Google Dark Web Report: చీకటి వెబ్‌కు గూగుల్‌ చెక్‌

ఏ సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌ చేసేస్తాం. కొత్త చిరునామా వెతకాలన్నా, క్లిష్టమైన పదానికి సమాధానం తెలుసుకోవాలన్నా, సైన్స్‌ దగ్గర్నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకూ ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా ముందుగా తట్టేది గూగులమ్మ తలుపునే.

Updated : 30 Aug 2023 11:02 IST

ఏ సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌ చేసేస్తాం. కొత్త చిరునామా వెతకాలన్నా, క్లిష్టమైన పదానికి సమాధానం తెలుసుకోవాలన్నా, సైన్స్‌ దగ్గర్నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకూ ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా ముందుగా తట్టేది గూగులమ్మ తలుపునే. దీన్ని ఇతరుల చేతిలో మోసపోకుండా ఉండటానికీ ఉపయోగించుకోవచ్చని తెలుసా? చీకటి అంతర్జాలంలో.. అదే డార్క్‌ వెబ్‌లో మన వ్యక్తిగత సమాచారాన్నీ గూగుల్‌ శోధిస్తుంది. దాని గురించి అప్రమత్తమూ చేస్తుంది. గత మార్చిలో అమెరికాలో ఆరంభించిన ఈ సదుపాయాన్ని ఇప్పుడు మనదేశానికీ విస్తరించింది. దీన్ని ఎలా వాడుకోవాలో చూద్దామా.

గూగుల్‌ శోధన కొత్తేమీ కాదు. అసలు అది తెలియనివారు లేరన్నా అతిశయోక్తి కాదు. గూగుల్‌ అంతగా మన వ్యక్తిగత, అధికార వ్యవహారాల్లోకి చొచ్చుకొచ్చింది. మనం ఏ విషయాన్ని శోధించినా ఆన్‌లైన్‌ ప్రపంచం మొత్తాన్ని జల్లెడ పట్టి, చిటికెలో పరిష్కారాన్ని మన ముందుంచుతుంది. దీనికి మరో కోణమూ ఉంది. మనలాంటి మామూలు వ్యక్తులకు తెలియని అజ్ఞాత ఆన్‌లైన్‌ ప్రపంచం. ఒకరకంగా ఇదో చీకటి ఆన్‌లైన్‌ సామ్రాజ్యం. ముద్దుగా డార్క్‌ వెబ్‌గా పిలుచుకునే దీన్ని యాక్సెస్‌ చేయటం అంత తేలిక కాదు. దీనిలోకి ప్రవేశించాలంటే ప్రత్యేకమైన బ్రౌజర్లు అవసరం. డార్క్‌ వెబ్‌ను కొందరు న్యాయపరంగా వాడుకుంటే, కొందరు వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తుంటారు. కానీ కొందరు అక్రమ, అనైతిక వ్యవహారాల కోసమూ వాడుకుంటారు. డార్క్‌వెబ్‌లో జరిగే ముఖ్య కార్యక్రమాల్లో ఒకటి దొంగిలించిన సమాచారాన్ని అమ్మటం. మనకు తెలియకుండానే మనం దీనికి బలి కావొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే గూగుల్‌ ‘డార్క్‌ వెబ్‌ రిపోర్టింగ్‌’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది మన వ్యక్తిగత సమాచారం చీకటి అంతర్జాలంలో ఉన్నట్టయితే దాన్ని శోధిస్తుంది. ఒకవేళ అలాంటి సమాచారం ఉన్నట్టయితే నోటిఫికేషన్‌ రూపంలోనూ హెచ్చరిస్తుంది. ఏం చేయాలో కూడా హెచ్చరిస్తుంది. ఈ ఫీచర్‌కు వివిధ రకాల సమాచారాన్ని జోడించి స్కాన్‌ చేయొచ్చు, పర్యవేక్షించొచ్చు. ఉదాహరణకు- ఈమెయిల్‌ అడ్రస్‌, ఫోన్‌ నంబరు, ఇంటి చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలను వెతకొచ్చు. ఇది ఇతర గూగుల్‌ ఫీచర్ల మాదిరిగానే పనిచేస్తుంది. కాకపోతే డార్క్‌ వెబ్‌లో ఉన్న వివరాలను పసిగట్టి, హెచ్చరిస్తుంది.

స్కాన్‌ ఇలా

ఉచితంగా వాడుకోవాలనుకునేవారు- ముందుగా వన్‌.గూగుల్‌.కామ్‌లోకి వెళ్లాలి. సెక్యూరిటీ విభాగంలో కిందికి వస్తే ‘మానిటర్‌ ద డార్క్‌ వెబ్‌ ఫర్‌ యువర్‌ పర్సనల్‌ ఇన్ఫో’ కనిపిస్తుంది. దీని కింద ఉండే ‘ట్రై ఎ స్కాన్‌’ బటన్‌ను క్లిక్‌ చేయాలి. గూగుల్‌ ఖాతాతో సైన్‌ ఇన్‌ అయితే మొత్తం ఫలితాలన్నీ కనిపిస్తాయి. వ్యూ రిజల్ట్స్‌ బటన్‌ మీద నొక్కితే ఈమెయిల్‌ అడ్రస్‌ ఎన్నిసార్లు డార్క్‌ వెబ్‌లో ఉల్లంఘనకు గురయ్యిందో తెలుస్తుంది.

గూగుల్‌ వన్‌ చందాదారులైతే- డార్క్‌ వెబ్‌లో వ్యక్తిగత సమాచారాన్ని శోధించటమే కాకుండా, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే నోటిఫికేషన్లూ అందుకోవచ్చు. ముందుగా వన్‌.గూగుల్‌.కామ్‌లో గానీ గూగుల్‌ వన్‌ యాప్‌ ద్వారా గానీ సైన్‌ అప్‌ కావాలి. ఒకసారి చందా కట్టాక డార్క్‌ వెబ్‌ మానిటరింగ్‌ను సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

  • గూగుల్‌ వన్‌ వెబ్‌ పేజీ ఓపెన్‌ చేయాలి.
  • డార్క్‌ వెబ్‌ రిపోర్ట్‌ విభాగంలోకి వెళ్లి, సెట్‌ అప్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయాలి.
  • తర్వాత పేజీలో పర్యవేక్షించాలని అనుకుంటున్న సమాచారాన్ని (పేరు, పుట్టిన తేదీ, ఫోన్‌ నంబరు వంటివి) ఎంచుకోవాలి.
  • తర్వాత పేజీలో మానిటరింగ్‌ ప్రొఫైల్‌ని సృష్టించుకోవాలి. కావాలనుకుంటే ఇంటి చిరునామానూ జోడించుకోవచ్చు. అదనంగా పది ఈమెయిల్‌ చిరునామాలు, ఫోన్‌ నంబర్లనూ జత చేసుకోవచ్చు.
  • అనంతరం ‘డన్‌’ బటన్‌ మీద క్లిక్‌ చేస్తే చాలు. తొలి స్కానింగ్‌ చేసేస్తుంది. డార్క్‌ వెబ్‌లో ఏదైనా సమాచారం కనిపిస్తే దానికి సంబంధించి పూర్తి నివేదికను అందిస్తుంది.

అందరికీ అందుబాటులో

డార్క్‌ వెబ్‌ రిపోర్టింగ్‌ ఫీచర్‌ అందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే గూగుల్‌ వన్‌ చందాదారులకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తుంది. ఇంకాస్త ఎక్కువ వివరాలను నియంత్రించుకోవచ్చు. అప్పటికప్పుడు నోటిఫికేషన్లు అందుకోవచ్చు. చందా తీసుకోనివారైతే ఒక్కసారే స్కాన్‌ చేసుకోవటానికి వీలుంటుంది.


ఇంటర్నెట్‌లో భాగమే

డార్క్‌ వెబ్‌ పేరు అదేదో చీకటి సామ్రాజ్యం, నేరగాళ్లకే పరిమితం అనే భావన కలిగిస్తుంది. దొంగిలించిన ఫోన్‌ నంబర్లను హ్యాకర్లు అమ్ముకోవటం, మాదక ద్రవ్యాలను ఆన్‌లైన్‌లో ప్రచారం చేసుకోవటం వంటి దృశ్యాలే గోచరిస్తాయి. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఇదీ అంతర్జాలంలో ఒక భాగమే. సుమారు 5% అంతర్జాలం ఇలాంటి రహస్య వెబ్‌సైట్లతో కూడుకొని ఉంటుంది. వీటిని చేరుకోవటానికి టోర్‌ బ్రౌజర్లు కావాలి. ఇవి అంతర్గత నెట్‌వర్క్‌లో మన వెబ్‌ ట్రాఫిక్‌ను రహస్యంగా ఉంచుతాయి. సక్రమమైన వ్యాపారాలకూ, వ్యక్తిగత సమాచార గోప్యతకూ ఎంతోమంది దీన్ని వాడుతుంటారు. డార్క్‌ వెబ్‌సైట్లు ఎన్‌క్రిప్షన్‌ సాఫ్ట్‌వేర్‌ను వాడుకుంటాయి. అందువల్ల యూజర్లు, యజమానుల గురించి ఎవరికీ తెలియదు. కాబట్టే కొందరు వీటిని అక్రమ వ్యవహారాలకు వాడుకుంటూ ఉంటారు. అయితే ఇది కేవలం మోసగాళ్లకే పరిమితం కాదు. రోజూ 27 లక్షల మంది డార్క్‌ వెబ్‌ను, అదీ న్యాయసమ్మత వ్యవహారాలకే వాడుకోవటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని