డ్రైవ్‌తోనే టెక్స్ట్‌ లాగేస్తే?

ప్రజెంటేషన్‌ను మరింత ఆకర్షణీయంగా మలచటానికో, రీసెర్చ్‌ ప్రాజెక్టు కోసమో.. కొన్నిసార్లు ఇమేజ్‌ల నుంచి టెక్స్ట్‌ను సంగ్రహిస్తే బాగుంటుందని అనిపిస్తుంటుంది.

Published : 16 Aug 2023 00:14 IST

ప్రజెంటేషన్‌ను మరింత ఆకర్షణీయంగా మలచటానికో, రీసెర్చ్‌ ప్రాజెక్టు కోసమో.. కొన్నిసార్లు ఇమేజ్‌ల నుంచి టెక్స్ట్‌ను సంగ్రహిస్తే బాగుంటుందని అనిపిస్తుంటుంది. పీడీఎఫ్‌ ఫైలు నుంచో, ఆన్‌లైన్‌లో ఫొటో నుంచో కొన్ని నోట్స్‌ను తీసుకోవాలనీ అనిపించొచ్చు. గూగుల్‌ డ్రైవ్‌ తోడుంటే ఇది చిటికెలో పనే! దీని ద్వారా జెపెగ్‌, పీఎన్‌జీ, గిఫ్‌ ఫార్మాట్ల ఇమేజ్‌లలోని టెక్స్ట్‌ను తేలికగా గ్రహించొచ్చు. పీడీఎఫ్‌ నుంచి టెక్స్ట్‌ను కాపీ కూడా చేసుకోవచ్చు. గూగుల్‌ డ్రైవ్‌ చాలా భాషలను సపోర్టు చేస్తుంది. దానంతటదే డాక్యుమెంట్‌ భాషను గుర్తిస్తుంది. మరి దీని ద్వారా ఇమేజ్‌, పీడీఎఫ్‌లోని టెక్స్ట్‌ను పొందటమెలాగో చూద్దామా!

  • పీసీ మీద గూగుల్‌ డ్రైవ్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి. లేదా గూగుల్‌ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్‌ పిక్చర్‌ పక్కనుండే గూగుల్‌ యాప్స్‌ మెనూ ద్వారా డ్రైవ్‌ను ఎంచుకొని, సైన్‌ఇన్‌ అవ్వాలి.
  • డ్రైవ్‌లోని ఇమేజ్‌ లేదా పీడీఎఫ్‌ ఫైల్‌ మీద రైట్‌ క్లిక్‌ చేయాలి. ఓపెన్‌ విత్‌ ద్వారా గూగుల్‌ డాక్స్‌ను ఎంచుకోవాలి.
  • ఒకవేళ కంప్యూటర్‌లోని పీడీఎప్‌ లేదా ఇమేజ్‌ను వాడుకోవాలనుకుంటే ముందుగా వాటిని గూగుల్‌ డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేయాలి. పైన కుడివైపున ఉండే ‘న్యూ’ బటన్‌ను క్లిక్‌ చేసి, ఫైల్‌ అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • అప్పుడే అప్‌లోడ్‌ చేసిన ఫైలును త్వరగా గుర్తించాలంటే ఎడమ వైపు మెనూలో ‘రీసెంట్‌’ విభాగాన్ని ఎంచుకోవాలి. తర్వాత ఫైలు మీద రైట్‌ క్లిక్‌ చేసి ‘ఓపెన్‌ విత్‌’ ద్వారా ‘గూగుల్‌ డాక్స్‌’ను ఎంచుకోవాలి.
  • అప్పుడు ఇమేజ్‌ గూగుల్‌ డాక్స్‌లో ఓపెన్‌ అవుతుంది. దాని కింద ఇమేజ్‌, పీడీఎఫ్‌లోని టెక్స్ట్‌ సైతం కనిపిస్తుంది. ఈ టెక్స్ట్‌ను కాపీ చేసి వర్డ్‌ డాక్‌, నోట్‌ప్యాడ్‌, పవర్‌పాయింట్‌ వంటి డాక్యుమెంట్లలో పేస్ట్‌ చేసుకోవచ్చు. అవసరమైన సవరణలు చేసుకోవచ్చు. ఒకవేళ పీడీఎఫ్‌ ఫైలు పుస్తకం మాదిరిగా ఉన్నట్టయితే టెక్స్ట్‌ పేజీల వారీగా కనిపిస్తుంది.
  • టెక్స్ట్‌ను మరింత స్పష్టంగా గ్రహించాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇమేజ్‌ లేదా పీడీఎఫ్‌ సైజు 2 ఎంబీ అంతకన్నా తక్కువ సైజులో ఉండాలి. టెక్స్ట్‌ రెజల్యూషన్‌ కనీసం 10 పిక్సెల్స్‌ ఎత్తు.. అంటే సుమారు 7.5 ఫాంట్‌ సైజులో ఉండాలి. ఏరియల్‌, టైమ్స్‌ న్యూ రోమన్‌ వంటి వెబ్‌ ఫ్రెండ్లీ ఫాంట్లయితే మంచిది. ఇమేజ్‌ క్వాలిటీ బాగుంటే టెక్స్ట్‌ కూడా నాణ్యంగా కనిపిస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని