డ్రైవ్‌లోనే డాక్యుమెంట్‌ లాక్‌

గూగుల్‌ వర్క్‌స్పేస్‌ వాడుతున్నారా? సహోద్యోగులతో డాక్యుమెంట్స్‌ పంచుకుంటున్నారా? వాళ్లు మార్పులు, చేర్పులు చేస్తారేమోనని భయపడుతున్నారా? ఇకపై అలాంటి సందేహం అక్కర్లేదు. గూగుల్‌ డ్రైవ్‌లోనే ఫైళ్లను లాక్‌ చేసే సులభమైన కొత్త ఫీచర్‌ రాబోతోంది.

Published : 13 Sep 2023 00:35 IST


గూగుల్‌ వర్క్‌స్పేస్‌ వాడుతున్నారా? సహోద్యోగులతో డాక్యుమెంట్స్‌ పంచుకుంటున్నారా? వాళ్లు మార్పులు, చేర్పులు చేస్తారేమోనని భయపడుతున్నారా? ఇకపై అలాంటి సందేహం అక్కర్లేదు. గూగుల్‌ డ్రైవ్‌లోనే ఫైళ్లను లాక్‌ చేసే సులభమైన కొత్త ఫీచర్‌ రాబోతోంది. షేర్‌ చేసుకున్న ఫైళ్లలో ఇతరులు అవాంఛిత వ్యాఖ్యానాలు, మార్పులను నిలువరించటం దీని ఉద్దేశం. అందుకే దీన్ని విప్లవాత్మకమైన ఫీచర్‌గా భావిస్తున్నారు. చాలామందితో షేర్‌ చేసుకునే డాక్యుమెంట్ల రక్షణకిది బాగా తోడ్పడుతుంది. ఫైలును లాక్‌ చేయగానే అది రీడ్‌ ఓన్లీ పద్ధతిలోకి మారిపోతుంది. అంటే చూసేవారు దాన్ని సవరించటం, వ్యాఖ్యానించటం, సూచనలు రాయటం సాధ్యం కాదు. డాక్యుమెంటు యజమాని అన్‌లాక్‌ చేసేంతవరకు అది రీడ్‌ ఓన్లీ మోడ్‌లోనే ఉంటుంది. ఇప్పటివరకు డాక్యుమెంట్‌ లేదా ఫైలును షేర్‌ చేసేటప్పుడు ముందుగా లాక్‌ (ప్రొటెక్ట్‌) చేసుకునే సదుపాయం ఉంది. లేదా గూగుల్‌ డ్రైవ్‌ ఏపీఐ ద్వారా లాక్‌ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్‌ ఈ పనిని తేలికగా చేసేస్తుంది. గూగుల్‌ డ్రైవ్‌లోకి వెళ్లి, లాక్‌ చేయాలనుకునే ఫైలు మీద రైట్‌ క్లిక్‌ చేసి ‘ఫైల్‌ ఇన్ఫర్మేషన్‌’ను ఎంచుకోవాలి. అనంతరం లాక్‌ ఆప్షన్‌ను ఎంచుకొని, కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి. ఒకసారి లాక్‌ అయితే చాలు. అన్‌లాక్‌ చేసేంతవరకు మరెవరూ దానిలో సవరణలు చేయటానికి వీలుండదు. డాక్యుమెంట్‌ యజమాని కాంటెక్స్ట్‌ మెనూ ద్వారా అన్‌లాక్‌ చేయొచ్చు. కొన్ని ర్యాపిడ్‌ రిలీజ్‌ డొమైన్లకు కొత్త ఫీచర్‌ అమలును ఆరంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని