FIFA: ముల్లర్‌ మలుపు తిప్పిన మ్యాచ్‌..!

పశ్చిమ జర్మనీ రెండోసారి ప్రపంచకప్‌ గెలిచిన ఘనత స్టార్‌ ఆటగాడు ముల్లర్‌కే దక్కుతుంది. ఫైనల్‌ మ్యాచ్‌ కీలక సమయంలో అద్భుతమైన గోల్‌తో జట్టుకు ఆధిక్యం అందించాడు.

Updated : 05 Dec 2022 15:21 IST

ఇంటర్నెడెస్క్‌: అసలే ప్రపంచకప్‌ (FIFA World Cup) ఫైనల్‌.. చిరకాల ప్రత్యర్థితో పోరు.. ఆట మొదలైన రెండు నిమిషాల్లోనే ప్రత్యర్థికి పెనాల్టీ రూపంలో గోల్‌ లభిస్తే ఏ జట్టు పరిస్థితి అయినా ఎలా ఉంటుంది..? 1974 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో పశ్చిమ జర్మనీకి ఇటువంటి పరిస్థితే ఎదురైంది. అయినా ఆ జట్టు కోలుకొని  ప్రపంచకప్‌ను దక్కించుకొంది. ఈ ఘనత మొత్తం ఆ జట్టు స్టార్‌ స్ట్రైకర్‌ గెర్డ్‌ ముల్లర్‌(Gerd Muller)కు లభిస్తుంది. 

1974 ప్రపంచకప్(FIFA World Cup)లో ఆతిథ్య దేశం పశ్చిమ జర్మనీ(West Germany) రెండు రౌండ్లలో కలిపి ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఐదింట గెలవగా.. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇక నెదర్లాండ్స్‌(Netherlands) ఐదుగెలిచి.. ఒక మ్యాచ్‌ డ్రా చేసుకొని ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే నెదర్లాండ్స్‌కు పెనాల్టీ కిక్‌ లభించింది. అప్పటికి పశ్చిమ జర్మనీ ఆటగాళ్లు మ్యాచ్‌లో బంతిని కూడా తాకలేదు. ఈ పెనాల్టీని నెదర్లాండ్స్‌ ఆటగాడు జాన్‌ నెస్కెన్స్‌ అద్భుతమైన గోల్‌గా మార్చాడు. ఒక్కసారిగా జర్మనీపై ఒత్తిడి పెరిగిపోయింది. ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడానికి నెదర్లాండ్స్‌ తీవ్రంగా యత్నించింది. 25వ నిమిషంలో పశ్చిమ జర్మనీకి పెనాల్టీ లభించింది. దీనిని  జర్మనీ ఆటగాడు బెర్న్డ్‌ హోల్జెన్‌బీన్‌ గోల్‌గా మలచడంతో స్కోర్‌ సమమైంది. దీంతో ఆధిపత్యం కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్‌ 43వ నిమిషంలో పశ్చిమ జర్మనీ ఆటగాడు ముల్లర్‌ (Gerd Muller)అద్భుతమైన గోల్‌ సాధించాడు. దీంతో ఆ జట్టుకు ఆధిక్యం లభించింది. ప్రత్యర్థి నెదర్లాండ్స్‌కు ఇక మ్యాచ్‌లో మరో అవకాశం లభించలేదు. దీంతో పశ్చిమ జర్మనీ (West Germany)రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది.

ఆ టోర్నీలో ముల్లర్‌ (Gerd Muller)4 గోల్స్‌ చేశాడు. 1970 ప్రపంచకప్‌లో 10 గోల్స్‌ చేశాడు. అతడు రెండు ప్రపంచకప్‌లే ఆడాడు. కానీ, అత్యధిక గోల్స్‌(14) చేసిన ఆటగాడికిగా అప్పట్లో రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు దాదాపు 32 ఏళ్లు చెక్కు చెదరలేదు.  ఐదు ప్రపంచకప్‌లు ఆడిన మెస్సీ వంటి ఆటగాడే 9 గోల్స్‌ చేశాడంటే ఈ రికార్డు ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. 1974 ప్రపంచకప్‌ తర్వాత ముల్లర్‌ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని