పీసీలో అత్యవసర రీస్టార్ట్‌ బటన్‌!

విండోస్‌ 10 లేదా 11 కంప్యూటర్‌ మొరాయించిందా? అప్లికేషన్లేవీ పనిచేయటం లేదా? మొత్తంగా పీసీయే స్తంభించిందా? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చేసేది కంట్రోల్‌, ఆల్ట్‌, డిలీట్‌ బటన్లను కలిపి నొక్కటమే.

Updated : 23 Aug 2023 02:03 IST

విండోస్‌ 10 లేదా 11 కంప్యూటర్‌ మొరాయించిందా? అప్లికేషన్లేవీ పనిచేయటం లేదా? మొత్తంగా పీసీయే స్తంభించిందా? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చేసేది కంట్రోల్‌, ఆల్ట్‌, డిలీట్‌ బటన్లను కలిపి నొక్కటమే. ఆగిపోయిన పీసీని రీస్టార్ట్‌ చేయటానికి డాస్‌ తొలిరోజుల నుంచీ అనుసరిస్తున్న విధానమే. కొందరు టాస్క్‌మేనేజర్‌ షార్ట్‌ కట్‌నూ (కంట్రోల్‌, షిఫ్ట్‌, ఎస్క్‌) దీనికి వాడుకుంటారు. కానీ చాలామందికి తెలియనిది అత్యవసర రీసార్ట్‌ ఆప్షన్‌. కంట్రోల్‌, ఆల్ట్‌, డిలీట్‌ కలిపి నొక్కినప్పుడు కనిపించే తెర మీదే మైక్రోసాఫ్ట్‌ దీన్ని దాచి ఉంచింది. ఈ మూడు బటన్లను ఒకేసారి నొక్కినప్పుడు తెర మీద లుక్‌, స్విచ్‌ యూజర్‌, సైన్‌ ఆఫ్‌, టాస్క్‌ మేనేజర్‌ ఆప్షన్లు కనిపిస్తాయి కదా. వీటిని కాసేపు పక్కనపెట్టి కింద ఎడమ వైపు మూలకు చూడండి. నెట్‌వర్క్‌ సెటింగ్స్‌, యాక్సెసబిలిటీ ఫంక్షన్స్‌ బటన్ల పక్కన పవర్‌ బటన్‌ కనిపిస్తుంది. దీని ద్వారా రహస్య ఫంక్షన్లను వాడుకోవచ్చు. కంట్రోల్‌ మీటను నొక్కిపట్టి, పవర్‌ బటన్‌ మీద క్లిక్‌ చేస్తే ‘క్లిక్‌ ఓకే టు ఇమ్మిడియెట్లీ రీస్టార్ట్‌. ఎనీ అన్‌సేవ్డ్‌ డేటా విల్‌ బీ లాస్ట్‌’ అనే సందేశం కనిపిస్తుంది. చిట్టచివరి అవకాశంగానే దీన్ని వాడుకోవాలనీ అప్రమత్తం చేస్తుంది. క్లిక్‌ ఓకే బటన్‌ మీద నొక్కగానే వెంటనే కంప్యూటర్‌ రీస్టార్ట్‌ అవటం మొదలెడుతుంది. పవర్‌ను ఆఫ్‌ చేయకుండానే పీసీ తిరిగి ఆన్‌ కావటానికి ఇదో అదనపు పద్ధతి. అవసరమైనప్పుడు రీబూట్‌ ఆప్షన్‌గా దీన్ని వాడుకోవచ్చు.

  • షట్‌ డౌన్‌ విండోస్‌ డైలాగ్‌ బాక్స్‌ను తేలికగా యాక్సెస్‌ చేయటం ద్వారానూ పీసీని రీస్టార్ట్‌ చేయొచ్చు. ఇందుకు ఆల్ట్‌, ఎఫ్‌4 షార్ట్‌కట్‌ ఉపయోపడుతుంది. ముందుగా విండోస్‌, డి మీటలను కలిపి నొక్కాలి. తర్వాత ఆల్ట్‌, ఎఫ్‌ మీటలను కలిపి నొక్కితే షట్‌ డౌన్‌ విండోస్‌ బాక్స్‌ ప్రత్యక్షమవుతుంది. డ్రాప్‌ డౌన్‌ మెనూలో రీస్టార్ట్‌ ఆప్షన్‌ను ఎంచుకొని, ఓకే బటన్‌ను క్లిక్‌ చేస్తే చాలు.
  • పీసీ వాడకం బాగా తెలిసినవారు కమాండ్‌ ప్రాంప్ట్‌తోనూ పీసీని రీస్టార్ట్‌ చేసుకోవచ్చు. టాస్క్‌బార్‌ మీద విండోస్‌ గుర్తును క్లిక్‌ చేసి, సెర్చ్‌ బాక్సులో సీఎండీ అని టైప్‌ చేయాలి. కమాండ్‌ ప్రాంప్ట్‌ గుర్తు మీద రైట్‌ క్లిక్‌ చేసి ‘రన్‌ యాజ్‌ అడ్మినిస్ట్రేటర్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం కమాండ్‌ ప్రాంప్ట్‌లో shutdown -r అని టైప్‌ చేసి, రన్‌ చేయాలి. వార్నింగ్‌ మెసేజ్‌ కనిపించినప్పుడు ‘క్లోజ్‌’ మీద క్లిక్‌ చేయాలి. పీసీ 60 సెకండ్లలో షట్‌ డౌన్‌ అయ్యి, రీస్టార్ట్‌ అవుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని