమైన ఇంగ్లాండ్‌ ఈ టోర్నీలో అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరుకొంది. మరో వైపు వెస్ట్‌ జర్మనీ కూడా తుదిపోరు బరిలోకి చేరింది. ఈ మ్యాచ్‌ తుది వరకూ.. విజయం ఇరు పక్షాల మధ్య దోబూచులాడింది. మ్యాచ్‌ 12వ నిమిషంలోనే వెస్ట్‌ జర్మనీ ఆటగాడు హెల్ముట్‌ హాలర్‌ తొలిగోల్‌ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత 18వ నిమిషంలో ఇంగ్లాండ్‌ ఆటగాడు జియో హర్స్ట్‌ గోల్‌ చేయడంతో స్కోర్‌ సమమైంది. 78వ నిమిషంలో ఇంగ్లాండ్‌ ఆటగాడు మార్టిన్‌ పీటర్స్‌ గోల్‌ చేయడంతో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌ చివర్లో (89వ నిమిషం) వెస్ట్‌ జర్మనీకి చెందిన వోల్ఫ్‌గ్యాంగ్‌ వెబర్‌ గోల్‌ చేయడంతో స్కోర్‌ సమమైంది. ఫలితంగా అదనపు సమయం కేటాయించారు.

వివాదం ఇదీ..

ఈ అదనపు సమయంలో కూడా హోరాహోరీ పోరు సాగింది. మ్యాచ్‌ 101 నిమిషంలో జియో హర్స్ట్‌ వెస్ట్‌ జర్మనీ గోల్‌ పోస్ట్‌కు అత్యంత సమీపంలో పెనాల్టీ స్పాట్‌ నుంచి బంతిని కొట్టాడు. ఆ బంతి గోల్‌పోస్టు ఇనుపకడ్డీకి తాకి గోల్‌ లైన్‌కు ఇవతల పడిందా.. అవతల పడిందా అనేది స్పష్టంగా తెలియలేదు. దీంతో మ్యాచ్‌ను పర్యవేక్షిస్తున్న స్విస్‌ రెఫరీ గాట్‌ప్రైడ్‌ డైన్స్ట్ ఇంగ్లాండ్‌కు గోల్‌ ఇచ్చాడు. దీంతో ఇంగ్లిష్‌ జట్టు  ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గోల్‌తో వెస్ట్‌ జర్మనీ ఆటగాళ్లు నిస్పృహలోకి వెళ్లడంతో మళ్లీ కోలుకోలేదు. జియో హర్స్ట్‌ 120వ నిమిషంలో మరో గోల్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో మరిన్ని విశేషాలున్నాయి. ఇంగ్లాండ్‌కు ఇప్పటి వరకు లభించిన ఏకైక ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ అదే. అంతేకాదు.. ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో హ్యాట్రిక్‌ గోల్స్‌ చేసిన ఆటగాడిగా జియో హర్స్ట్‌ నిలిచాడు. ఇక 101 నిమిషంలో చేసిన గోల్‌ ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైందిగా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని